Abn logo
Sep 19 2021 @ 23:06PM

ఘనంగా వినాయక నిమజ్జనం

గవ్వలపల్లిలో పూజలు నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పట్లోరి రాజు

రామాయంపేట/పెద్దశంకరంపేట/అల్లాదుర్గం/చిన్నశంకరంపేట/కొల్చారం/హవేళీఘణపూర్‌/తూప్రాన్‌ రూరల్‌, సెప్టెంబరు 19 : రామాయంపేట పట్టణంతో పాటు పలు గ్రామాల్లో గణేష్‌ నిమజ్జనోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. వివిధ కులసంఘాలు, యువకులు ప్రతిష్టించిన గణేష్‌ విగ్రహాలను శోభాయాత్రగా తరలించి సర్వయ్యకుంట, వెంకన్నగారి చెరువు, కొత్త చెరువుల్లో నిమజ్జనం చేశారు. పెద్దశంకరంపేట మండలంలో వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. తిరుమలాపూర్‌ చెరువు వద్ద పేట సర్పంచ్‌ సత్యనారాయణ ప్రత్యేక వీధిలైట్లు ఏర్పాటు చేశారు. అల్లాదుర్గం మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణనాథులను శోభాయాత్రగా తీసుకెళ్లి చెరువుల్లో నిమజ్జనం చేశారు. చిన్నశంకరంపేట మండలంలోని ఆయా గ్రామాల్లో వినాయక నిమజ్జనం చేశారు. మండల పరిధిలోని గవ్వలపల్లి గ్రామంలో శ్రీచైతన్య గణేష్‌ మండలి 24వ వార్షికోత్సవం సందర్భంగా వినాయకుడికి టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, మాజీ సర్పంచ్‌ రవీందర్‌రెడ్డి, నాయకులు బాగారెడ్డి, స్వామి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీచైతన్య యువజన సంఘం సభ్యులు రాజును సన్మానించారు. కొల్చారం మండలంలోని కాంపూర్‌, కొంగోడు, చిన్నఘణపూర్‌తో పాటు ఆయా గ్రామాల్లో నిమజ్జన ఉత్సవాలు శాంతియుతంగా జరిపారు. హవేళీఘణపూర్‌ మండల పరిధిలోని కూచన్‌పల్లి, ముత్తాయికోట, హవేళీఘణపూర్‌, బూర్గుపల్లి, సర్దన గ్రామాల్లో గణేష్‌ నిమజ్జనం సందర్భంగా శోభాయాత్ర నిర్వహించారు. హవేళీఘణపూర్‌లో వినాయకుడి మెడలోని రూ.500 నోట్ల దండను వేళం నిర్వహించగా రూ.92 వేలకు గంగిరెద్దుల బుజ్జి దక్కించుకున్నారు. తూప్రాన్‌ మండలంలోని పలు గ్రామాల్లో వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరిగాయి. నాగులపల్లి, యావాపూర్‌, కిష్టాపూర్‌, కోనాయపల్లిపీబి, వెంకటాయపల్లి, ఇమాంపూర్‌, గుండ్రెడ్డిపల్లి, దాతర్‌పల్లి, ఇస్లాంపూర్‌ గ్రామాల్లో విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువుల్లో నిమజ్జనం చేశారు.

సంగారెడ్డి జిల్లాలో

నారాయణఖేడ్‌/జహీరాబాద్‌/మునిపల్లి/సదాశివపేట, సెప్టెంబరు 19 : నారాయణఖేడ్‌ పట్టణంలో భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన భారీ వినాయక విగ్రహాన్ని ప్రత్యేక వాహనంపై శోభాయాత్రగా కమలాపూర్‌ ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లి ఆదివారం తెల్లవారుజామున నిమజ్జనం చేశారు. జహీరాబాద్‌ డివిజన్‌లోని కోహీర్‌, జహీరాబాద్‌, ఝరసంగం, న్యాల్‌కల్‌, మొగుడంపల్లి, రాయికోడ్‌ మండలాల్లో వినాయక నిమజ్జనం జరిగింది. మునిపల్లి మండలంలోని అంతారం, కంకోల్‌, బుధేరా, ఖమ్మంపల్లి, మునిపల్లి, పోల్కంపల్లి, గోప్లారం, లింగంపల్లి, మేళాసంగెం, పెద్దచెల్మెడ, తాటిపల్లి, పెద్దలోడి, చీలపల్లి, మల్లికార్జునపల్లి, హైద్లాపూర్‌ గ్రామాల్లో వినాయకులను నిమజ్జనం చేశారు. సదాశివపేట పట్టణంలో ఏర్పాటు చేసిన 110 గణనాథులను ఆదివారం అర్ధరాత్రి నిమజ్జనం చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిల్లోడి జయమ్మ, రాణా ప్రతా్‌పయూత్‌ గణనాథుడికి పూజలు చేశారు. 12వ వార్డులో ఉషాకిరణ్‌యూత్‌ అసోసియేషన్‌ నెలకొల్పిన వినాయకుడి వద్ద ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు కౌన్సిలర్‌ పులిమామిడిరాజు, 6వ వార్డులో శివాజీ యూత్‌ నెలకొల్పిన విగ్నేశ్వరుడు వద్ద కౌన్సిలర్‌ గుండురవి, గొల్లకేరిలో బాయ్స్‌ యూత్‌ వద్ద లంబోదరుడుకి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చింతగోపాల్‌ పూజలు నిర్వహించి నిమజ్జన ఉత్సవాలను ప్రారంభించారు.

రూ.1.36 లక్షలు పలికిన లడ్డు

నారాయణఖేడ్‌/తూప్రాన్‌, సెప్టెంబరు 19 : ఖేడ్‌ పట్టణంలోని ఏఎస్‌ నగర్‌లో భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుడి మొదటి లడ్డు ప్రసాదాన్ని వేలం పాట వేయగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు రామకృష్ణ రూ.1.36 లక్షలకు దక్కించుకున్నారు. లడ్డును అత్యధిక ధరకు దక్కించుకోవడంతో పలువురు రామకృష్ణను అభినందించారు. అలాగే తూప్రాన్‌ పట్టణ ఆర్యవైశ్య సంఘం వినాయకుడి నిమజ్జనం ఆదివారం రాత్రి చేపట్టారు. ఈ సందర్భంగా వేలం పాట నిర్వహించారు. గబ్బుల సిద్దిరాములు, సంతోష దంపతులు రూ.52,116లకు లడ్డును దక్కించుకున్నారు.