వలస కూలీలకు అన్నం కరువు..?

ABN , First Publish Date - 2020-04-05T09:33:50+05:30 IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌ వలస కూలీల పొట్టకొట్టింది

వలస కూలీలకు అన్నం కరువు..?

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కాలిబాటన సొంతూరుకు పయనం 


 మియాపూర్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌ వలస కూలీల పొట్టకొట్టింది. దీంతో ఉపాధి కరువై ఆహారం, నిత్యావసరాల కోసం ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వంతోపాటు దాతలు ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. 


మినీభారత్‌గా పేరుగాంచిన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రియల్‌రంగం ఊపందుకుని భూముల ధరలకు రెక్కలు రావడంతో భవన నిర్మాణరంగం శరవేగంగా అభివృద్ధి చెందింది. దీంతో ఈ ప్రాంతం వలస కూలీలకు, భవన నిర్మాణ కార్మికులకు కేంద్రబిందువైంది. దీంతోపాటు ఈ నియోజకవర్గంలోని హైటెక్‌సిటీలో దాదాపు 300కు పైగా సాప్ట్‌వేర్‌ సంస్థల్లో హౌస్‌కీపింగ్‌, క్యాబ్‌డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులుగా వేలాదిమంది పనిచేస్తున్నారు.


పటాన్‌చెరు, ఐడీఏబొల్లారం, బాచుపల్లి, బీహెచ్‌ఈఎల్‌ లాంటి పారిశ్రామికవాడల్లో పనిచేసే కార్మికులు, సెక్యూరిటీగార్డులు, డ్రైవర్లు మూడొంతులకుపైగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధి అంజయ్యనగర్‌, సిద్దిఖ్‌నగర్‌, భిక్షపతినగర్‌, హఫీజ్‌పేట ప్రేంనగర్‌, ఆదిత్యనగర్‌, సుభా్‌షచంద్రబో్‌సనగర్‌, చందానగర్‌లోని వీకర్‌ సెక్షన్‌కాలనీలు, మియాపూర్‌, లక్ష్మీనగర్‌, ఎంఏనగర్‌, కొండాపూర్‌, రాయదుర్గం, లింగంపల్లి మాదాపూర్‌లోని పర్వత్‌నగర్‌, తండాల్లో నివసిస్తున్నారు. ఇప్పటికే అధికారులు వలస కూలీలను గుర్తించినా ప్రజాప్రతినిధులు మాత్రం 40వేలమంది ఉన్నట్లు అధికారికంగా చెబుతున్నారు. వాస్తవంగా ఇక్కడ వలస కూలీలు రెండులక్షల పై చిలుకు ఉన్నట్లు తెలుస్తోంది.


ఉపాధి లేక గుడిసెలకు పరిమితం

కొన్నిరోజులుగా లాక్‌డౌన్‌తో పనిదొరకక రోజువారీ కార్మికులతో పాటు భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు, అడ్డాకూలీలంతా వారు నివసిస్తున్న గుడిసెలకే పరిమితమవాల్సి వచ్చింది. దీంతో కొందరు కాలినడకన ఇంటిబాట పట్టారు. వారం రోజుల వ్యవధిలోనే 15నుంచి 20వేల మంది ఇళ్లకు వెళ్లి ఉంటారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా వలస కార్మికులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. 


7వేల మందికి సాయం..ఎమ్మెల్యే గాంధీ 

జీహెచ్‌ఎంసీ, రెవెన్యూశాఖలతోపాటు ప్రజాప్రతినిధుల సమాచారంతో నియోజకవర్గంలో 40వేల మంది నిత్యావసరాల కోసం ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించాం. ఇప్పటికే ఐదు నుంచి ఏడువేల మందికి ప్రభుత్వం నుంచి, దాతల నుంచి నిత్యావసర వస్తువులు, వంటసామగ్రి ఇస్తున్నాం. నియోజకవర్గంలో లక్షన్నర నుంచి రెండులక్షల మంది వలసకూలీలు ఉన్నప్పటికీ సొంత ఊళ్లకు వెళ్లినట్లు గుర్తించాం. ఎవరైనా, ఎక్కడైనా తినడానికి తిండిలేక ఇబ్బంది పడుతుంటే ప్రజాప్రతినిధులు, అధికారుల ద్వారా తన దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వమే కాకుండా దాతల సహకారంతో ఇబ్బందుల్లో ఉన్న వారికి సాయం చేయడానికి చర్యలు తీసుకుంటా.  

Updated Date - 2020-04-05T09:33:50+05:30 IST