కృష్ణానదిలో అనధికార గాలు మార్గం.. అక్రమ వసూళ్లు

ABN , First Publish Date - 2020-04-02T09:10:28+05:30 IST

కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేక ఎండిపోయింది. ఇదే అదనుగా కృష్ణా, గుంటూరు సరిహద్దులోని ఘంటసాల, కొల్లూరు మండల్లాలోని శ్రీకాకుళం, గాజుల్లంక గ్రామాల మధ్య నదిలో అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు అనధికారికంగా గాలు మార్గం ఏర్పాటు చేయించారు.

కృష్ణానదిలో అనధికార గాలు మార్గం.. అక్రమ వసూళ్లు

యధేచ్ఛగా కొనసాగుతున్న రాకపోకలు


కొల్లూరు, ఏప్రిల్‌ 1 : కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేక ఎండిపోయింది. ఇదే అదనుగా  కృష్ణా, గుంటూరు సరిహద్దులోని ఘంటసాల, కొల్లూరు మండల్లాలోని శ్రీకాకుళం, గాజుల్లంక గ్రామాల మధ్య  నదిలో అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు అనధికారికంగా గాలు మార్గం ఏర్పాటు చేయించారు. దీని నుంచి ప్రయాణించే వారి నుండి టోలు వసూళ్ళు ప్రారంభించారు. గడ్డి ట్రాక్టర్‌కు రూ.150, ద్విచక్ర వాహనానికి రూ.30, కార్లకు రూ.70 వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి నదీ పరివాహక శాఖ అనుమతులు లేవు. అధికార పార్టీకి చెందిన కొంత మంది అండదండలతో నదిలో గాలు మార్గం ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లకు తెర తీశారు. ఒకవారం కృష్ణా జిల్లా పరిధిలో, మరోవారం గుంటూరు జిల్లా పరిధిలో టోల్‌గేట్లు ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి నగదు వసూలు చేస్తున్నారు. గతంలో కూడా కృష్ణానదిలో ఇదే ప్రాంతంలో గాలు మార్గం ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడుతున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో అక్రమ వసూళ్లను అడ్డుకున్నారు.


ప్రస్తుతం కొనసాగుతున్న గాలు మార్గం దందా గురించి ఇరు జిల్లాల్లోని సరిహద్దు మండలాలకు చెందిన అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కావడం, ప్రజా ప్రతినిధుల నుంచి వారికి బలమైన మద్దతు ఉండటంతో అక్రమ వసూళ్లు నిలుపుదల చేసేందుకు రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సాహసించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ అమలు ఉండి ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ నిర్వీర్యం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కానీ కృష్ణానదిలో గాలు మార్గం ద్వారా కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు యధేచ్ఛగా రాకపోకలు సాగిస్తూ లాక్‌డౌన్‌ పాటించడం లేదు.  ఈ వ్యవహారం మీద కొల్లూరు ఎస్‌ఐ ఉజ్వల్‌కుమార్‌ గాలు మార్గానికి ఎక్సకవేటర్‌తో బుధవారం గండి కొట్టించారు. తమ పరిధిలో టోల్‌గేట్‌ ఏర్పాటు చేసి వసూళ్లు జరగడం లేదని కృష్ణా జిల్లా పరిధిలోనే జరుగుతున్నట్లుగా వివరించారు. కృష్ణానదిలో ఏర్పాటు చేసిన గాలు మార్గానికి గండి కొట్టించినప్పటికీ వాహనదారులు ఆ కొద్ది మేర ద్విచక్ర వాహనాలను ఇసుకలో తోసుకుంటూ రాకపోకలు సాగిస్తుండటం గమనార్హం.

Updated Date - 2020-04-02T09:10:28+05:30 IST