మరింత దూరంగా..

ABN , First Publish Date - 2021-02-25T05:26:43+05:30 IST

హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

మరింత దూరంగా..

  • రీజినల్‌ రింగురోడ్డులో మార్పులు
  • ఫార్మాసిటీ అవతలే నిర్మాణం
  • కొత్తగా మరిన్ని గ్రామాలను కలుపుతూ ఏర్పాటు
  • రీజినల్‌ రింగురోడ్డు పరిధిలో వికారాబాద్‌ ప్రాంతాలు
  • రియల్‌ఎస్టేట్‌కు మరింత ఊపు


హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రీజినల్‌ రింగురోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. గతంలో ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని నిర్ణయించాయి. నగరశివార్లలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఫార్మాసిటీకి ఈ ప్రాంతీయ వలయం అడ్డురాకుండా ఉండేందుకు ప్రతిపాదనల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : హైదరాబాద్‌ మహానగరం చుట్టూ నిర్మించతలపెట్టిన రీజినల్‌ రింగురోడ్డు నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఇక పనులు శరవేగంగా మొదలుకానున్నాయి. ప్రస్తుతానికి ఉన్న రింగురోడ్డు అవతల నిర్మించనున్న ఈ రీజినల్‌ రింగురోడ్డు హైదరాబాద్‌ నగరానికి తలమానికంగా తీర్చిదిద్దనున్నారు. రూ. 17 వేల కోట్ల వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్మిస్తున్న ఈ రీజినల్‌  రింగురోడ్డు 8 జాతీయరహదారులు,  25 పట్టణ ప్రాంతాలు,. 300 గ్రామాలను కలుపుకుంటూ వెళుతుంది. ఈ రీజినల్‌ రింగురోడ్డు వల్ల హైదరాబాద్‌కు ట్రాఫిక్‌ సమస్య భారీగా తగ్గనుంది. అలాగే రీజినల్‌ రింగురోడ్డు కారణంగా శివార్లలో భారీగా పెట్టుబడులు రావడం ద్వారా కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. తద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ముఖ్యంగా రియల్‌ఎస్టేట్‌ మరింత పుంజుకోనుంది. ఇదిలాఉంటే రీజినల్‌ రింగురోడ్డుకు గతంలో ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని నిర్ణయించారు. కంది నుంచి చౌటుప్పల్‌కు వెళ్లే రహదారిలో మార్పులు చేశారు. రెండు భాగాలుగా చేపట్టనున్న ఈ రీజినల్‌  రోడ్డుకు  సంబంధించి హైదరాబాద్‌కు ఉత్తర ప్రాంతంలో సంగారెడ్డి - నర్సాపూర్‌ - తూప్రాన్‌ - గజ్వేల్‌ - ప్రజ్ఞాపూర్‌ - యాదాద్రి - భువనగిరి - చౌటుప్పల్‌ వరకు 158 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. దీనికి ఎన్‌హెచ్‌ 161ఏఏ నెంబరింగ్‌ కూడా ఇచ్చారు. ఈ భాగం నిర్మాణానికి కేంద్రం రూ. 7,561 కోట్లు ఖర్చు చేయనుండగా.. భూసేకరణ కోసం మరో రూ. 1961 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇలా తొలిదశ ఉత్తర భాగంలో నిర్మించనున్న ఈ రహదారికి  మొత్తం రూ. 9,522 కోట్ల వ్యయంకానుంది. ఇక రెండోదశ హైదరాబాద్‌కు దక్షిణ ప్రాంతంలో కంది- నుంచి చౌటుప్పల్‌ వరకు 182 కి.మీ మేర రీజినల్‌ రింగురోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ నిర్మాణ పనుల కోసం రూ. 4,633 కోట్లను కేంద్రం ఖర్చు చేస్తుండగా భూసేకరణకు మరో రూ. 1,748 కోట్లు కలిపి  మొత్తం రూ.6,881 కోట్లు ఖర్చుకానుంది. భూసేకరణకు అయ్యే వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 50శాతం నిధులు భరించాల్సి ఉంటుంది. ఈ రెండో భాగానికి ఎన్‌హెచ్‌ నంబర్‌ ఇంకా ఇవ్వలేదు.


అలైన్‌మెంట్‌ మార్పులు ఇవే!

ప్రస్తుతానికి నాలుగులైన్ల ప్రాంతీయ వలయం నిర్మిస్తుండగా భవిష్యత్తులో దీన్ని విస్తరించనున్నారు. నగరశివార్లలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న హైదరాబాద్‌ ఫార్మాసిటీ (హెచ్‌పీఎస్‌)కు ఈ ప్రాంతీయ వలయం అడ్డురాకుండా ఉండేందుకు ప్రతిపాదనల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్పులు చేర్పులు చేశారు. ఇంతకుముందు కంది నుంచి చేవెళ్ల, షాబాద్‌, షాద్‌నగర్‌, కడ్తాల్‌, యాచారం మీదుగా చౌటుప్పల్‌ వరకు రీజినల్‌ రింగురోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. అయితే ప్రతిపాదిత ప్రాంతీయవలయానికి ఇరువైపులా ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు ఉన్నాయి. దీని వల్ల భవిష్యత్తులో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతాయని, ఇందువల్ల ఫార్మాసిటీకి అవతల అంటే దక్షిణభాగం వైపు ఈ రోడ్డు నిర్మించాలంటూ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. పోలేపల్లి సెజ్‌కు కూడా ఈ రహదారి అనుకూలంగా ఉండే విధంగా ప్రతిపాదనల్లో మార్పులు చేశారు. తాజాగా చేసిన మార్పుల ప్రకారం రీజినల్‌ రింగురోడ్డు సంగారెడ్డి నుంచి మహబత్‌ఖాన్‌గూడ, తంగెడపల్లి మీదుగా మన్నెగూడ,- చేవెళ్ల మధ్య కలుస్తుంది. అక్కడ నుంచి తంగెడపల్లి, చెన్‌గోముల్‌,  కొందుర్గు, రాయకల్‌, బోదానంపల్లి,  విఠాయిపల్లి (ఆమన్‌గల్లు సమీపంలో) సత్తుపల్లి, గొల్లపల్లి, శివన్నగూడ మీదుగా చౌటుప్పల్‌లో కలుస్తుంది. 

Updated Date - 2021-02-25T05:26:43+05:30 IST