ప్రమాదపుటంచున రిమ్స్‌ భవన సముదాయాలు

ABN , First Publish Date - 2021-04-11T07:03:31+05:30 IST

ఉమ్మడి జిల్లాలోనే పెద్దాసుపత్రిగా పేరున్న రాజీవ్‌గాంధీ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ కళాశాల (రిమ్స్‌) ఆసుపత్రి ప్రమాదకరంగా మారింది. 2008లో 500 పడకలతో ప్రారంభమైన రిమ్స్‌ ఆసుపత్రి భవన సముదాయాలు 13ఏళ్లకే పాడుబడిపోయి కనిపిస్తున్నాయి. ఈ ఆసుపత్రికి నిత్యం వేలాది

ప్రమాదపుటంచున రిమ్స్‌ భవన సముదాయాలు
బీటలు వారి ప్రమాదకరంగా తయారైన ఆదిలాబాద్‌ మెడికల్‌ కళాశాల భవనం

శిథిలావస్థకు చేరిన మెడికల్‌ కళాశాల భవనం

ఆసుపత్రి చుట్టు తేనెతెట్టలతో భయం భయం

మరుగుదొడ్లలో విషసర్పాల ఆవాసం

భయాందోళనకు గురవుతున్న రోగులు, బంధువులు

ఆసుపత్రి నిర్వహణను గాలికొదిలేసిన అధికారులు 

ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోనే పెద్దాసుపత్రిగా పేరున్న రాజీవ్‌గాంధీ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ కళాశాల (రిమ్స్‌) ఆసుపత్రి ప్రమాదకరంగా మారింది.  2008లో 500 పడకలతో ప్రారంభమైన రిమ్స్‌ ఆసుపత్రి భవన సముదాయాలు 13ఏళ్లకే పాడుబడిపోయి కనిపిస్తున్నాయి. ఈ ఆసుపత్రికి నిత్యం వేలాది మంది రోగులతో పాటు ఇతర సందర్శకులు వచ్చి పోతుంటారు. నిత్యం 1500 నుంచి రెండు వేల వరకు ఓపీ ఉంటుందంటే, రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే తెలుస్తుంది. రోజుకు 300 నుంచి 350 మంది రోగులు వివిధ వ్యాధుల భారీనపడి ఆసుపత్రిలో చేరి వైద్యం పొందుతున్నారు. పేరుకే పెద్దాసుపత్రి, కాని వసతుల లేమితో రోగులకు అడుగడుగునా అవస్థలే ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఆసుపత్రి భవనాలకు మరమ్మతులు చేపట్టినా పగుళ్లు తేలి భయంకరంగా కనిపిస్తున్నాయి. బీటలు వారినగోడల్లో ప్రమాదకరమైన విషసర్పాలు కనిపించడంతో రోగులు, మెడికోలు భయాందోళనకు గురవుతున్నారు. సరైన రక్షణ చర్యలు చేపట్టక పోవడంతో ఇప్పటికే పలువురు రోగులు ప్రమాదవశాత్తు పడి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అయినా అధికార యంత్రాంగం కదిలినట్లు కనిపించడం లేదు. రక్షణ చర్యలు చేపట్టకుంటే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటున్నారు. అసలే వేసవికాలం, ఏదైనా జరుగకూడదని అగ్నిప్రమాదం జరిగితే నివారించే ఆధునాతన అగ్నిమాపక పరికరాలు కూడా అందుబాటులో లేవు. ఇప్పటికే అగ్నిమాపక శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినా.. పట్టింపే కరువైంది.  అధికారులు ఆసుపత్రి నిర్వహణ బాధ్యతను గాలికొదిలేయడంతో ప్రమాదపుటంచుకు చేరింది.

నాణ్యతా ప్రమాణాలు పాటించకనే..

రిమ్స్‌ ఆసుపత్రి భవన సముదాయాన్ని నిర్మించే సమయంలో సంబంధిత కాంట్రాక్టర్‌ నాణ్యతా ప్రమాణాలు పాటించక పోవడంతోనే భారీ పగుళ్లు తేలి గోడలు బీటలు వారుతున్నాయి. ఇటీవలే భవనాలమరమ్మతుల కోసం సుమారుగా రూ.65 లక్షల నిధులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా స్పందన కనిపించడం లేదంటున్నారు. వచ్చే వర్షాకాలం లోపు మరమ్మతులు చేపట్టకుంటే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. మెడికల్‌ కళాశాల చుట్టు పెద్దపెద్ద బీటలు ఏర్పడి అధ్వానంగా మారింది. అలాగే ఆసుపత్రి భవన అంతస్థుల్లో ఎక్కడ చూసినా పగుళ్లు తేలిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. తరుచు మరమ్మతులు చేస్తున్నా.. ప్రయోజనం కనిపించడం లేదు. ఇప్పటి వరకు కొన్ని లక్షల రూపాయలను మరమ్మతుల కోసమే వెచ్చించినట్లు తెలుస్తుంది. పది కాలాల పాటు పదిలంగా ఉండాల్సిన ఆసుపత్రి భవనాల నాణ్యత నగుబాటుగానే మారింది. కాంట్రాక్టర్‌  చేతివాటం, ఇంజనీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. 

భయంతో రోగుల పరుగులు

ఇటీవల ప్రసూతి వార్డులో ఉన్న మరుగుదొడ్డిలో విష సర్పం కనిపించడంతో భయంతో రోగులు, వారి బంధువులు పరుగులు తీయాల్సి వచ్చింది. పాముందన్న అనుమానంతో మరుగుదొడ్డిని ఆనుకొని ఉన్న రెండు మూడు గదుల్లోకి ఎవరూ వెళ్లడం లేదు. మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతోనే చెత్తాచెదారం పేరుకపోయి ఎలుకలు, విషసర్పాలు ఆవాసంగా మార్చుకుంటున్నాయని పలువురు రోగులు వాపోతున్నారు. అలాగే ఆసుపత్రి చుట్టు రెండు, మూడు అంతస్థుల్లో కిటికీల సమీపంలోనే తేనెతెట్టెలు ప్రమాదకరంగా మారాయి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసి అటు వైపు వెళ్లినా.. తేనే టీగలు దాడి చేసే ప్రమాదం కనిపిస్తుంది. ఇప్పటికే పలువురిపై తేనే టీగలు దాడులు చేసిన దాఖలాలు ఉన్నాయి. వీటిని తొలగించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోవడం లేదని రోగుల బంధువులు పేర్కొంటున్నారు. ఆసుపత్రి పరిసరాలలో పిచ్చికుక్కల స్వైర్హ విహారం విపరీతంగా పెరిగిపోయింది. ఆసుపత్రి నిర్వహణకు ప్రత్యేక విభాగాలున్నా.. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అధ్వానంగా మారింది.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం

: బానోత్‌ బలిరాం, రిమ్స్‌ డైరెక్టర్‌, ఆదిలాబాద్‌

రిమ్స్‌ ఆసుపత్రి భవనాల మరమ్మతు కోసం ప్రభుత్వానికి రూ.65లక్షల కోసం ప్రతిపాదనలు పంపించాం. నిధులు రాగానే మరమ్మతులు చేపడతాం. ఆసుపత్రి నిర్మాణ సమయంలో సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించక పోవడంతోనే ఇబ్బందులు తలెత్తాయి. అగ్నిమాపక పరికరాలను సైతం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృస్టికి తీసుకెళ్లాం. పారిశుధ్య నిర్వహణను పకడ్బందీగానే నిర్వహిస్తున్నాం. మరిన్ని వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Updated Date - 2021-04-11T07:03:31+05:30 IST