కొవిడ్‌ నియంత్రణపై ప్రతిరోజూ సమీక్షించండి

ABN , First Publish Date - 2021-08-04T06:13:58+05:30 IST

‘జిల్లాలోని 21 మండలాల్లో కొవిడ్‌ కేసుల పాజిటివిటీ రేటు పెరుగుతోంది. ఈ క్రమంలో మండల, మున్సిపల్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ప్రతిరోజూ గంటపాటు సమీక్షించాలి.

కొవిడ్‌ నియంత్రణపై ప్రతిరోజూ సమీక్షించండి

మండల, మున్సిపల్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు కలెక్టర్‌ సూచన 

కంటైన్మెంట్‌ జోన్లలో జీవో 371 అమలు


తిరుపతి సిటీ, ఆగస్టు 3: ‘జిల్లాలోని 21 మండలాల్లో కొవిడ్‌ కేసుల పాజిటివిటీ రేటు పెరుగుతోంది. ఈ క్రమంలో మండల, మున్సిపల్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ప్రతిరోజూ గంటపాటు సమీక్షించాలి. కొవిడ్‌ నియంత్రణకు చర్యలు చేపట్టాలి’ అని కలెక్టర్‌ హరినారాయణన్‌ సూచించారు. తిరుపతిలోని ఆర్డీవో కార్యాలయం నుంచి మంగళవారం ఆయన జేసీ (హెల్త్‌) వీరబ్రహ్మంతో కలిసి మండల, మున్సిపల్‌ టాస్క్‌ఫోర్స్‌, మెడికల్‌ ఆఫీసర్లతో వీడియో కాన్ఫ్‌రెన్స్‌ నిర్వహించారు. కొవిడ్‌ కట్టడికి టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌, వ్యాక్సినేషన్‌పై సీరియస్‌గా వ్యవహరించాలన్నారు. ‘గత వారం జిల్లాలో పాజిటివిటీ రేటు 2.48 నుంచి 2.76కు చేరింది. పాజిటివ్‌ యాక్టివ్‌ కేసులూ 2400 నుంచి 3100 కు పెరిగాయి. దీనిని ప్రమాద హెచ్చరికలుగా గుర్తించి.. కొవిడ్‌ కట్టడి చర్యల్లో అప్రమత్తంగా ఉండాలి. కొవిడ్‌ లక్షణాలున్న వారిని గుర్తించి పరీక్షలు చేసి.. పాజిటివ్‌ వస్తే ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌నూ గుర్తించి టెస్టులు చేయాలి. బాధితులను తక్షణమే కొవిడ్‌ కేంద్రాలకు, ఆస్పత్రులకు తరలించాలి’ అని కలెక్టర్‌ స్పష్టంచేశారు. సోషల్‌, రెలిజియస్‌ కార్యక్రమాల్లో భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి కొవిడ్‌ నిబంధనలు అమలయ్యేలా చూడాలన్నారు. రేణిగుంట, తవణంపల్లె, సదుం, చిత్తూరు అర్బన్‌, తిరుపతి అర్బన్‌, నగరి, చిన్న పాండూరు, గంగవరం, బైరెడ్డిపల్లె ప్రాంతాల్లోని కంటైన్మెంట్‌ జోన్లలో జీవో 371ని ఖచ్చితగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జరిమానాలు, దుకాణాల సమయం, కాంటాక్ట్స్‌ ట్రేసింగ్‌ వంద శాతం అమలు కావాలన్నారు. కొవిడ్‌ పరీక్షా ఫలితాలు అదే రోజు వచ్చేలా చూడాలని, హోం ఐసొలేషన్‌లోని వారి పరిస్థితిపై ప్రతిరోజూ ఆరా తీయాలన్నారు. చిన్నారుల తల్లులు, టీచర్లు, 45 ఏళ్లు పైబడిన వారికి రెండో డోస్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. 90 శాతం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలన్నారు. సచివాలయాల్లో 100 శాతం హాజరుతో పాటు సేవలను విస్తృతం చేయాలని సూచించారు. పింఛను, రేషన్‌ కార్డులు, ఇంటి పట్టాలు, ఆరోగ్యశ్రీ కార్డుల సమస్యలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో తిరుపతి నుంచి డీఎంహెచ్‌వో శ్రీహరి, కార్పొరేషన్‌ మెడికల్‌ ఆఫీసర్‌ హరికృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు అరుణ, సులోచన, ఆర్‌ఆర్‌ రెడ్డి, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ మధుసూదన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-04T06:13:58+05:30 IST