రీడింగ్‌ తీయలేం

ABN , First Publish Date - 2021-05-09T08:55:56+05:30 IST

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఇంటింటికీ తిరిగి విద్యుత్‌ మీటర్లకు రీడింగులు తీసే పని చేయడానికి రీడర్లు వెనకాడుతున్నారు

రీడింగ్‌ తీయలేం

ఇంటింటికీ తిరగడం మా ప్రాణం మీదకు తెస్తోంది

వందల మంది కొవిడ్‌ బారినపడ్డారు...ఇద్దరు మృతి:  విద్యుత్‌ సిబ్బంది ఆవేదన


అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఇంటింటికీ తిరిగి విద్యుత్‌ మీటర్లకు రీడింగులు తీసే పని చేయడానికి రీడర్లు వెనకాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రీడర్లు వందల సంఖ్యలో కొవిడ్‌ బారిన పడడం, కృష్ణా జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందడంతో వీరిలో తీవ్ర భయాందోళనలు వ్యాపించాయి. ఎలాంటి వ్యక్తిగత రక్షణ పరికరాలు ఇవ్వకుండా రీడింగ్‌ తీయమనడం తమ ప్రాణాల మీదకు తెస్తోందని వారు వాపోతున్నారు. కొన్ని చోట్ల ఈ పనిని కాంట్రాక్టు తీసుకున్న కాంట్రాక్టర్లే నిలిపివేశారు. ఆయా ప్రాంతాల్లో తమ స్వంత సిబ్బంది చేత రీడింగ్‌లు తీయించడానికి విద్యుత్‌ శాఖ చేస్తున్న ప్రయత్నాలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న సాంకేతికతను వాడుకోవడంపై అధికారులు దృష్టి పెట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటింటికీ వెళ్లి మీటరు రీడింగ్‌ తీసేపనిని అందిపుచ్చుకున్న కాంట్రాక్టర్ల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4,000 మంది పనిచేస్తున్నారు. కోటి మంది వినియోగదారుల ఇళ్లకు వీరు ప్రతి నెలా వెళ్లి బిల్లు ఇచ్చి వస్తున్నారు. కరోనా సమయంలో ఈపని రీడర్ల ప్రాణం మీదకు తెస్తోంది. మరో పక్క వీరు వైరస్‌ క్యారియర్లుగా మారుతున్నారన్న సహేతుకమైన విమర్శలూ వస్తున్నాయి. అయితే విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు రీడింగ్‌ తీసే పని ఆగడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. 


ఏదో రకంగా పని పూర్తి చేయించాలని కింది స్థాయు అధికారులకు వాట్సా్‌పలో ఆడియో సందేశాలు పంపి ఒత్తిడి తెస్తున్నారు. ‘‘ఒక నెల బిల్లు తీయకపోతే రెండు నెలలకు తడిసి మోపెడవుతోంది. బిల్లులు ఎక్కువ వస్తున్నాయని ప్రభుత్వాన్ని తిడుతున్నారు. కలెక్షన్లు ఆగిపోతే మాకూ ఇబ్బందే. అందుకే ఏదోలా రీడింగ్‌ తీయాలనే చెప్పాల్సి వస్తోంది’’ అని ఒక ఉన్నతాధికారి చెప్పారు. ఈ నెలలో మరీ ఎక్కువ చోట్ల ఆగలేదని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో వైరస్‌ ఉధృతి మరీ ఎక్కువ ఉండటంతో అక్కడి ప్రైవేటు కంట్రాక్టర్‌ ఆ డివిజన్‌లో మీటర్‌ రీడింగ్‌ పనిని నిలిపివేశారు. ఈ పనిని సొంత సిబ్బందితో చేయించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే తాము ఈ పనిని చేయలేమంటూ తెనాలి విద్యుత్‌ కార్మికుల జేఏసీ వినతిపత్రాన్ని సమర్పించింది. దీనితో మరెవరైనా వస్తే వారికి ఒకో రీడింగ్‌కు మూడు రూపాయలు ఇచ్చి చేయించాలని, ఎవరైనా ఇళ్లలోకి రానివ్వకపోయినా, ఇబ్బంది ఉన్నా సరాసరి రీడింగ్‌ వేసి బిల్లు ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పని ఆగిపోయిన మిగిలిన చోట్ల కూడా ఇదే మార్గం అనుసరించాలని నిర్ణయించారు. 


పరిస్థితి తీవ్రంగా ఉన్నందువల్ల ఈనెలలో రీడింగ్‌ తీయలేమని విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీకి అక్కడి మీటర్‌ రీడర్ల సంఘం రెండు రోజుల క్రితం ఒక వినతిపత్రం సమర్పించింది. ఓవైపు ప్రాణ భయం నలిపేస్తున్నా ఆర్థికంగా ప్రత్యామ్నాయాలు లేక కొందరు రీడింగ్‌ తీయడానికి వెళ్తున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో రీడింగ్‌ తీయకపోవడంతో తమకు ఒక్కపైసా కూడా ఇవ్వకపోవడాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. పని ఆగితే బతకలేమని భయం వారిని వెంటాడుతోంది. ‘‘ఈరోజు మేం అనేక మంది రీడర్లతో మాట్లాడాం. తమకు పీపీఈ కిట్లు, ఎన్‌ 95 మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. వ్యాక్సిన్లు వేయించాలని, ఫ్రంట్‌ లైన్‌ వారియర్లుగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు’’ అని సీఐటీయూ అనుబంధ విద్యుత్‌ కార్మికుల సంఘం నేత బాలకాశి చెప్పారు. సాంకేతికతపై దృష్టి పెట్టకపోవడంపైకూడా విమర్శలున్నాయి. వినియోగదారులు తమ మీటర్‌ ఫొటో తీసి వాట్సా్‌పలో పంపిస్తే బిల్లు పంపే సాంకేతికతను తెలంగాణలోని విద్యుత్‌ సంస్థలు అందుబాటులోకి తెచ్చాయి. వాటిని ప్రచారంలో పెట్టాయి. ఇక్కడ మాత్రం కరోనా వచ్చిన రోగుల వరకు దీనిని పరిమితం చేశాయి. ఈ సౌకర్యాన్ని మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవాలని గుంటూరు జిల్లా రేపల్లె పట్టణ అభివృద్ధి సంఘం స్థానిక విద్యుత్‌ అధికారులకు ఒక వినతిపత్రం పంపింది. దీనిపై విద్యుత్‌ అధికారులు ఇంకా స్పందించలేదు. 

Updated Date - 2021-05-09T08:55:56+05:30 IST