ఘనంగా ఆదివాసీ దినోత్సవం

ABN , First Publish Date - 2020-08-10T06:32:16+05:30 IST

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పలువురు నేతలు, అధికారులు, సంఘాల నాయకులు వేడుకల్లో పాల్గొన్నారు.

ఘనంగా ఆదివాసీ దినోత్సవం

జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు 

కొవిడ్‌ నేపథ్యంలో కానరాని ఉత్సాహం

రాష్ట్రంలోనే తొలిసారి ప్రపంచ ఆదివాసీ జెండా ఆవిష్కరణ

వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఐటీడీఏ పీవో

జెండాలు ఎగురవేసిన సంఘాల నాయకులు 

(భద్రాద్రికొత్తగూడెం జిల్లా నెట్‌వర్క్‌)


ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పలువురు నేతలు, అధికారులు, సంఘాల నాయకులు వేడుకల్లో పాల్గొన్నారు. మండల కేంద్రాలు, గ్రామాల్లో ఆదివాసీ జెండాలను ఎగురవేశారు. అయితే కరోనా భయం నేపథ్యంలో గతంలో జరిగిన వేడుకల కంటే ఈ ఏడాది ఉత్సాహం తగ్గినట్టు కనిపించింది. ర్యాలీలు, బహిరంగసభలు, ఆదివాసీ సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండా నిరాడంబరంగా జరిగాయి. కొద్ది మంది ముఖ్య నాయకులు మాత్రమే జెండాలు ఎగురవేసి.. ఆదివాసీ అమరులకు నివాళులర్పించారు.


లక్ష్మీదేవిపల్లి మండలంలోని కొమరంభీమ్‌ కాలనీలోని ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ, సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య పాల్గొన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రపంచ ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన అత్యంత వెనుకబడి ఉన్న ఆదివాసీలకు అండగా ఉంటామన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, జీవన, ఆరోగ్య స్థితిగతులను మెరుగు పరుచుకోవడమే లక్ష్యంగా ప్రతీ ఏటా ఈ వేడుకలు జరుపుతున్నామన్నారు.


కార్యక్రమంలో  ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ, సాంస్కృతిక సంఘం జిల్లా అధ్యక్షుడు పెండకంట్ల కృష్ణయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు. భద్రాచలం ఆదివాసీ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న కొమరం బీం విగ్రహం, అంబేద్కర్‌ సెంటర్లో ఉన్న అంబేద్కర్‌ విగ్రహం, అల్లూరి సీతారామరాజు, ఘంటందొర, మల్లుదొర విగ్రహాలలకు పూలమాల వేసి ఘనంగా నివాళ్లర్పించారు. అలాగే ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య చిత్రపటం వద్ద కూడా నివాళ్లర్పించారు.


కార్యక్రమంలో ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్‌ జహీరుద్దీన్‌, ఆదివాసీ సీనియర్‌ నాయకులు డాక్టర్‌ తెల్లం వెంకట్రావు, పాయం రవివర్మ,  తదితరులు పాల్గొన్నారు. టీఏజీఎస్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీఏజీఎస్‌ జిల్లా కార్యదర్శి సరియం కోటేశ్వరరావు ఆదివాసీ గిరిజన సంఘం జెండాను ఆవిష్కరించి ఆదివాసీ పోరాటయోధులకు నివాళులర్పించారు. ఐటీడీఏ పీవో పోత్రు గౌతమ్‌ స్థానిక అంబేద్కర్‌ సెంటర్లోని ఆదివాసీ అమరవీరుల విగ్రహాలకు నివాళ్లర్పించారు.  కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో జనరల్‌ నాగోరావు పాల్గొన్నారు. 


అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం మందలపల్లిలోని సోయం గంగులు విగ్రహానికి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆదివాసీ సంఘాలతో కలసి క్షీరాభిషేకం చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు జారె అదినారాయణ, తదితరులు పాల్గొన్నారు. పాల్వంచ బస్టాండ్‌ సెంటర్‌లోని కొమరంభీమ్‌ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర నాయకుడు, జిల్లా మాజీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నివాళులర్పించారు. మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు పాల్గొన్నారు.


ఆదివాసీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అశ్వాపురంలో డీసీసీబీ డైరెక్టర్‌ తుళ్లూరి బ్రహ్మయ్య జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు షర్పుద్ధీన్‌ పాల్గొన్నారు. ఇల్లెందులో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జానీపాష, తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్‌(ఏఎస్‌పీ), ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ), ఆదివాసీ జేఏసీ, ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. దుమ్ముగూడెం, గుండాల, బూర్గంపాడు, జూలూరుపాడు మండలాల్లో ఆయా ఆదివాసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతనిధులు వేగుకల్లో పాల్గొన్నారు.


లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడుచెలకలో జరిగిన వేడుకల్లో ఆదివాసీ ఐక్యకార్యచరణ సమితి జిల్లా అధ్యక్షుడు వాసం  రామకృష్ణ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆదివాసీ సంక్షేమ సంఘం, ఉద్యోగ జేఏసీ, ఇతర అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కిష్టారం ఓసీపీ పీవో వి.కృష్ణయ్య పాల్గొన్నారు. ఆదివాసీపోరాట యోధులతో పాటు గతేడాది ఆదివాసీ దినోత్సవానికి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారికి కూడా నివాళులర్పించారు. 

Updated Date - 2020-08-10T06:32:16+05:30 IST