సమాచార హక్కుకు సమాధి!

ABN , First Publish Date - 2021-10-20T09:00:02+05:30 IST

‘‘సమాచార హక్కు అధికారులు (పీఐవో) ఇకపై అనుమతి లేనిదే ఆర్టీఐ దరఖాస్తుదారులకు వివరాలు అందజేయకూడదు.

సమాచార హక్కుకు సమాధి!

పీఐవోల అధికారాలకు రాష్ట్ర సర్కారు కత్తెర

అనుమతి లేకుండా సమాచారమివ్వొద్దు

సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ వివాదాస్పద ఆదేశాలు


హైదరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘‘సమాచార హక్కు అధికారులు (పీఐవో) ఇకపై అనుమతి లేనిదే ఆర్టీఐ దరఖాస్తుదారులకు వివరాలు అందజేయకూడదు. రాష్ట్ర స్థాయిలో సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు లేదా ముఖ్య కార్యదర్శులు లేదా కార్యదర్శుల అనుమతి లేకుండా. సమాచారం ఇవ్వడానికి వీల్లేదు’’.. ఇదీ ఈ నెల 13న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్ని శాఖలకు జారీ చేసిన ఉత్తర్వుల సారాంశం. ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై యుద్ధానికి.. ప్రజల చేతికి బ్రహ్మాస్త్రంగా వచ్చిన సమాచార హక్కు చట్టం-2005 అమల్లోకి వచ్చి 16 ఏళ్ల వేడుకలు జరుపుకొన్న మరుసటి రోజే.. తెలంగాణ ప్రభుత్వం ఆ చట్టం లక్ష్యాన్ని సమాధి చేసేలా వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రహస్య ఉత్తర్వుల ప్రతి మంగళవారం వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం.. గ్రామ పంచాయతీ కార్యాలయం మొదలు.. తహసీల్దార్‌ కార్యాలయాలు, జడ్పీలు, ఆయా శాఖల కమిషనరేట్లు, సచివాలయంలోని శాఖలు.. ఇలా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని పీఐవోలు.. దరఖాస్తుదారులకు నేరుగా సమాచారం ఇవ్వడానికి వీల్లేదు. కొన్ని కేసుల్లో పీఐవోలు వివరాలను, రికార్డులను పరిశీలించకుండా ప్రజలు అడిగే సమాచారాన్ని మూసపద్ధతిలో ఇస్తున్నారనే విషయాన్ని ఈ ఉత్తర్వులకు కారణంగా పేర్కొన్నారు.


హక్కు హననమే?

ప్రజలు కోరే సమాచారాన్ని అందజేసేందుకు యూపీఏ-1 సర్కారు 2005లో సమాచార హక్కు చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం ప్రతి కార్యాలయంలో పీఐవోలను నియమించాలి. ఈ చట్టంలోని సెక్షన్‌ 7(1) ప్రకారం.. పౌరులు కోరిన ప్రతీ సమాచారాన్ని 30 రోజుల్లోపు అందించాలి. వ్యక్తి జీవితం, స్వేచ్ఛకు సంబంధించిన అంశమైతే అత్యవసర సమాచారంగా భావించి, 48 గంటల్లోపు ఇవ్వాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో పీఐవో నుంచి స్పందన లేకుంటే.. సెక్షన్‌ 19(1) ప్రకారం పైఅధికారికి అప్పీల్‌ చేసుకోవచ్చు. దీనిని మొదటి అప్పీలేట్‌ అథారిటీ అంటారు. అక్కడ కూడా 30 రోజుల్లోపు సమాచారం రాకుంటే.. సెక్షన్‌ 19(3) ప్రకారం సెకండ్‌ అప్పీలేట్‌ అథారిటీ అయిన రాష్ట్ర సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో ఇవ్వడంలో విఫలమైన ప్రజా సమాచార అధికారి(పీఐవో)కి సెక్షన్‌-20 ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర సమాచార కమిషన్‌కు ఉంది. సదరు పీఐవోకి గరిష్ఠంగా రూ. 25వేల జరిమానా విధించవచ్చు.


సమాచారం దొరకడం గగనమే..!

ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం పీఐవోలు వెనువెంటనే అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆర్టీఐ దరఖాస్తుదారులకు ఇవ్వడానికి వీల్లేదు. ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా కార్యదర్శికి వివరాలు పంపి.. వారి అనుమతి ఉంటేనే దరఖాస్తుదారులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. ఇప్పటికే పీఐవోలు నిర్ణీత 30 రోజుల్లో సమాచారం ఇవ్వడంలో విఫలమయ్యే సందర్భాలు కోకొల్లలు. అలాంటిది ఇప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం పంపి.. వారు దాన్ని సమీక్షించి, అనుమతిచ్చేలోపు పుణ్యకాలం దాటిపోతుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. మొదటి అప్పీలేట్‌ అధికారి కూడా ఆయా శాఖల పెద్దల అనుమతి తీసుకోక తప్పని పరిస్థితి. అంటే.. దరఖాస్తుదారులు రెండో అప్పీలేట్‌ అయిన సమాచార హక్కు కమిషనర్‌ను ఆశ్రయించాల్సిందే..! అక్కడ కూడా పెండెన్సీ గుట్టలుగా పేరుకుపోయింది. వేల సంఖ్యలో అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణలో చాలా మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఒకటి కంటే ఎక్కువ శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ సచివాలయం మొదలు.. రాష్ట్ర సచివాలయం దాకా వచ్చే ఆర్టీఐ దరఖాస్తులను సమీక్షించడం వారికి తలకు మించిన భారమే..! మొత్తానికి ప్రభుత్వ తాజా ఉత్తర్వుల సారాంశం.. ఆర్టీఐ దరఖాస్తుదారులకు సమాచారం దొరకదు అని పరోక్షంగా చెప్పడమే..!


బాధ్యులు ఎవరు?

సమాచారం ఇవ్వడంలో విఫలమైతే.. సమాచార హక్కు కమిషనర్‌/కోర్టులు బాధ్యులైన పీఐవోలపై చర్యలు తీసుకోవచ్చు. కానీ, సమీక్షలు, విశ్లేషణల పేరుతో సీనియర్‌ ఐపీఎ్‌సలు ఆ సమాచారాన్ని తొక్కిపెడితే..? అనుమతి ఇవ్వడంలో జాప్యం చేస్తే..? అసలు అనుమతే ఇవ్వకపోతే..? దానికి బాధ్యులు ఎవరు? సమాచార హక్కు చట్టం ప్రకారం పీఐవోదే బాధ్యత. అంటే.. ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి.. పీఐవో మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది. అనాలోచితంగా ప్రభుత్వం ఇలాంటి ఉత్తర్వులు విడుదల చేయడం పట్ల సమాచార హక్కు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సమాచార కమిషనర్లు పీఐవోలకు జరిమానాలు, శిక్షలు విధించిన దాఖలాలున్నాయని, తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. అలాంటి చర్యలు అంతంతమాత్రమేనని చెబుతున్నారు. దీంతో.. సహజంగానే పీఐవోలు సమాచారాన్ని ఇవ్వడంలో నిర్లక్ష్యవైఖరిని ప్రదర్శిస్తున్నారని, తాజా ఉత్తర్వులతో పరిస్థితి మరీ దారుణంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-10-20T09:00:02+05:30 IST