ముక్కిపోతున్న బియ్యం

ABN , First Publish Date - 2020-09-18T06:05:18+05:30 IST

పేద విద్యార్థులకు కడుపునిండా భోజనం పెట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనం పథకం కరోనాతో నిలిచి పోయింది

ముక్కిపోతున్న బియ్యం

నిలిచిన మధ్యాహ్నభోజనం

జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో 88,199 క్వింటాళ్ల నిల్వ 

ఇప్పటికే పూర్తిగా  దెబ్బతిన్న 9,211 క్వింటాళ్లు


కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 17: పేద విద్యార్థులకు కడుపునిండా భోజనం పెట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనం పథకం కరోనాతో నిలిచి పోయింది. మార్చి 15వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలన్నిటిని మూసి వేశారు. మధ్యాహ్న భోజనం నిలిచి పోయింది. గత విద్యా సంవత్సరం మార్చిలో జిల్లాలోని 649 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం సన్నబియ్యం మంజూరు చేశారు.  ప్రధానోపాధ్యాయులు వాటిని పాఠశాలలకు చేరవేసి విద్యార్థులకు మార్చి 14వ తేదీ వరకు భోజనం పెట్టించారు. మార్చి 15వ తేదీ ఆదివారం సెలవు రోజు కావడం, ఆ మరుసటి రోజు సోమవారం  నుంచి విద్యార్థులు పాఠశాలలకు రావద్దని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మధ్యాహ్న భోజనం పథకం మార్చి 14వ తేదీ రోజు వరకు కొనసాగింది. ఆగస్టు 27 నుంచి ఉపాధ్యాయులందరూ పాఠశాలలకు వెళ్లాలని, సెప్టెంబరు 1వతేదీ నుంచి ఆన్‌లైన్‌ లో విద్యాబోధన చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆగస్టు 27 నుంచి ఉపాధ్యాయులకు విధులకు హాజరువుతున్నారు.  ఈనెల 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నారు.  విద్యార్థులు ఇంటి నుంచే విద్యనభ్యసించాలని సూచించడంతో మధ్యాహ్న భోజనం పథకం పూర్తిగా నిలిచి పోయింది.  ఆరునెలలుగా పాఠశాలల్లోనే బియ్యం ముక్కిపోతున్నాయి. 


ఆరు నెలలుగా పాఠశాలల్లోనే..

జిల్లాలోని 649 పాఠశాలల్లో 88,199.49 క్వింటాళ్ళ బియ్యం నిలువలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వాటిలో ఇప్పటికే 9,211.93 క్వింటాళ్ళ బియ్యం పూర్తిగా దెబ్బతిన్నట్లుగా గుర్తించారు. మిగిలిన వాటిలో 6,207 క్వింటాళ్ల్ళ బియ్యంలో లక్కపురుగు, తెల్లపురుగు చేరి పాక్షింగా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఆరు నెలల నుంచి బియ్యం బయటకు తీయక పోవడంతో మిగిలిన బియ్యం కూడా భోజనానికి పనికి రాక పోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. జూన్‌, జూలైలో మధ్యాహ్న భోజనం పథకం బియ్యం వివరాలను సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా తెలుసుకున్న ప్రభుత్వం ఆ బియ్యం నిల్వలను అక్కడే ఉంచాలని సూచిస్తూ రెండుసార్లు మెమోలు జారీ చేసింది.


దీంతో ప్రధానోపాధ్యాయులు వాటిని పాఠశాలల్లోనే ఉంచారు. ప్రభుత్వం జూన్‌, జూలైలోనైనా పాఠశాలల్లోని బియ్యం నిల్వలను గోదాంలకు తెప్పించుకుంటే బియ్యం పాడై పోయేది కావని పేర్కొంటున్నారు. మిగిలిన బియ్యం పూర్తిగా పాడై పోక ముందే విద్యార్థుల కేటాయింపులను బట్టి వారి తలి ్లదండ్రులకు  ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో వందల టన్నుల సన్నరకం బియ్యం ముక్కి పోవడంతో కోట్ల రూపాయల ప్రజాధనం నిరుపయోగమైందనే భావన వ్యక్తమవుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం కాకుండా బియ్యం పంపిణీ చేయాలని కోరుతున్నారు. 


విద్యార్థుల తల్లిదండ్రులకు బియ్యం పంపిణీ చేయాలి- కోహెడ చంద్రమౌళి, డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

ప్రస్తుతం మధ్యాహ్నం భోజన పథకం అమలు చేసే అవకాశాలు లేనందున పాఠశాలలకు మార్చి నెలలో మంజూరు చేసిన మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు పంపిణీ చేయాలి. ఆరునెలలుగా పాఠశాలల్లో బియ్యం నిలువ చేయడంతో ముక్కిపోయాయి. ఇప్పటికైనా మంచిగా ఉన్న బియ్యంను విద్యార్థుల తల్లిదండ్రులకు పంపిణీ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

Updated Date - 2020-09-18T06:05:18+05:30 IST