అన్నం పరబ్రహ్మ స్వరూపం

ABN , First Publish Date - 2020-05-22T10:00:53+05:30 IST

భగవంతుడిని ఉపాసించే సాధకులకు కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. ముఖ్యంగా.. ‘అన్నం న నింద్యాత్‌’ అని తైత్తరీయోపనిషత్‌లోని భృగువల్లి చెబుతుంది. ‘అన్నాన్ని

అన్నం పరబ్రహ్మ స్వరూపం

భగవంతుడిని ఉపాసించే సాధకులకు కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. ముఖ్యంగా.. ‘అన్నం న నింద్యాత్‌’ అని తైత్తరీయోపనిషత్‌లోని భృగువల్లి చెబుతుంది. ‘అన్నాన్ని నిందించరాదు’ అని దాని అర్థం. ‘‘ప్రపంచంలో కడుపు నిండా ఆహారాన్ని తినలేనివారు ఎందరో ఉండగా నీవు తిన గలుగుతున్నావు. కాబట్టి లభించిన అన్నాన్ని దైవ ప్రసాదంగా స్వీకరించాలే తప్ప నిందించడం, నిరాకరించడం, రుచిగా లేదని ఈసడించడం కూడదు’’ అని ఉపనిషత్తు హెచ్చరిస్తోంది. అంతే కాదు.. ‘అన్నం బహు కుర్వీత’ అంటుంది. అంటే.. అన్నాన్ని ఎక్కువగా సంపాదించాలి, ఆకలితో వచ్చిన అతిథులకు గౌరవంతో భక్తి శ్రద్ధలతో ఆ ఆహారాన్ని సమర్పించాలి అని దాని అర్థం. నిరసన భావంతో భోజనాన్ని పెట్టడం దోషమని.. అన్నార్తులకు పెట్టకుండా తానొక్కడే భుజించే వాడు పాపాన్ని మాత్రమే భుజిస్తున్నాడని ఉపనిషత్తు హెచ్చరిస్తోంది.


ఉపనిషత్‌ వాజ్ఞ్మయం ప్రకారం అన్నం అంటే ప్రాణం. ఆ ప్రాణానికి ఆశ్రయమిచ్చే శరీరాన్ని ‘అన్నాదం’ అంటారు. ప్రాణం, శరీరం రెండూ పరస్పరాధారితాలు. అన్నం భోగించదగినది కాగా అన్నాదం (శరీరం) భోగించి ఆనందించగలిగిన సామర్థ్యం. జీవితంలో ఒక్కటిగా ఏదీ సమగ్రతను సంతరించుకోలేదు. రెండింటి సమన్వయమే ఆనందానికి మూలకారణం అవుతుంది. 


భగవదుపాసనలో భావన ప్రధానమైనది. ఐహిక జగత్తులో యోగక్షేమాలను (యోగం అంటే మనకు లేనిది పొందడం, క్షేమం అంటే పొందిన దానిని రక్షించుకోవడం) పొందేందుకు.. ఆధ్యాత్మిక జగత్తులో మహత్వాన్ని (సృష్టి అంతటా తనను, తనలో సృష్టినంతటినీ చూసుకోగలిగే శక్తి) పొందే లక్ష్యంతో ఉపాసించే విధానంలో శారీరక మానసిక సన్నద్ధత కావాలి. అంటే శరీరమూ మనస్సూ పోషింపబడాలి. అది అన్నం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఏ ఫలితాన్ని ఆశించి ఉపాసిస్తున్నామో ఆయా లక్షణాలన్నీ భగవంతుని రూపంలో మన ముందున్నట్లుగా ఊహిస్తూ వాటిపై మనస్సును నిలపాలి. వాటిని చూస్తున్నట్లు, తాకుతున్నట్లు, ఆయా అనుభూతులను పొందుతున్నట్లు ఎంత స్పష్టంగా ఊహించుకోగలిగితే, లక్ష్యసాధనకు అంత దగ్గర కాగలుగుతాం. లక్ష్యంపై దృష్టిని కేంద్రీకరించి భగవదుపాసన చేయడం అంటే మనలోకి మనం చూసుకోగలిగే సాధన చేయడమే.


ఏదో రాసుకుంటున్న ఒక పిచ్చివాణ్ని.. ‘ఏం రాసుకుంటున్నావ’ని మరొక పిచ్చివాడు అడిగాడు. ఉత్తరం రాస్తున్నానన్నాడు మొదటి వాడు. ‘ఎవరికి?’.. రెండవవాడి ప్రశ్న. ‘నాకే’.. మొదటివాడి జవాబు. ‘ఏం రాసావందులో?’.. రెండవ వాడి ప్రశ్న. ‘ఏమో నాకేం తెలుసు, ఉత్తరం వస్తే... నేను చదివితే కదా తెలిసేది’ అన్నాడు మొదటి వాడు. ‘ఔను కదా’ అనుకుంటూ వెళ్లాడు రెండోవాడు. నేను నాది రెండూ ఒకటే. ఒకటి అన్నం, రెండోది అన్నాదం. అంతర్వాణికి సమాచారాన్ని పంపుతాం, అంతర్వాణి నుండి సమాచారం పొందుతాం. ఆ సమన్వయ సాధనే ఉపాసన. దానికి కావలసింది నిష్ఠ.

-పాలకుర్తి రామమూర్తి, 9441666943




Updated Date - 2020-05-22T10:00:53+05:30 IST