ఢిల్లీ ఇప్పటి వరకు సరైన ఆట ఆడలేదు: రికీ పాంటింగ్

ABN , First Publish Date - 2020-10-17T01:26:39+05:30 IST

యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌లో ఢిల్లీ కేపిటల్స్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. 8 మ్యాచ్‌లు ఆడి ఆరింటిలో గెలిచి 12

ఢిల్లీ ఇప్పటి వరకు సరైన ఆట ఆడలేదు: రికీ పాంటింగ్

దుబాయ్: యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌లో ఢిల్లీ కేపిటల్స్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. 8 మ్యాచ్‌లు ఆడి ఆరింటిలో గెలిచి 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అయినప్పటికీ ఆ జట్టు ఇంకా సామర్థ్యానికి తగ్గట్టు ఆడడం లేదని ఆ జట్టు కోసం రికీ పాంటింగ్ అన్నాడు. ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ సాధించిన ఢిల్లీ, తర్వాతి ఆరు మ్యాచుల్లో రెండింటిలో గెలిస్తే టోర్నీ తదుపరి అంకంలోకి ప్రవేశిస్తుంది. 


టోర్నీ తొలి అర్ధభాగంలో అంతబాగా ఆడాల్సిన అవసరం లేదని, రెండో అర్ధభాగంలో మాత్రం పూర్తి సామర్థ్యంతో ఆడాల్సి ఉంటుందని ఆటగాళ్లకు తొలి నుంచీ చెబుతున్నట్టు పాంటింగ్ పేర్కొన్నాడు. ఇక్కడి పిచ్‌లు క్రమంగా నెమ్మదిస్తాయని తాను చెబుతున్నది నిజమైందని పేర్కొన్న పాంటింగ్ రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ను ఉదహరించాడు. ఆ మ్యాచ్‌లో 162 పరుగుల విజయ లక్ష్యాన్ని రాజస్థాన్ ఛేదించడం కష్టమని తాను చెప్పినట్టే జరిగిందన్నాడు.  


ఇక్కడ అడుగుపెట్టినప్పుడు వికెట్‌పై పచ్చిక, తేమ ఉండడంతో టోర్నీ తొలి అర్ధభాగంలో ఛేజింగ్ సులభమని అందరూ భావించారని, అయితే రెండో అర్ధభాగంలో మాత్రం ఛేజింగ్ కష్టమని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. తొలుత తాము బ్యాటింగ్ చేయడం వల్లే ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో విజయం సాధించినట్టు పేర్కొన్నాడు. ఇప్పటి వరకు జరిగిన 8 మ్యాచుల్లో ఆరింటిలో గెలిచినప్పటికీ తాము బెస్ట్ క్రికెట్‌ను ఇప్పటి వరకు ఆడలేదన్నాడు.  


ఐపీఎల్‌ టైటిల్‌ను మూడుసార్లు ఎగరేసుకుపోయిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి చతికిల పడుతుండడంపై పాంటింగ్ మాట్లాడుతూ.. అంతమాత్రాన తాము చెన్నైని తేలిగ్గా తీసుకోబోమన్నాడు. ఆ జట్టులో వాట్సన్, ధోనీ, జడేజా, డుప్లెసిస్ వంటివారు ఉన్నారని, వారిని తేలిగ్గా తీసుకోబోమని స్పష్టం చేశాడు.   


Updated Date - 2020-10-17T01:26:39+05:30 IST