భూములిచ్చిన మాపైనే కక్ష!

ABN , First Publish Date - 2021-01-17T05:38:30+05:30 IST

రాజధానికోసం భూములు త్యాగం చేసిన తమపైనే ప్రభుత్వం కక్ష కట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

భూములిచ్చిన మాపైనే కక్ష!
మందడం రైతు శిబిరంలో జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న మహిళలు

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలి

396వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు

 

తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, జనవరి 16: రాజధానికోసం భూములు త్యాగం చేసిన తమపైనే ప్రభుత్వం కక్ష కట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు శనివారం 396 రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, పెదపరిమి, నెక్కల్లు, అనంతరవం, దొండపాడు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, వెలగపూడి, మందడం, ఐనవోలు, తదితర గ్రామాల్లోని రైతు దీక్ష శిబిరాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి, మూడు రాజధానుల డామ్రా ఆడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో అమరావతి రైతులు, రైతు కూలీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నిరుపేదలైన రాజధాని వ్యవసాయ కూలీలకు అమరావతి ఫింఛన్‌ నెలకు రూ.2500 నుంచి ఐదువేలు పెంచి ఇస్తామని చెప్పి, ఇప్పుడు కోర్టుల పరిధిలో ఉందని అబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అమరావతి పనులు నిలిపివేయటంతో ఉపాధి కోల్పోయామని వాపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. విజయవాడ నుంచి వచ్చిన ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజర్‌, హైదరాబాద్‌ నుంచి వచ్చిన జె.విజయ్‌కమార్‌ రైతులకు మద్దతు తెలిపారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, బేతపూడి, నీరుకొండ గ్రామాల్లోని దీక్షా శిబిరాల్లో పలువురు రైతులు, మహిళలు పాల్గొన్నారు.తాడేపల్లి మండలం పెనుమాకలో ఐకాస ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి.

Updated Date - 2021-01-17T05:38:30+05:30 IST