పేదల బియ్యం స్వాహా!

ABN , First Publish Date - 2021-06-21T06:36:21+05:30 IST

ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేసే మెబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ) పేదల బియ్యం పంపిణీలో అక్రమాలకు తెరలేపింది.

పేదల బియ్యం స్వాహా!

ఆర్‌బీ పట్నంలో ఎండీయూ చేతివాటం
రేషన్‌ బియ్యం పంపిణీలో అక్రమాలు
సుమారు 50 క్వింటాళ్లు స్వాహా చేసినట్టు ఆరోపణలు
విచారణ చేపట్టిన పౌరసరఫరాల శాఖ అధికారులు
విషయం వెలుగులోకి రావడంతో వేరే ఎండీయూతో పంపిణీ

పెద్దాపురం, జూన్‌ 20: ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేసే మెబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ) పేదల బియ్యం పంపిణీలో అక్రమాలకు తెరలేపింది. సుమారు 50 క్వింటాళ్ల మేర పేదల బియ్యాన్ని స్వాహా చేసినట్టు తెలుస్తోంది. వివరాలిలా వున్నాయి... మండల పరిధిలోని ఆర్‌బీ పట్నానికి చెందిన పెంకే శివకుమార్‌ ఎండీయూగా బియాన్ని ఇంటింటికీ సరఫరా చేస్తున్నాడు. ఈ గ్రామంలో రెండు రేషన్‌ దుకాణాలు, సుమారు 600 పైచిలుకు రేషన్‌ కార్డులు ఉన్నాయి. మే నెలలో సుమారు 70 మంది లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయడం మానేశాడు. పైగా పై నుంచి తమకు స్టాకు రాలేదని చెప్పడంతో పాటు లబ్ధిదారుల నుంచి వేలిముద్రలు తీసుకుని  బియ్యం స్వాహా చేసేశాడు. స్టాకు వచ్చిన తర్వాత బియ్యం పంపిణీ చేస్తానని చెప్పడంతో లబ్ధిదారులు నిజమని నమ్మి వెళ్లిపోయారు. ఎన్నిసార్లు అడిగినా స్టాకురాలేదని చెప్తుండేవాడు. ఈ నెల మరో 300 మందికి బియ్యం పంపిణీ చేయడం మానేశాడు. వాళ్ల వేలిముద్రలు తీసుకుని స్టాకు రాలేదని చెప్పి ఆ బియ్యాన్ని కూడా స్వాహా చేయడంతో గ్రామంలో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఈ విషయమై  పౌరసరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టిన అధికారులు బియ్యం పంపిణీ చేయలేదన్న విషయంపై నిర్థారణకు వచ్చారు.
బియ్యం పంపిణీ చేయని మాట వాస్తవమే: ఎం.లక్ష్మీకుమారి, ఎంఎస్‌వో, పెద్దాపురం
కార్డుదారులకు ఎండీయూ బియ్యం పంపిణీ చేయనిమాట వాస్తవమే. దీనిపై గ్రామంలో విచారణ చేశాం. సుమారు 33 క్వింటాళ్ల మేర బియ్యం పంపిణీ చేయలేదని ప్రస్తుతానికి లెక్క తేలింది. పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నాం. ఎండీయూ మీద చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదికలను పంపారు. కార్డుదారులకు ఇబ్బంది తలెత్తకుండా మరో ఎండీయూతో బియ్యం పంపిణీ చేయిస్తున్నాం.

Updated Date - 2021-06-21T06:36:21+05:30 IST