భర్త ఆత్మహత్య చేసుకున్న 24 గంటల్లోనే.. భార్య కూడా..

ABN , First Publish Date - 2020-08-12T16:32:03+05:30 IST

కలహాలు, క్షణికావేశం ఆ కుటుంబాన్ని చిదిమేసింది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే..

భర్త ఆత్మహత్య చేసుకున్న 24 గంటల్లోనే.. భార్య కూడా..

భార్యాభర్తల మరణశాసనం

ఇద్దరి ప్రాణాలను చిదిమేసిన కలహాలు 

ఆయన ఆత్మహత్య చేసుకున్న 24 గంటల్లోనే 

ఆ ఇల్లాలు కూడా బలవన్మరణం

ఆమె గిద్దలూరు ఆర్‌ఐ 

అనాథలైన ఇద్దరు చిన్నారులు


గిద్దలూరు(ప్రకాశం): కలహాలు, క్షణికావేశం ఆ కుటుంబాన్ని చిదిమేసింది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే భార్యాభర్తలను పొట్టనపెట్టుకుంది. అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను అనాథల్ని చేసింది. సుస్థిరమైన ప్రభుత్వ ఉద్యోగిగా ఆమె.. ప్రైవేట్‌ ఉద్యోగిగా అతను బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ.. ఇద్దరి మధ్య చిన్న కలహాలు వారిని ఆత్మహత్యల వైపు నడిపించాయి. భర్త మృతదేహానికి పోస్టుమార్టం పూర్తికాకముందే ఆ ఇల్లాలు కూడా ఆత్మహత్య చేసుకొంది. ఈ విషాద సంఘటన గిద్దలూరులో జరిగింది.  


పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్న నుసుం సుశీల(33) మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందే అంటే సోమవారం భర్త గూడా నారాయణరెడ్డి బలవన్మరనానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం... అర్థవీడు మండలం బోగోలుకు చెందిన గూడ నారాయణరెడ్డికి, కురిచేడు మండలం పొట్లపాడుకు చెందిన నుసుం సుశీలకు 2016లో వివాహమైంది. వీరికి ఇరువురు కుమారులు ఉన్నారు. నారాయణరెడ్డి గుంటూరు ఐటీసీ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, సుశీల ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు.


ఏడాదిన్నర నుంచి స్థానిక శ్రీరామ్‌నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా నారాయణరెడ్డి 5 నెలలుగా ఇంటివద్దే ఉంటున్నాడు. వీరి మధ్య కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. క్షణికావేశంలో భర్త నారాయణరెడ్డి సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువులతో కలిసి ఇంట్లో ఉన్న ఆర్‌ఐ సుశీల అర్ధరాత్రి బాత్‌రూమ్‌కు వెళ్లి వాస్మాయిల్‌ తాగి వచ్చి మళ్లీ మంచం మీద పడుకుంది. తెల్లవారినా సుశీల లేవకపోవడంతో బంధువులు నిద్రలేపే ప్రయత్నం చేసినా స్పందనలేదు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సీఐ యు.సుధాకర్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


వైకల్యాన్ని జయించి.. ఉద్యోగంలో రాణిస్తూ...

దాంపత్య జీవనంలో తలెత్తిన చిన్న చిన్న తగాదాలు చినికిచినికి గాలివానగా మారి వారి జీవితంలో పెనువిషాదాన్ని నింపింది. నీతినిజాయితీగా విధులు నిర్వహిస్తూ తోటి ఉద్యోగులతో కలివిడిగా ఉంటూ ఉన్నతాధికారుల మన్ననలు సుశీల పొందారు. కానీ సంసార జీవితానికి వచ్చే సరికి ఒడిదొడుకులను ఎదు ర్కోలేక అర్ధంతరంగా తనువు చాలించడం అందరినీ కలిచివేస్తుంది. ముక్కుపచ్చలారని ఆమె ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. నాలుగేళ్ల నితిన్‌బాలహుస్సేన్‌రెడ్డి, ఏడాదిన్నర వయస్సు ఉన్న రేవంత్‌రెడ్డిలకు ఏమీ తెలియక తల్లిదండ్రుల మృతదేహాల పక్కన ఆడుకుంటూ ఉండటం చూసిన వారు కంటతడి పెట్టారు. 


Updated Date - 2020-08-12T16:32:03+05:30 IST