వరి వేయండి.. కొనుగోలు బాధ్యత నాది

ABN , First Publish Date - 2021-12-01T09:37:11+05:30 IST

యాసంగిలో రైతులు వరి సాగు చేస్తే మంచి ధరకు కొనుగోలు చేయించే బాధ్యత తనదని మిర్యాలగూడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు హామీ ఇచ్చారు.

వరి వేయండి.. కొనుగోలు బాధ్యత నాది

  • సాగర్‌ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయిస్తా
  • మిల్లర్లతో మంచి ధరకు సన్న వడ్లు కొనిపిస్తా
  • మిర్యాలగూడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే భాస్కర్‌రావు

మిర్యాలగూడ, నవంబరు 30: యాసంగిలో రైతులు వరి సాగు చేస్తే మంచి ధరకు కొనుగోలు చేయించే బాధ్యత తనదని మిర్యాలగూడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు హామీ ఇచ్చారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ నియోజకవర్గ రైతులు యాసంగిలో సన్న ధాన్యం పండిస్తే మంచి ధరకు మిల్లర్లతో పంటను కొనుగోలు చేయిస్తానని భరోసా ఇచ్చారు. ఎవరు ఏం చెప్పినా రైతులు అయోమయానికి గురి కావద్దన్నారు. వరి సాగు చేసేందుకు నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు నీటిని విడుదల చేయిస్తానని తెలిపారు. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోలుపై రైస్‌ మిల్లర్లతో చర్చించానని, మెట్టపంటలు వేసుకునే అవకాశం ఉన్న రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండించాలని కోరారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రైతు సమస్యలపై ధర్నాకు దిగిన కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌ ఏనాడై నా రైతులు పొలాల్లో నాట్లు వేయడం, కోతలు కోయ డం చూశారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి ఊరికే రాద్ధాంతం చేస్తే సమస్య సమసిపోదన్నారు. చత్తీస్‌గఢ్‌ నుంచి ధాన్యం బస్తా రూ.1,480కే మిర్యాలగూడ మిల్లులకు డెలివరీ చేస్తున్నారని తెలిపారు. మిల్లర్లతో లాలూచీ పడుతున్నారనే ఆరోపణలు సరికాదని భాస్కర్‌రావు అన్నారు.

Updated Date - 2021-12-01T09:37:11+05:30 IST