పంత్‌కు పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-07-16T06:42:03+05:30 IST

వచ్చేనెలలో ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్ట్‌ల సిరీ్‌సకు ముందు టీమిండియాలో కరోనా కలకలం రేగింది. జట్టు వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌, త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌ దయానంద్‌ గరానీ పాజిటివ్‌గా తేలారు...

పంత్‌కు పాజిటివ్‌

  • టీమిండియాలో కరోనా కలకలం
  • త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌ దయానంద్‌కు కూడా..
  • ఐసొలేషన్‌లో సాహా, అభిమన్యు, భరత్‌ అరుణ్‌


న్యూఢిల్లీ/లండన్‌: వచ్చేనెలలో ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్ట్‌ల సిరీ్‌సకు ముందు టీమిండియాలో కరోనా కలకలం రేగింది. జట్టు వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌, త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌ దయానంద్‌ గరానీ పాజిటివ్‌గా తేలారు. అలాగే ముందు జాగ్రత్తగా జట్టులోని మరో ముగ్గురినీ ఐసొలేషన్‌కు తరలించారు. గరానీతో కాంటాక్టులో ఉండడంతో బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, రిజర్వ్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా, ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. గరానీ కొవిడ్‌ పరీక్ష నివేదిక గురువారం ఉదయం వచ్చింది. కరోనా నేపథ్యంలో భారత జట్టుకు ఇక ప్రతిరోజూ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ‘బ్రేక్‌ సమయంలో భారత జట్టుతో కలిసి పంత్‌ హోటల్‌లో లేడు. ఈనెల 8న అతడు పాజిటివ్‌గా తేలాడు. అయితే రిషభ్‌కు వైరస్‌ లక్షణాలు లేవు. పాజిటివ్‌గా తేలిన ప్రదేశంలోనే అతడు ఐసొలేషన్‌లో ఉన్నాడు’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా గురువారం రాత్రి విడుదలజేసిన ప్రకటనలో తెలిపాడు. ‘పంత్‌ కోలుకుంటున్నాడు. రెండు ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షల్లో పంత్‌ నెగెటివ్‌గా తేలితే అతడు డర్హమ్‌లో ఉన్న జట్టుతో కలుస్తాడు’ అని షా వివరించాడు. ఇక.. భరత్‌ అరుణ్‌, ఈశ్వరన్‌, సాహా ముగ్గురికీ నెగెటివ్‌ వచ్చినా.. బ్రిటన్‌ ప్రభుత్వ కొవిడ్‌ నిబంధనల ప్రకారం 10 రోజులు లండన్‌లోని తమ హోటల్‌ గదుల్లో ఐసొలేషన్‌లో ఉండనున్నారని బీసీసీఐ మరో ప్రకటనలో తెలిపింది. జట్టు సభ్యులు, వారి కుటుంబసభ్యులకు ఈనెలారంభంలో కోవిషీల్డ్‌ రెండో డోసును లండన్‌లో వేసినట్టు పేర్కొంది. ‘రిస్క్‌ను నివారించేందుకు ప్రతిరోజూ భారత జట్టుకు కొవిడ్‌ పరీక్షలు జరుపుతారు’ అని బోర్డు తెలిపింది. పంత్‌, ఈశ్వరన్‌, సాహా 20నుంచి కౌంటీ లెవెన్‌తో జరిగే మూడ్రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు దూరం కానున్నారు. దాంతో ఆ మ్యాచ్‌కు కేఎల్‌ రాహుల్‌ కీపింగ్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. 


రిషభ్‌కు డెల్టా-3 వేరియంట్‌?

ఈనెల 7న పంత్‌కు రెండో డోసు వ్యాక్సిన్‌ వేశారు. అయితే అంతకంటే ముందే అతడికి డెల్టా-3 వేరియంట్‌ సోకినట్టు సమాచారం. ఇక సాహా ఐపీఎల్‌ సందర్భంగా కరోనా బారినపడ్డాడు. ఈనెల మొదట్లో గాయపడిన ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఇప్పటికే జట్టు బయోబబుల్‌ను వీడాడు. 





అక్కడే సోకిందా ?

ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కేసుల పెరుగుదలకు కారణమవుతున్న డెల్టా వేరియంట్‌ పంత్‌కు సోకినట్టు సమాచారం. ఈ వైరస్‌ అతడికి యూరో కప్‌ మ్యాచ్‌ తిలకించేందుకు వెంబ్లీ స్టేడియానికి వెళ్లినప్పుడు సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతనెల 30న ఇంగ్లండ్‌-జర్మనీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు హాజరైన రిషభ్‌ అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. వాటిలో అతడు మాస్క్‌ ధరించకుండా కనిపించాడు. దాంతో అప్పట్లోనే పంత్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ మ్యాచ్‌కు హాజరైన అనంతరం పంత్‌కు తేలికపాటి జ్వరం వచ్చినట్టు తెలిసింది. దాంతో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలాడు. జట్టు కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నా అది రక్షణగా మాత్రమే ఉంటుంది తప్ప వైరస్‌ సోకకుండా నిరోధించలేదని, అందువల్ల జనసమర్థ ప్రాంతాలకు వెళ్లవద్దని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇదివరకే లేఖ ద్వారా జట్టును హెచ్చరించాడు. వింబుల్డన్‌, యూరో చాంపియన్‌షి్‌పను దృష్టిలో ఉంచుకొనే షా ఆ లేఖ రాసినట్టు సమాచారం. భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య 5 టెస్ట్‌ల సిరీస్‌ వచ్చేనెల 4నుంచి జరగనుంది. టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప-2 కూడా ఈ సిరీ్‌సతోనే ప్రారంభం కానుండడం గమనార్హం. 


కఠిన బయోబబుల్‌ ఉండదు: ఈసీబీ

భారత జట్టులో రెండు కరోనా కేసులు వెలుగుచూసినా..ఐదు టెస్ట్‌ల సిరీ్‌సకు కఠిన బయోబబుల్‌ ఉండబోదని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ టామ్‌ హారిసన్‌ స్పష్టంజేశాడు. క్రికెటర్లతోపాటు ఈ సిరీ్‌సలో భాగస్వాములైన వారంతా కొవిడ్‌తో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలని అతడు వ్యాఖ్యానించాడు. కాగా, టీమిండియాలో కరోనా వెలుగు చూడడంతో ఐదు టెస్ట్‌ల సిరీ్‌సపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. ‘ఐసోలేషన్‌ నిబంధనలు మార్చాలి. లేదంటే భారత జట్టులో కొవిడ్‌ కేసుల ప్రభావం ఐదు టెస్ట్‌ల సిరీ్‌సపై పడే అవకాశాలున్నాయి’ అని అతడు ట్వీట్‌ చేశాడు. 

Updated Date - 2021-07-16T06:42:03+05:30 IST