‘విద్యాదీవెన’పై తీర్పును పునఃసమీక్షించండి

ABN , First Publish Date - 2021-11-26T09:36:41+05:30 IST

‘విద్యాదీవెన’పై తీర్పును పునఃసమీక్షించండి

‘విద్యాదీవెన’పై తీర్పును పునఃసమీక్షించండి

హైకోర్టులో ప్రభుత్వం అభ్యర్థన... తీర్పు వాయిదా 

అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): జగనన్న విద్యాదీవెన కింద అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్మును కళాశాలల అకౌంటర్లలోనే జమ చేయాలని, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయడానికి వీల్లేదని సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ హైకోర్టులో గురువారం విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ స్పందిస్తూ.... కోర్టు ఆదేశాలకు అనుగుణంగా రీయింబర్స్‌మెంట్‌ సొమ్ము జమ చేసే విషయంలో ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుందన్నారు. తల్లుల ఖాతాల నుంచి సొమ్ము నేరుగా కాలేజీ ఖాతాల్లోకి ఆటో డెబిట్‌ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందుకు కొంత సమయం పడుతుందన్నారు. ఆలోపు తల్లులు ఖతాల్లో జమ అయిన సొమ్మును వారం రోజుల్లో కాలేజీలకు చెల్లించకుంటే సంబంధిత కాలేజీ యాజమాన్యం జ్ఞానభూమి పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరారు. ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల యాజమాన్యం సంఘం అధ్యక్షుడు ఎస్‌హెచ్‌ఆర్‌ ప్రసాద్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ... ప్రభుత్వం తన పాలసీ మార్చుకుందని తీర్పును రివ్యూ చేయమని కోరడానికి వీల్లేదన్నారు. అందుకు చట్ట నిబంధనలు అంగీకరించవన్నారు. వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ కె.విజయలక్ష్మి తీర్పును పునఃసమీక్షించేందుకు ఎలాంటి గ్రౌండ్స్‌ లేవన్నారు. తీర్పు రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. 

Updated Date - 2021-11-26T09:36:41+05:30 IST