Abn logo
Oct 21 2021 @ 03:48AM

రివర్స్‌ ‘కథలు’

  • 6,300 మెగావాట్లతో ప్లాంట్లు పెడతారట!
  • అసలు సామర్థ్యమే 1,773 మెగావాట్లు.. 
  • అంతకు 3 రెట్లు ‘రివర్స్‌’ లక్ష్యం
  • నిధులెక్కడ? నీటి వనరులు ఏవి?
  • 1,350 మె.వాకే 10 వేల కోట్లు అవసరం
  • ఎగువ సీలేరుపై వాప్కోస్‌ నివేదిక
  • 6,300 మెగావాట్లకు 47 వేల కోట్లు!
  • ఎక్కడి నుంచి తెస్తారు.. ఎలా పెడతారు?
  • రివర్స్‌ పంపింగ్‌ విద్యుత్‌ ప్లాంట్లపై హడావుడి


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని... ఓ సామెత! థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు అవసరమైన బొగ్గు సమకూర్చలేకపోయారుకానీ... ఏకంగా 6,300 మెగావాట్ల ‘రివర్స్‌ పంపింగ్‌’ జలవిద్యుత్‌ కేంద్రాలు పెట్టేస్తారట! ఎంత ఖర్చు అవుతుంది? నిధుల అందుబాటు సంగతేమిటి? అసలు ఆలోచించే చెప్పారా? ఇవేవీ తెలియదు. కానీ... సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిపిన సమీక్షలో ఏకంగా ‘రివర్స్‌ పంపింగ్‌’ విధానంలో 6,300 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ఇది విని... కరెంటు ఆఫీసర్లకే షాక్‌ కొట్టింది. ఎందుకంటే... 6,300 మెగావాట్ల  రివర్స్‌ పంపింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు సుమారు రూ.47వేల కోట్లు కావాలి. అంత డబ్బు ఎక్కడిది..  అసలు ఇది ఆచరణ సాధ్యమేనా? అని విద్యుత్‌ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. 


ఎగువ సీలేరులో ఇలా...

ఎగువ సీలేరులో మరో 1350 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ విద్యుత్కేంద్రాన్ని ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలనే ప్రతిపాదన ఎన్నాళ్లుగానో ఉంది. దీనికి రూ.10 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ లెక్కన 6300 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ విద్యుత్కేంద్రాలకు రూ.47వేల కోట్లు అవసరం. థర్మల్‌ ప్లాంట్లను షట్‌డౌన్‌ చేయడం, సంప్రదాయేతర ఇంధన వనరులైన సౌర, పవన విద్యుత్తుపై అతిగా ఆధారపడటం మంచిది కాదని కేంద్రం రాష్ట్రాన్ని హెచ్చరించింది. అదే సమయంలో... థర్మల్‌ వల్ల వచ్చే కాలుష్యాన్నీ తగ్గించాల్సిన అవసరమూ నెలకొంది. ఈ నేపథ్యంలో వీలైనన్ని చోట్ల రివర్స్‌ పంపింగ్‌ విద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఇందులో భాగంగానే... సీలేరులో రివర్స్‌ పంపింగ్‌ విధానంపై ఏపీ జెన్కో దృష్టి సారించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కో్‌సతో సర్వేను నిర్వహించింది. మూడు నెలల కిందట డీపీఆర్‌నూ సిద్ధం చేసింది. ఎగువ సీలేరులో రివర్స్‌ పంపింగ్‌ విధానంలో విద్యుత్కేంద్రం ఏర్పాటుకు దాదాపు రూ.10,000 కోట్ల వ్యయం అవుతుందని వాప్కోస్‌ అంచనా వేసింది.  ప్లాంటు ఏర్పాటుకు దాదాపు అన్ని అనుమతులు వచ్చాయి.


కానీ... కీలకమైన పర్యావరణ అనుమతులు మాత్రం పెండింగ్‌! ఇదీ ఎగువ సీలేరు పరిస్థితి. ఆ సంగతి అలా ఉండగానే... ముఖ్యమంత్రి జగన్‌ ఏకంగా 6300 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ ప్లాంట్లు పెట్టేయాలని ఆదేశించారు. ఆయన ఆదేశించడమే తరువాయి,  అవి అమలులోకి వచ్చేసినట్లుగా, ‘ఇక పవర్‌ ఫుల్‌’ అంటూ... ఇంధనశాఖ హడావుడి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్‌.. నెల్లూరు జిల్లా పోమశిల, కడప జిల్లా గండికోట రిజర్వాయర్ల వద్ద కూడా రివర్స్‌ పంపింగ్‌ విద్యుత్కేంద్రాలను నిర్మించవచ్చని పేర్కొంది. అయితే... ఏకంగా 6300 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాజెక్టులు ఉన్నాయా అని నిపుణులు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పైగా.. జెన్కో ఆర్థికంగా కష్టాల్లో ఉంది. 


పద్ధతి మార్చి... 

2019లో వైసీపీ సర్కారు వచ్చాక విద్యుత్‌ రంగంలో అనేక అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంది. బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు షట్‌డౌన్‌ ప్రకటించింది. ఓపెన్‌ మార్కెట్లో విద్యుత్తును కొనుగోలు చేసే కొత్త విధానానికి దిగింది. కృష్ణపట్నం, ఆర్‌టీపీపీ థర్మల్‌ విద్యుత్కేంద్రాలను మూసేసింది. ఒకవైపు సంప్రదాయేతర ఇంధనంపై అతిగా ఆధారపడడం .. మరోవైపు బహిరంగ మార్కెట్లో విద్యుత్తు కొంటే సరిపోతుందనే విధానం ప్రమాదకరమని కేంద్ర ఇంధన శాఖ రాష్ట్రానికి హెచ్చరించింది. సంక్షోభం తలెత్తితే వెనువెంటనే  థర్మల్‌ యూనిట్లలో ఉత్పత్తిని ప్రారంభించేందుకు సాధ్యం కాదని వెల్లడించింది. కేంద్రం హెచ్చరికలు ఇప్పుడు నిజమయ్యాయి.  


ఇప్పటిదాకా ఉన్నవివే...

శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో రివర్స్‌ పంపింగ్‌ విధానం అమలులో ఉంది. అయితే... ఇవి రెండూ తెలంగాణ పరిధిలోనే ఉన్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలోనే రివర్స్‌ పంపింగ్‌ విఽధానంలో జల విద్యుత్కేంద్రాలను నిర్మించేందుకు వీలుగా టెయిల్‌పాండ్‌లను నిర్మించారు.  రివర్స్‌ పంపింగ్‌ ద్వారా విద్యుదుత్పత్తి చేసేందుకు సాధారణం కంటే 50 శాతం అదనంగా ఉత్పత్తి అవుతుందని... బాగా అవసరమైనప్పుడు, పీక్‌ టైమ్‌లో మాత్రమే ఈ పంపులను వాడతామని తెలిపారు. రివర్స్‌ పంపింగ్‌ విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు కనీసం మూడేళ్ల సమయం అవసరమని చెప్పారు.


అసలు ఉన్నదే 1,773 మెగావాట్లు

ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం జలవిద్యుదుత్పత్తి  ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం 1773.6 మెగావాట్లు మాత్రమే. ఇందులో... శ్రీశైలం కుడిగట్టు వాటాయే 770 మెగావాట్లు. ఇంకా... మాచ్‌ఖండ్‌ 60 మెగావాట్లు, తుంగభద్ర 36 మెగావాట్లు, హంపి 36 మెగావాట్లు, అప్పర్‌ సీలేరు 240, డొంకరాయి 25, లోయర్‌ సీలేరు 460, నాగార్జునసాగర్‌ కుడికాలువ 90, నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ 30 మెగావాట్లు, పెన్నహోబిలం 20 మెగావాట్లు, చెట్టిపేట మినీ హైడల్‌ ప్లాంట్లు ఉన్నాయి. కొత్తగా నిర్మించాలని భావిస్తున్న, నిర్మిస్తున్న పోలవరం హైడల్‌ సహా మిగిలినవన్నీ కలుపుకొన్నా... మొత్తం 4313 మెగావాట్లు. కానీ... రివర్స్‌ పంపింగ్‌ ద్వారా అంతకుమించి, ఏకంగా 6300 మెగావాట్ల ఉత్పత్తి సాధించాలని సీఎం సంకల్పించుకోవడమే నిపుణులను విస్మయపరుస్తోంది. 


నీటి వనరులెలా? 

రివర్స్‌ పంపింగ్‌ విధానంలో 6300 మెగావాట్ల  ప్రాజెక్టులు నిర్మించాలంటే... సుమారు 47వేల కోట్లు అవసరం. నిధుల సంగతి పక్కనపెడితే, నీటి వనరులు ఎక్కడ? అనే ప్రశ్న తలెత్తుతోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం... నెల్లూరు జిల్లా సోమశిల, కడప జిల్లా గండికోట రిజర్వాయర్ల వద్ద రివర్స్‌ పంపింగ్‌ విధానంలో విద్యుత్కేంద్రాలను నిర్మించవచ్చు.   పోలవరం హైడల్‌ ప్రాజెక్టు కోసం పట్టిసీమ ఎత్తిపోతలను రివర్స్‌ పంపింగ్‌ కోసం వినియోగించుకున్నా.. 6300 మెగావాట్ల సామర్థ్యం సాధించడం కష్టమే అని నిపుణులంటున్నారు.


‘ఎగువ సీలేరు’కు గ్రీన్‌సిగ్నల్‌

1350 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి: ఇంధన శాఖ

రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేసేందుకు వీలుగా రివర్స్‌ పంపింగ్‌ విధానంలో జల విద్యుత్కేంద్రాలను చేపట్టాలని నిర్ణయించినట్లుగా ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ సీలేరులో 1350 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ విద్యుత్కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ‘‘గుంటువాడ రిజర్వాయరు (అప్పర్‌ సీలేరు)లో 1.70 టీఎంసీల నీటిని విద్యుత్తు వినియోగం కోసం వాడాక.. దిగువ సీలేరులోని డొంకరాయి రిజర్వాయరులోకి పంపిస్తాం. మళ్లీ ఈ నీటిని ఎగువ సీలేరుకు పంప్‌ చేస్తాం. ’’ అని తెలిపారు. ఇంధన రంగంలో దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలోనే దీనిని చేపట్టామన్నారు. ఇదే అంశంపై జెన్‌కో ఎండీ బి.శ్రీధర్‌  స్పందించారు. ‘‘ఎగువ సీలేరులో 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 9 యూనిట్ల ద్వారా 1350 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తాం.  ప్రాజెక్టు కోసం 410 హెక్టార్ల భూమి అవసరమవుతుంది.’’  అని తెలిపారు.


‘రివర్స్‌ పంపింగ్‌’ అంటే..

సీఎం ఆదేశాల నేపథ్యంలో ‘రివర్స్‌ పంపింగ్‌ విద్యుత్కేంద్రాల’పై సామాన్యుల్లోనూ ఆసక్తి ఏర్పడింది. అసలేమిటి రివర్స్‌ పంపింగ్‌ అనే అంశంపై చర్చ మొదలైంది. పేరులో ఉన్నట్లే... ఒకసారి వాడిన నీళ్లను మళ్లీ వెనక్కి పంప్‌ చేసి, మళ్లీ విద్యుత్తు ఉత్పత్తి చేయడమే ‘రివర్స్‌ పంపింగ్‌’! జల విద్యుత్‌ కేంద్రాల నుంచి విడుదలైన నీరు నేరుగా నదిలో కలిసిపోతుంది. జల విద్యుత్తు ఎంతగా ఉత్పత్తి చేస్తే... అంత నీరు కిందికి వదలాల్సిందే! అందుకే... డ్యామ్‌లకు భారీగా ఇన్‌ఫ్లో ఉన్నప్పుడే జల విద్యుదుత్పత్తి చేస్తారు. అలాకాకుండా... ‘రివర్స్‌ పంపింగ్‌’ చేస్తే అదే నీటితో మళ్లీ మళ్లీ కరెంటు ఉత్పత్తి చేయవచ్చు. దీనికోసం... దిగువన మరో రిజర్వాయరును ఏర్పాటు చేసి దాని నుంచి మళ్లీ నీటిని ప్రధాన జలాశయంలోకి పంపింగ్‌ చేయాల్సి ఉంటుంది. అంటే... ప్రతిచోటా ఎత్తిపోతల పథకాలు చేపట్టాలన్న మాట!