May 11 2021 @ 07:36AM

పదేళ్ల తర్వాత, భరత్‌ హీరోయిన్‌ రీఎంట్రీ

గతంలో హీరో భరత్‌ సరసన నటించిన హీరోయిన్లలో రీమా కల్లింగ్స్‌ ఒకరు. పదేళ్ల తర్వాత ఈమె కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. వీరిద్దరూ కలిసి ‘యువన్‌ యువతి’ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం 2011లో విడుదలైంది. ఆ తర్వాత రీమాకు కోలీవుడ్‌లో సరైన అవకాశాలు లేకపోవడంతో తన మాతృభాష రంగమైన మాలీవుడ్‌కు వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని చిత్రాల్లో నటించి బిజీ హీరోయిన్లలో ఒకరిగా మారింది. పిమ్మట మలయాళ దర్శకుడు ఆసిక్‌ అబును వివాహం చేసుకుని కొంతకాలం సినీపరిశ్రమకు దూరమైంది. ఈ క్రమంలో ఇప్పుడు స్టంట్‌ మాస్టర్‌ సిల్వా దర్శకత్వం వహించే తమిళ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనుంది. దాదాపు వంద చిత్రాలకు పైగా స్టంట్‌ మాస్టర్‌గా పనిచేసిన స్టంట్‌ సిల్వా  రూపొందించే భారీ యాక్షన్‌ పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈయన తొలిసారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లేను ప్రముఖ దర్శకుడు విజయ్‌ సమకూర్చుతున్నారు. ఈ చిత్రంలో ప్రధాన హీరోయిన్‌గా ప్రముఖ హీరోయిన్‌ సాయిపల్లవి చెల్లెలు పూజా కణ్ణన్‌ నటిస్తుంటే మరో హీరోయిన్‌గా రిమా కల్లింగల్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.