Abn logo
Feb 20 2020 @ 03:48AM

హక్కులు–లెక్కలు

సుప్రీంకోర్టుదేముంది, హక్కులకు ఏలోటూ లేదనే అంటుంది. నిరసన తెలపడం, నచ్చింది చెప్పడం మీ ప్రాథమిక హక్కు అంటూ ఉరిమే ఉత్సాహాన్ని అందిస్తుంది. కానీ, ధైర్యం చేసి ఎవరైనా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏకంగా దేశద్రోహులన్న ముద్ర వేయించుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వాలకు ఎవరిమీదైనా పాతకక్షలుంటే మరీనూ. యోగి ప్రభుత్వం రెండేళ్ళుగా డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ వెంట పడుతున్నది. గోరఖ్‌పూర్‌ బిఆర్‌డి ఆసుపత్రిలో 2017లో ఆక్సిజన్‌ కొరతకారణంగా 70మంది పసికందులు కన్నుమూసిన ఘటనలో ఆయన కొన్ని వాస్తవాలు బయటపెట్టి అడ్డంగా ఇరుక్కొని, ఉద్యోగమూ పోగొట్టుకున్నాడు. అప్పటినుంచీ ఆయన వెంటపడిన యోగి ప్రభుత్వానికి ఇటీవల ఆయన కొత్త పౌర చట్టంమీద అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలో చేసిన ప్రసంగం కొత్త ఆయుధంగా అందివచ్చింది. రెండునెలలకు పైగా నిరసనలు జరుగుతున్న షాహీన్‌బాగ్‌ను ఖాళీచేయించే అంశంలో సుప్రీంకోర్టు భావవ్యక్తీకరణ, నిరసనకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు మన ప్రభుత్వాలకు ఎప్పటికైనా చెవికెక్కుతాయా?


సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తులు ఇద్దరు బుధవారం షాహీన్‌బాగ్‌ నిరసనకారుల దగ్గరకు పోయి వారితో చర్చలు జరిపారు. కన్నీళ్ళు, భయాల మధ్య నిరసనకారులు కూడా ఏవో చెప్పుకున్నారు. ఆ ప్రాంతం నుంచి వారిని ఖాళీచేయించే విషయంలో మధ్యవర్తులు విజయం సాధిస్తారా లేదా అన్నది వేరే విషయం. కానీ, శాసనాలకు వ్యతిరేకంగా మాట్లాడటం, నిరసన తెలపడం వంటివి ప్రభుత్వాలు సహించలేకపోతున్న స్థితిలో, సుప్రీంకోర్టు చొరవను అభినందించవలసిందే. పౌరులకు ఉన్న నిరసనహక్కును ఎత్తిపడుతూ అమలులో కాస్తంత విచక్షణ పాటించమని కోర్టు చెబుతున్నది. షహీన్‌బాగ్‌ నిరసనకారులు అంబులెన్సులను కూడా అనుమతించడం లేదన్న సొలిసిటర్‌ జనరల్‌ వాదన అతిగా ఉన్నది కానీ, నెలల తరబడి నిరసన శిబిరం కొనసాగడం వల్ల సమీప ప్రాంతాలవారికి ఇబ్బందులు కలగడం సహజం. పూర్తిగా మహిళలతో, ప్రముఖులెవరూ లేని ఈ శిబిరం వొణికించే చలిలో కూడా అంతే బలంగా కొనసాగుతూ వచ్చి మిగతా దేశానికి ఎంతో స్ఫూర్తినందించింది. షహీన్‌బాగ్‌ ఆశయం అందిపుచ్చుకొని దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ధర్నా శిబిరాలు వెలిసాయి. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్‌ఆర్‌సి, సీఏఏలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల వెనుక దీని ప్రభావం లేకపోలేదు. ఇంతటి బలమైన ఉద్యమం కనుకనే ఢిల్లీ ఎన్నికలు ప్రధానంగా దానిచుట్టూనే తిరిగాయి. అక్కడున్నవారంతా దేశద్రోహులనీ, ఎన్నికల్లో నెగ్గగానే దానిని ఖాళీ చేయిస్తామని కొందరు కేంద్ర మంత్రులు ప్రకటించడం తెలిసిందే. 


శాసనాలకు వ్యతిరేకంగా మాట్లాడటం, నిరసన తెలియచేయడం అభిప్రాయాల రూపకల్పనకు అవసరం. న్యాయమూర్తి చంద్రచూడ్‌ ఇటీవల ఓ ప్రసంగంలో వీటిని ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉపకరించే సేఫ్టీవాల్వ్‌తో పోల్చారు. బలప్రయోగంతో అసమ్మతిని అణచివేస్తే సామాజికాభివృద్ధికి దోహదం చేసే ప్రాతిపదికలన్నీ ధ్వంసమవుతాయని కూడా హెచ్చరించారు. కానీ, ఈ నిరసనలు, అసమ్మతి దేశానికి కీడుచేస్తాయన్న వాదనతో పాలకులు తమ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని వేటాడుతూనే ఉన్నారు. గోరఖ్‌పూర్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ కొరతతో పిల్లలు వరుసగా కన్నుమూస్తున్నప్పుడు వారిని రక్షించేందుకు తనవంతు ప్రయత్నం చేసినవాడు కఫీల్‌ఖాన్‌. కానీ, యోగి ప్రభుత్వం ప్రభుత్వం తన నిర్లక్ష్యాన్నీ, నిర్వహణ లోపాలను కప్పిపుచ్చుకొనేందుకు ఈ డాక్టర్‌ను ఇరికించి, అంతిమంగా జైలుకు పంపింది. అంతర్గత విచారణలో ఆయన సచ్ఛీలుడని తేలగానే, మరో విచారణ కమిటీ ప్రకటించింది. మొన్న డిసెంబరులో పౌరసత్వచట్టంమీద చేసిన ప్రసంగం విద్వేషాలు రెచ్చగొట్టేట్టు ఉన్నదని ఇప్పుడు వెంటబడుతున్నది. ఇటీవల యూపీ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఆయనను అరెస్టు చేయగానే, కొంతకాలం తరువాత కోర్టు ఆయనకు బెయిల్‌ ఇచ్చింది. ఇలా బెయిల్‌మీద బయటకు రాగానే జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించి ముంబై ఎయిర్‌పోర్టులో ప్రభుత్వం ఆయనను అరెస్టుచేయించింది. యూపీ ప్రభుత్వానికి ఈ డాక్టర్‌ దేశభద్రత రీత్యా ఓ తీవ్ర చట్టాన్ని ప్రయోగించాల్సిన ఉగ్రవాదిలాగా కనిపిస్తున్నాడు. ఆయన ప్రసంగం నిజంగానే విద్వేషాలను రెచ్చగొట్టే స్థాయిలో ఉన్నదనుకుంటే చార్జిషీటులో నిరూపిస్తే న్యాయస్థానాలే ఆ విషయాన్ని నిర్థారిస్తాయి. కానీ, యోగి ప్రభుత్వం కఫీల్‌ఖాన్‌ వదలదల్చుకోలేదు కనుక ఇలా బెయిల్‌ రాగానే అలా తిరిగి జైల్లోకి నెట్టేసింది. న్యాయస్థానాలు హక్కుల లెక్కలు ఎన్ని చెప్పినా, శాసనాలకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చునని ఎంత రెచ్చగొట్టినా పాలకులు ప్రీతిపాత్రంగా తెస్తున్న చట్టాలమీద నోరువిప్పడం ఆరోగ్యానికి హానికరం.

Advertisement
Advertisement
Advertisement