పితృ ప్రీతికరం మహాలయం

ABN , First Publish Date - 2021-09-17T05:30:00+05:30 IST

మానవులు ప్రతి ఒక్కరూ పంచ మహా యజ్ఞాలను విధిగా నిర్వహించాలని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అవి భూత యజ్ఞం, మనుష్య యజ్ఞం, పితృ యజ్ఞం, దేవ యజ్ఞం, బ్రహ్మ యజ్ఞం

పితృ ప్రీతికరం మహాలయం

మానవులు ప్రతి ఒక్కరూ పంచ మహా యజ్ఞాలను విధిగా నిర్వహించాలని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అవి భూత యజ్ఞం, మనుష్య యజ్ఞం, పితృ యజ్ఞం, దేవ యజ్ఞం, బ్రహ్మ యజ్ఞం. వీటిలో పితృ యజ్ఞానికి విశేష స్థానం ఉంది. మన శ్రేయస్సుకోసం తల్లితండ్రులు చేసే త్యాగం వెలకట్టలేనిది. కాబట్టి పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేయడం తప్పనిసరిగా పూర్వులు నిర్దేశించారు. ఆ విధిని మహాలయ పక్షంలో నెరవేర్చడం అతి శ్రేష్టంగా పేర్కొన్నారు. ‘మహత్‌ అలం యాత్‌ ఇతి మహాలయం’ అని వ్యుత్పత్తి. ‘మహాలయం’ అంటే పితృ దేవతలకు ప్రీతి కలిగించే కాలం. భాద్రపద కృష్ణపక్షాన్ని ‘మహాలయ పక్షం’ అంటారు. ఈ పదిహేను రోజులూ పితృ కార్యాలకు పవిత్రమైనవి. ఈ కాలంలో పుత్రులు చేసే తర్పణాదుల ద్వారా చాలినంత తృప్తిని పితరులు పొందుతారు.  


  • ఆషాఢే మవధిం కృత్వా పంచమ పర్ణ మాశ్రితాః
  • కాంక్షంతి పితరః క్లిష్టాః అన్న మాప్య స్వహం జలమ్‌

సూర్యుడు కన్య, తుల రాశుల నుంచి వృశ్చిక రాశికి వచ్చేసరికి ప్రేత పురి శూన్యంగా ఉంటుంది. అక్కడ ఇక్కట్లపాలైన పితృదేవతలు ఆషాఢ మాసం నుంచి భాద్రపద కృష్ణ పక్షం మధ్య... అయిదు పక్షాలలో భూలోకానికి వచ్చి తమ సంతానం లేదా వారసుల ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారని ‘మహా భారతం’ చెబుతోంది. వారికి తిరిగి భూలోకంలో జన్మించాలనే కాంక్ష కూడా పెరుగుతుందనీ, తమలోని శక్తులను వారు పోగు చేసుకొని... కర్మాధికారం కలిగిన వారసులవైపు చూస్తూ ఉంటారని ‘స్కాంధ పురాణం’, ‘చతుర్వర్గ చింతామణి’ స్పష్టం చేశాయి. 


కర్ణుడి కథ...

మహాభారతంలో కర్ణుడికి సంబంధించిన కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. దాన కర్ణుడు కురుక్షేత్రంలో వీరమరణం పొందాడు. స్వర్గ లోకానికి వెళుతూ ఉండగా అతనికి ఆకలిదప్పులు కలిగాయి. అవి తీర్చుకోవడానికి ఫలాలను కోస్తే బంగారం అయింది. నీళ్ళు తాగబోతే బంగారు ద్రవంగా మారింది. దీనితో అతను ఆశ్చర్య చకితుడయ్యాడు. ఇంతలో ఆకాశవాణి ‘‘కర్ణా! నీవు దానశీలుడిగా పేరు పొందావు. అందరికీ అన్నీ ఇచ్చావు. కానీ ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. దాని పర్యవసానమే ఇది!’’ అన్నది.

కర్ణుడు తన తప్పు తెలుసుకొని, తండ్రి సూర్యుడి ద్వారా ఇంద్రుడు తదితర దేవతలను మెప్పించాడు. భౌతిక శరీరాన్ని పొందాడు. ఆ రోజు భాద్రపద బహుళ పాడ్యమి. ఆనాటి నుంచి పక్షం రోజుల పాటు రాజ్యంలోని ప్రజలందరికీ సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణాలు విడచి, అమావాస్య నాడు స్వర్గానికి చేరుకున్నాడు. అంతేకాకుండా, తన జన్మ విశేషాలను ధర్మరాజుకు చెప్పి, శ్రాద్ధ విధిని నిర్వర్తించేలా చేయమని శ్రీకృష్ణుడితో మనవి చేశాడు.


ఎప్పుడు చేయాలి? ఏం చేయాలి?

మహాలయ పక్షంలోని పదిహేను రోజులు పితృయజ్ఞం చేయాలి. వీలుకాకపోతే పితరులు గతించిన తిథి నాడైనా శ్రాద్ధకర్మ నిర్వర్తించవచ్చు. ఆటంకాల వల్ల అది కూడా కుదరకపోతే... మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధ విధి నిర్వహించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రాద్ధం అంటే ‘శ్రద్ధాయా దీయతే ఇతి శ్రాద్ధం’ అని వ్యుత్పత్తి. కనిపించేది భౌతిక శరీరం. ప్రేత రెండవ శరీరం. ఆత్మ మూడవ శరీరం. వీటిని సూక్ష్మ, రూప, కారణ శరీరాలని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. మహాలయ సంకల్పంలో చెప్పుకొనే వసు, రుద్ర, ఆదిత్య రూపాలు వీటికి ప్రతీకలు. 


తర్పణాలు ఎవరికి విడవాలి?

స్వర్గస్తులైన తల్లితండ్రులు, పితామహులు, మాతామహులకు, గతించిన భార్యకు, తోబుట్టువులకు, అత్తమామలకు, జ్ఞాతులకు, తండ్రికి, తల్లికి సంబంధించిన వారికి, స్నేహితులకు, వారి భార్యలకు, గురువుకు, గురుపత్నికి, వారసులు లేని వారికి... ఇలా స్వర్గస్తులైన ఎందరికైనా తర్పణాలు విడువవచ్చు. ఇలా పితృయజ్ఞం నిర్వహిస్తే గయా శ్రాద్ధం చేసిన ఫలం లభిస్తుంది. ఊర్ధ్వలోకాలలో ఉన్న పితృ దేవతలకు ఆకలిదప్పులు తీరి సంతుష్టులవుతారు. తమ పుత్ర పౌత్రాదులను, వంశస్తులనూ, హితులనూ, శ్రాద్ధ విధి నిర్వహించిన వారినీ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తారు. వారు సంతుష్టి చెంది, శాంతి పొందినప్పుడే మన జీవితాలు ఆనందమయంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. అన్ని వర్గాలవారూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులు నిర్వర్తించి,. వారిపట్ల భక్తి శ్రద్ధలను చాటుకోవాలి. తమ వంశ పరంపర నిత్య శోభాయమానంగా ఉండాలని కోరుకోవాలి.

- ఎ. సీతారామారావు

(20 నుంచి మహాలయ పక్షం)

Updated Date - 2021-09-17T05:30:00+05:30 IST