గొర్రెలిస్తారా...?

ABN , First Publish Date - 2020-09-19T05:30:00+05:30 IST

రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పెంపకందారులకు గొర్రెల యూనిట్లు అందిస్తామని ప్రకటించడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి

గొర్రెలిస్తారా...?

మంత్రి ప్రకటనతో పెరుగుతున్న ఆశలు

రూ. 11.78 కోట్లు వాటా ధనంగా చెల్లించిన పెంపకందారులు

యూనిట్ల కోసం 3,772 మంది ఎదురుచూపులు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పెంపకందారులకు గొర్రెల యూనిట్లు అందిస్తామని ప్రకటించడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. అదే స్థాయిలో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పథకం ప్రారంభించి మూడేళ్లు కావస్తున్నా కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో రెండో  విడత గొర్రెల పంపిణీకి శ్రీకారమే చుట్టలేదు. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో ్లకలిపి ఎనిమిది వేలకుపైగా యూనిట్లను పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 3,772 మంది పెంపకందారులు తమ వంతు వాటా కింద 11.78 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి డీడీల రూపకంగా చెల్లించారు. వీరందరూ రెండేళ్లుగా గొర్రెల యూనిట్ల కోసం ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగిన ఈ కొద్ది రోజుల వ్యవధిలోనే పశుసంవర్థకశాఖ మంత్రి రెండుమార్లు గొర్రెల పెంపకం పథకం గురించి మాట్లాడడంతో పెంపకందారులలో ఆశలు చిగురిస్తున్నాయి.  పశుసంవర్థక శాఖ మందుల కొనుగోలుకే బడ్జెట్‌ కొరత ఎదుర్కొంటుండగా గొర్రెల యూనిట్లు ఎలా కొనుగోలు చేస్తారన్న విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


2017లో పథకం ప్రారంభం

2017లో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. మొదటి విడతలో ఉమ్మడి జిల్లా పరిధిలో 42,792 గొర్రెల యూనిట్లను, రెండో విడతలో 42,551 యూనిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఒక్కో యూనిట్‌లో 20 గొర్రెలతోపాటు ఒక పోతును ఇవ్వాలని నిర్ణయించారు. ఈ యూనిట్‌కు లక్షా 25 వేల రూపాయల విలువను ఖరారు చేశారు. యూనిట్‌ విలువలో లబ్ధిదారులు తమ వాటా కింద 31,250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో మొదటి విడతలో 40,439 యూనిట్లను, రెండో విడతలో 8,755 గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. 10,33,074 గొర్రెలు ఈ పథకం కింద జిల్లా గొర్రెల పెంపకందారులకు చేరాయి. నిర్ధేశించిన లక్ష్యం ప్రకారం రెండు విడతల్లో కలిపి ఇంకా 36,149 యూనిట్లు అందించాల్సి ఉన్నది.  


క్షేత్రస్థాయిలో కనిపించన జీవాలు

మొదటి సంవత్సరం పంపిణీ సందర్భంలో గొర్రెల కొనుగోలులో గోల్‌మాల్‌ జరుగుతున్నదని ఆరోపణ వచ్చాయి. కడప జిల్లా నుంచి యూనిట్లను తీసుకుని రావడంలో పశుసంవర్థక శాఖ డాక్టర్లు, దళారులు కుమ్మక్కై వాటిని పక్కదారి పట్టించారని విమర్శలు వినిపించాయి. మంచి గొర్రెలను కొనుగోలు చేయకపోవడం, ఆరోగ్యంగా లేని గొర్రెల్లో కొన్ని ఇక్కడికి వచ్చేసరికే మరణించడంతో తాము చెల్లించిన వాటా సొమ్ముకు అదనంగా 30 వేల రూపాయలు వచ్చినా చాలు అనే ధోరణితో పలువురు గొర్రెల పెంపకందారులు యూనిట్‌ విలువలో సగం ధరకే గొర్రెలను అమ్మేశారు. దీంతో ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలన్నీ ఇప్పటికే మాంసం షాపులకు అమ్ముడు పోయాయి. కరీంనగర్‌ జిల్లాలో కలెక్టర్‌ అనుమతి లేకుండానే 585 యూనిట్ల గొర్రెలను కొనుగోలు చేశామని పశుసంవర్థకశాఖ అధికారులు రికార్డులు సృష్టించారు. ఈ సందర్భంగా చేసిన విచారణలో 80 శాతం గొర్రెలు  లబ్ధిదారుల వద్ద లేవని తేలడంతో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారు. తర్వాత గొర్రెల పంపిణీని దాదాపు నిలిచిపోయిందనే చెప్పవచ్చు. 


పూర్తి కాని మొదటి విడత పంపిణీ

ఐదు నెలల క్రితం రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో కలిసి సిరిసిల్లకు వచ్చి రెండో విడత గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆ జిల్లాలో 3,557 యూనిట్లను, జగిత్యాల జిల్లాలో 5,198 యూనిట్లను పంపిణీ చేశారు. కరీంనగర్‌ జిల్లాలో రెండవ విడతలో 13,420 యూనిట్లు, పెద్దపల్లి జిల్లాలో 10,612 యూనిట్లు ఇవ్వాల్సి ఉన్నది. ఇప్పటి వరకు పంపిణీ ప్రారంభం కాలేదు. ఈ రెండు జిల్లాల్లో లబ్దిదారుల నుంచి వాటా ధనాన్ని కూడా స్వీకరించలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండో విడతలో 4,452 యూనిట్లు, జగిత్యాల జిల్లాలో 5,312 యూనిట్లను ఇంకా పంపిణీ చేయాల్సి ఉన్నది.


మొదటి విడతలో కరీంనగర్‌ జిల్లాలో 517 యూనిట్లు, పెద్దపల్లి జిల్లాలో 383 యూనిట్లు, సిరిసిల్ల జిల్లాలో 635 యూనిట్లు, జగిత్యాల జిల్లాలో 818 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉన్నది. రెండు విడతల్లో కలిపి 36,149 యూనిట్లు ఇంకా లబ్దిదారులకు అందించాల్సి ఉన్నది. కరీంనగర్‌ జిల్లాలో 137 మంది, జగిత్యాల జిల్లాలో 2,535 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,100 మంది గొర్రెల పెంపకందారులు ఒక్కొక్కరు 31,250 రూపాయల చొప్పున 11,78,75,000 రూపాయలను తమ వాటా కింద డీడీ రూపంలో చెల్లించారు. రెండేళ్లుగా వీరు గొర్రెల యూనిట్ల కోసం ఎదురుచూస్తున్నా అధికారులు మాత్రం కిమ్మనడం లేదు.

Updated Date - 2020-09-19T05:30:00+05:30 IST