రిమ్స్‌ ఘటనలపై కదిలిన యంత్రాంగం

ABN , First Publish Date - 2020-08-14T19:15:03+05:30 IST

రిమ్స్‌లో కరోనా బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు, వరుసగా వెలుగుచూస్తున్న..

రిమ్స్‌ ఘటనలపై కదిలిన యంత్రాంగం

రాత్రి కలెక్టర్‌, ఎస్పీ, జేసీ తనిఖీ 

సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి 

కొవిడ్‌ బాధితుల కోసం సేవలు, సౌకర్యాలు పెంపు 

మీడియాతో కలెక్టర్‌ పోలా భాస్కర్‌ 


ఒంగోలు: రిమ్స్‌లో కరోనా బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు, వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలపై జిల్లా యంత్రాంగం కదిలింది. ఈ మేరకు కలెక్టర్‌ పోలా భాస్కర్‌, ఎస్పీ సిద్ధార్థకౌశల్‌, జేసీ చేతన్‌ గురువారం రాత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాలుగురోజుల క్రితం వీఆర్‌ఏ అనుమానాస్పద మృతి, అంతకుముందు మరో యువకుడు మూడవ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం,గురువారం ముగ్గురు పాజిటివ్‌ బాధితులు పారిపోవడం వంటి ఘటనలపై ఆరా తీశారు. రోజురోజుకు వెలుగుచూస్తున్న ఘటనలపై వైద్యాధికారులతో మాట్లాడారు. తాగునీటి సమస్య, బాధితులకు అందించే ఆహారం నాణ్యత లేకపోవడం,  వేళకు రాకపోవడంతో బాధితులు బోరుమంటున్నారన్న విషయాలు అధికారుల దృషికొచ్చాయి.


ఇకపై రిమ్స్‌లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ మీడియాకు తెలిపారు. ముఖ్యంగా రిమ్స్‌లో ఇన్‌, ఔట్‌గేట్లను ఏర్పాటు చేయడంతోపాటు, లోపలికి వచ్చేవారు. బయటకు వెళ్ళే వారి వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్‌ చేస్తామన్నారు. అంతేకాకుండా నీటి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే సెక్యూరిటీ పెంచడంతోపాటు, పోలీసు పర్యవేక్షణ కూడా రిమ్స్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొవిడ్‌ నియంత్రణ కోసం పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ విధానంలో పర్యవేక్షణ, వివరాలు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఓపీ పేషెంట్ల కోసం ప్రత్యేక షెడ్‌ ఏర్పాటుచేయడంతోపాటు, కరోనా బాధితుడికి సహాయకులుగా వచ్చేవారికి కూడా ప్రత్యేక షెడ్‌ ఏర్పాటుచేస్తామని తెలిపారు. రిమ్స్‌లో 47 వెంటిలేటర్లు ఉండగా 80కి పెంచామన్నారు. రిమ్స్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీరాములు. ఆర్‌ఎంఓ డాక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, కొవిడ్‌ జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జాన్‌ రిచర్డ్స్‌, డిప్యూటి కలెక్టర్‌ వసంతబాబు పాల్గొన్నారు.  


Updated Date - 2020-08-14T19:15:03+05:30 IST