సెంచరీ మిస్సయినా ద్రవిడ్ రికార్డును బద్దలుగొట్టిన రిషభ్ పంత్

ABN , First Publish Date - 2022-01-22T02:57:54+05:30 IST

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో 71 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 85 పరుగులు

సెంచరీ మిస్సయినా ద్రవిడ్ రికార్డును బద్దలుగొట్టిన రిషభ్ పంత్

పార్ల్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో 71 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 85 పరుగులు చేసిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక పరుగులు సాధించిన భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.


ఈ క్రమంలో మాజీ కెప్టెన్, ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డును అధిగమించాడు. తొలి సెంచరీ చేసే అవకాశాన్ని కొద్దిలో చేజార్జుకున్న పంత్.. దక్షిణాఫ్రికాలో మూడంకెల స్కోరు సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా తన పేరును రికార్డు పుస్తకాల్లో ఎక్కించుకున్నాడు. 


2001లో డర్బన్‌లో జరిగిన మ్యాచ్‌లో ద్రవిడ్ 77 పరుగులు సాధించాడు. సఫారీ గడ్డపై భారత వికెట్ కీపర్ సాధించిన అత్యధిక స్కోరు ఇప్పటి వరకు ఇదే.  కెన్యా కూడా పాల్గొన్న ఈ ముక్కోణపు సిరీస్ ఫైనల్‌లో భారత జట్టు 183 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.


ఇక, తాజా మ్యాచ్‌లో పంత్  కనుక సెంచరీ చేజార్చుకోకపోయి ఉంటే ఈ పర్యటనలో అతడి ఖాతాలో రెండు సెంచరీలు కలిసేవి. కేప్‌టౌన్ టెస్టులో సెంచరీ సాధించిన పంత్ దక్షిణాఫ్రికాలో శతకం సాధించిన తొలి ఇండియన్ వికెట్ కీపర్‌గా రికార్డులకెక్కాడు.  

Updated Date - 2022-01-22T02:57:54+05:30 IST