ముచ్చటగా మూడో డీల్‌!

ABN , First Publish Date - 2020-05-09T05:34:57+05:30 IST

జియో ప్లాట్‌ఫామ్స్‌లో మరింత వాటా విక్రయిస్తున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రకటించింది.

ముచ్చటగా మూడో డీల్‌!

  • ‘జియో’లో 2.32% వాటా రూ.11,367 కోట్లకు విక్రయం 
  • విస్టా ఈక్విటీతో ఆర్‌ఐఎల్‌ ఒప్పందం


న్యూఢిల్లీ: జియో ప్లాట్‌ఫామ్స్‌లో మరింత వాటా విక్రయిస్తున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రకటించింది. అమెరికాకు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్‌తో ఇందుకు ఒప్పందం కుదుర్చుకుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 2.32 శాతం వాటాను రూ.11,367 కోట్లకు కొనుగోలు చేయనుందీ సంస్థ. గడిచిన 2 వారాల్లో జియో ప్లాట్‌ఫామ్స్‌కిది మూడో వాటా విక్రయ ఒప్పందం. కంపెనీలో 9.99 శాతం వాటా కోసం రూ.43,574 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఫేస్‌బుక్‌ ముందుకొచ్చింది.


ఏప్రిల్‌ 22న ఆర్‌ఐఎల్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే సిల్వర్‌లేక్‌తోనూ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచంలో అతిపెద్ద టెక్నాలజీ ఇన్వెస్టర్‌ అయిన సిల్వర్‌ లేక్‌ రూ.5,665.75 కోట్లకు 1.15 శాతం వాటాను చేజిక్కించుకుంది. ఈ మూడు ఒప్పందాల ద్వారా జియో ప్లాట్‌ఫామ్స్‌లో 13.46 శాతం వాటాను విక్రయించింది ఆర్‌ఐఎల్‌. తద్వారా సంస్థకు రూ.60,596.37 కోట్లు సమకూరనున్నాయి. రిలయన్స్‌ రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిధులు ఎంతగానో దోహదపడనున్నాయి. ఈ ఒప్పందం సందర్భంగా జియో ప్లాట్‌ఫామ్స్‌ ఈక్విటీ విలువను రూ.4.91 లక్షల కోట్లుగా, ఎంటర్‌ప్రైజ్‌ విలువను రూ.5.16 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. 


విస్టా సహ-వ్యవస్థాపకుడు భారత మూలాలున్న వ్యక్తే.. 

విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్‌ సహ వ్యవస్థాపకుడు భారత మూ లాలున్న వ్యక్తే. పేరు బ్రియాన్‌ సేథ్‌. అతని తండ్రి గుజరాత్‌కు చెందినవాడు. రిలయన్స్‌ సామ్రాజ్యాధినేత ముకేశ్‌ అంబానీ కూడా గుజరాతీనే. ఈ అనుబంధమే తాజా ఒప్పంద చర్చలకు పునాది వేసినట్లు తెలిసింది. ముకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన మనోజ్‌ మోదీ, బ్రియాన్‌ సేథ్‌ నేతృత్వంలో ఈ డీల్‌పై చర్చలు జరిగినట్లు సమాచారం.

Updated Date - 2020-05-09T05:34:57+05:30 IST