విలక్షణమే ఆభరణం

ABN , First Publish Date - 2020-12-09T05:30:00+05:30 IST

అందమైన భామలు... ఆహ్లాదమైన ప్రకృతి దృశ్యాలు... క్యాలెండర్‌ అనగానే మన కళ్ల ముందు మెదిలేచిత్రాలు! కానీ ఈ క్యాలెండర్‌ అందుకు భిన్నం. దివ్యాంగులైన ఆరుగురు మోడల్స్‌ దీనిపై చిరునవ్వులు చిందిస్తారు. పుట్టుకతో కొందరు... వేరొకరి అఘాయిత్యాలకు బలైనవారు కొందరు... కారణవేదైనా వైకల్యం వారి శరీరాలకే కానీ మనసుకు కాదని స్ఫూర్తి నింపే తారలు కాని తారలు వీరు...

విలక్షణమే ఆభరణం

అందమైన భామలు... ఆహ్లాదమైన ప్రకృతి దృశ్యాలు... క్యాలెండర్‌ అనగానే మన కళ్ల ముందు మెదిలేచిత్రాలు! కానీ ఈ క్యాలెండర్‌ అందుకు భిన్నం. దివ్యాంగులైన ఆరుగురు మోడల్స్‌ దీనిపై చిరునవ్వులు చిందిస్తారు. పుట్టుకతో కొందరు... వేరొకరి అఘాయిత్యాలకు బలైనవారు కొందరు... కారణవేదైనా వైకల్యం వారి శరీరాలకే కానీ మనసుకు కాదని స్ఫూర్తి నింపే తారలు కాని తారలు వీరు. ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ రిషబ్‌ దహియాతో కలిసి ఢిల్లీ యూనివర్సిటీ పీహెచ్‌డీ విద్యార్థిని, సామాజికవేత్త పూర్వా మిట్టల్‌ రూపొందించిన ఈ ‘ఆడిటీ 2021’ క్యాలెండర్‌ విశేషాలివి...   


కొన్ని వారాలా కిందటి మాట ఇది. సుదీర్ఘ లాక్‌డౌన్‌ తరువాత పూర్వా మిట్టల్‌ తొలిసారి ఢిల్లీలోని తన ఇంటి బయట కాలు పెట్టింది. ఇన్ని నెలలూ నాలుగు గోడల మధ్యే ఉన్న ఆమెకు పట్టరాని ఆనందం. ఏదో సాధించిన అనుభూతి. అరుదైన ‘స్పైనల్‌ మస్కులర్‌ అట్రోఫీ’ (వెన్నెముక కండరాల క్షీణత)తో బాధపడుతున్న ఆమెకు కరోనా ముప్పు ఎక్కువని వైద్యులు చెప్పడంతో బయటకు వచ్చే సాహసమే చేయలేదు. అందుకే గడప దాటగానే పూర్వకు అంత సంతోషం. ‘‘నాకు ఈ క్షణం 2020లో కెల్లా అపురూపమైనది’’ అంటూ సంబరపడిపోతూ చెబుతుంది. 


ఓ మంచి పని కోసం... 

అయితే పూర్వ బయటకు వచ్చింది ఏదో కాలక్షేపం కోసం కాదు. ఒక మంచి పని కోసం. అందులో భాగంగా మొట్టమొదటిసారి తను కూడా ఒక మోడల్‌గా కనిపించడానికి సిద్ధమైంది. అదీ ప్రతి ఇంట్లో వేలాడే క్యాలెండర్‌ మోడల్‌గా! ఫొటోసూట్‌లో మేకప్‌ వేసుకుని, సెలబ్రిటీల్లా పోజ్‌లు పెట్టినప్పుడు ఆమె ఎంతో ఉత్సుకతకు లోనైంది. ఆ తరువాత కెమెరా ముందు మనస్ఫూర్తిగా ఓ నవ్వు నవ్వింది. షాట్‌ ఓకే అయింది. క్యాలెండర్‌లోని రెండు పేజీల్లో ఆమె కనిపిస్తుంది. ‘ఆడిటీ’ పేరుతో ఇటీవల విడుదలైన ఈ క్యాలెండర్‌లో ఆమె లాంటి మరో ఐదుగురు దివ్యాంగులైన మోడల్స్‌ కనిపిస్తారు. వారందరూ దివ్యాంగుల అభ్యున్నతికి పాటుపడుతున్నవారే.


ఆలోచన ఆమెదే... 

ఇలాంటి క్యాలెండర్‌ ఒకటి తేవాలన్న ఆలోచన పూర్వా మిట్టల్‌దే. దానికి సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ రిషబ్‌ దహియా జతయ్యాడు. దీని అసలు ఉద్దేశం... వైకల్యంపై అవగాహన కల్పించడం, దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతున్న ఆరు స్వచ్ఛంద సంస్థలకు నిధులు సమకూర్చడం. ఈ స్వచ్ఛంద సంస్థలకు ఈ ఆరుగురు క్యాలెండర్‌ మోడల్స్‌ సారథులుగా ఉన్నారు. ‘‘మోడల్‌గా నన్ను నేను చూసుకోవానుకున్నా. అందుకే ఈ ఆలోచనకు రూపం ఇచ్చాను’’ అంటూ పూర్వ సరదాగా చెబుతున్నా... అసలు కారణం మాత్రం ప్రపంచానికి ఓ సందేశం ఇవ్వాలనేదే! ‘‘క్యాలెండర్‌ ఆలోచన రాగానే  రిషబ్‌తో పాటు మరో మోడల్‌ ఫైజల్‌ అష్రఫ్‌ నొమానీతో జూమ్‌లో చర్చించాను. ఫైజల్‌ పరిశోధకుడు. దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతున్న కార్యకర్త. అతనికి కూడా మోడలింగ్‌ కొత్తే’’ అని చెప్పుకొచ్చింది పూర్వ. 




ధైర్యం నింపే ప్రయత్నం... 

వైకల్యంతో జీవితమంటే ఎన్నో ఇబ్బందులు... అవమానాలు. వాటన్నింటికీ ఎదురు నిలిచి లక్ష్యాన్ని ఛేదించినవారు ఎందరో! అలాంటి వారిలో ‘ఆడిటీ’ క్యాలెండర్‌ మోడల్స్‌ ఒకరు. వీరు తమలాంటి వారిలో మనోధైర్యం నింపడానికి, స్ఫూర్తి రగిలించడానికి దీన్ని ఒక వేదికగా వాడుకుని, అవకాశంగా మలుచుకున్నారు. ‘‘అడుగడుగునా సవాళ్లు ఎదుర్కొంటున్న నాలాంటి వారితో సరదాగా ఒక షూట్‌ చేయాలనుకున్నా. ఎప్పుడూ కష్టాలే కాకుండా వారి జీవితంలోని ఆస్వాదపు క్షణాలను కూడా చూపించాలనేది దీని ఉద్దేశం. తద్వారా మోడల్స్‌గా వాళ్లు మధురమైన అనుభూతికి లోనవుతారు. మాకు సానుభూతి వద్దు. మాలోనూ సామర్థ్యం ఉందని గుర్తిస్తే చాలు’’ అంటారు పూర్వ. అదే సమయంలో కంటికి కనిపించేవి, కనిపించని సమస్యలు, ఇబ్బందులపైనా దృష్టి పెట్టారామె. నిజానికి పన్నెండు మందితో షూట్‌ చేద్దామనుకున్నా, కరోనా ఆంక్షల వల్ల ఆరుగురితోనే పూర్తిచేశారు. 


వైకల్యం గుర్తింపు కాకూడదు...  

మరో విశేషమేమంటే రెండే రెండు రోజుల్లో ఈ ఫొటో షూట్‌ పూర్తి చేశాడు రిషబ్‌. ‘‘నా ఫొటో షూట్‌లన్నీ సినీ తారలు, మోడల్స్‌తోనే ఉంటాయి. కానీ విభిన్నంగా ఏదైనా చేయాలని ఎప్పుడూ అనుకొనేవాడిని. కాలేజీలో ఉన్నప్పటి నుంచి పూర్వతో పరిచయం ఉంది. అప్పట్లో తను కూడా నాలానే ఆలోచించేది. ఇన్నాళ్లకు ఇదిగో ఇలా ఒక విలక్షణమైన క్యాలెండర్‌ కోసం పని చేయగలిగాను. వైకల్యం గలవారితో షూటింగ్‌ అనగానే సాధారణంగా సెట్‌లో వాతావరణం గంభీరంగా ఉంటుంది. ఫొటోల్లో పోజులూ అలానే కనిపిస్తాయి. దానికి భిన్నంగా ఈ షూట్‌ చేశాం. క్యాలెండర్‌లో ఫొటోలు చూస్తే అర్థమవుతుంది... వారు ఎంత మనోనిబ్బరంగా ఉన్నారో, ఎంత మనస్ఫూర్తిగా నవ్వుతున్నారో! మేం చెప్పదలుచుకున్నది ఒక్కటే... వైకల్యం వారి గుర్తింపు కాకూడదని’’ అనేది రిషబ్‌ మాట. 


అందరికీ కొత్తే... 

ఈ ఆరుగురిలో ఒక్క ప్రణవ్‌ భక్షీకే మోడలింగ్‌లో అనుభవం ఉంది. ఆటిజమ్‌తో బాధపడుతున్న అతడు ఇరవై ఏళ్లకే మోడలింగ్‌ ప్రారంభించాడు. భారత్‌లో మొట్టమొదటి ఆటిజమ్‌ ఉన్న ఫ్యాషన్‌ మోడల్‌గా రికార్డులకెక్కాడు. ‘‘దివ్యాంగులు ఆనందంగా జీవించడం లేదనే అపోహ సమాజంలో పాతుకుపోయింది. ఇది తప్పని చాటిచెప్పాలనుకున్నాం’’ అంటాడు ప్రణవ్‌. ‘‘మేకప్‌ వేసుకున్న తరువాత నన్ను నేనే గుర్తు పట్టలేకపోయా. ఇది నేనేనా అనిపించింది’’ అని మోడల్‌గా తన తొలి అనుభవాన్ని పంచుకున్నాడు ఫైజల్‌. ఏది ఏమైనా ‘‘దివ్యాంగులు కూడా ఈ సమాజంలో భాగమే. వాళ్లు మైనార్టీలు కాదు. వైకల్యం ఎవరికైనా, ఎప్పుడైనా సంభవించవచ్చు. ఈ సత్యాన్ని మన సమాజం  గ్రహించాలి’’ అంటూ భావోద్వేగంగా చెబుతున్న పూర్వా మిట్టల్‌ ప్రయత్నం యువతరానికి స్ఫూర్తి మంత్రం.

Updated Date - 2020-12-09T05:30:00+05:30 IST