19 మండలాల్లో ఆంక్షలు

ABN , First Publish Date - 2021-04-22T06:22:24+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతిని కట్టడి చేసేందుకు 19 మండలాల్లో ఆంక్షలు విధించనున్నట్లు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ వెల్లడించారు.

19 మండలాల్లో ఆంక్షలు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పోలా భాస్కర్‌, డీఎంహెచ్‌వో రత్నావళి

మొదటి డోస్‌ వేయించుకున్న వారందరికీ సెకండ్‌ డోసు

కలెక్టర్‌ పోలా భాస్కర్‌

నేడు జిల్లా అధికారులతో సమావేశం

ఒంగోలు (కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 21 : జిల్లాలో కరోనా ఉధృతిని కట్టడి చేసేందుకు 19 మండలాల్లో ఆంక్షలు విధించనున్నట్లు కలెక్టర్‌ పోలా  భాస్కర్‌ వెల్లడించారు. గురువారం ఈ విషయంపై జిల్లా అధికారులతో చర్చించి ఆదేశాలు జారీ చేస్తామన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా కేసులు పెరుగుతున్న మండలాల్లో స్థానికంగా ఆంక్షలు విధిస్తామని తెలిపారు. ఉదయం 6  నుంచి 10గంటల వరకూ నిత్యావసరాలు సమకూర్చుకునేలా సడలింపు ఇస్తామన్నారు. 10 నుంచి మధ్యాహ్నం 4గంటల వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. తిరిగి సాయంత్రం 4 నుంచి 6గంటల వరకూ సడలింపు ఇస్తామన్నారు. సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.  రెవెన్యూ, పోలీస్‌, పంచాయతీ సిబ్బందికి అవగాహన కల్పించి ఎప్పటి నుంచి అమలు చేయాలో తేదీలను ఖరారు చేస్తామన్నారు. ఈ ఆంక్షలు 19 మండలాల్లో పదిరోజుల  కొనసాగుతాయని తెలిపారు. ఒంగోలు అర్బన్‌, రూరల్‌, మార్కాపురం, చీరాల అర్బన్‌, త్రిపురాంతకం, కందుకూరుఅర్బన్‌, ఎస్‌కొండ, చీరాలరూరల్‌, పర్చూరు, ఎన్‌జీపాడు, కనిగిరి అర్బన్‌, రూరల్‌, అద్దంకి అర్బన్‌, టంగుటూరు, వేటపాలెం, దర్శి, మార్కాపురం రూరల్‌, కారంచేడు, మార్టూరు మండలాల్లో ఆంక్షలు కొనసాగించనున్నట్లు తెలిపారు.  అవసరమైన అందరికీ రెండో డోసు వాక్సిన్‌ వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ఈనెల 22న స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నట్లు తెలిపారు. కొవిడ్‌ పరీక్షలు, చికిత్స కోసం కంట్రోలు రూంకు ఫోన్‌ చేస్తే వెంటనే స్పందించే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం ఆక్సిజన్‌ కొరత లేదని తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్‌వో రత్నావళి, డీఐవో పద్మజ, డాక్టర్‌ తిరుమలరావులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-22T06:22:24+05:30 IST