జగన్‌కు అవినీతి కేసులో శిక్ష పడితే తమిళనాడు తరహా ప్రయోగం!?

ABN , First Publish Date - 2021-06-06T14:16:56+05:30 IST

జగన్‌ రెడ్డికి ప్రస్తుత పరిస్థితి కల్పించిన ఖ్యాతి మాత్రం రఘురాజుకే దక్కుతుంది.

జగన్‌కు అవినీతి కేసులో శిక్ష పడితే తమిళనాడు తరహా ప్రయోగం!?

ముఖ్యమంత్రిగా జగన్‌ రెడ్డి బెయిల్‌ షరతులను ఉల్లంఘిస్తున్నందున ఆయనకు ఇచ్చిన బెయిల్‌ రద్దు చేయాలని రఘురాజు దాఖలు చేసిన పిటిషన్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ పిటిషన్‌ వేసినందునే రఘురాజును అరెస్టు చేసి కస్టడీలో కొట్టించారన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. బెయిలు షరతులను జగన్‌ రెడ్డి ఉల్లంఘిస్తున్నారనడానికి తనకు ఎదురైన అనుభవమే ఉదాహరణ అని రేపు సీబీఐ కోర్టులో రఘురాజు చెప్పుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా సీబీఐ కేసుల్లో సహ నిందితులుగా ఉన్నవారికి జగన్‌ తన ప్రభుత్వంలో ఎలా పెద్ద పీట వేసిందీ, గతంలో ఈ కేసులలో ఆదాయపు పన్ను శాఖ అధికారిగా విచారణ జరిపిన జాస్తి కృష్ణ కిషోర్‌ను ముఖ్యమంత్రి అయ్యాక జగన్‌ రెడ్డి ఎలా వేధించిందీ కోర్టుకు వివరించడానికి న్యాయవాదులు సిద్ధపడుతున్నారు.ఈ నేపథ్యంలో జగన్‌ రెడ్డికి బెయిలు రద్దవుతుందా? లేక రఘురాజు పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.


జగన్‌ రెడ్డికి ప్రస్తుత పరిస్థితి కల్పించిన ఖ్యాతి మాత్రం రఘురాజుకే దక్కుతుంది. కొరివితో తల గోక్కున్నట్టుగా ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే జగన్‌ రెడ్డి పెట్టుకున్నారు. నిజానికి జగన్‌, రఘురాజు మధ్య విభేదాలు ఈనాటివి కావు. 2014 ఎన్నికలకు ముందే నర్సాపురం నుంచి లోక్‌సభకు పోటీ చేయాలనుకున్న తన నుంచి జగన్‌ రెడ్డి భారీ మొత్తం తీసుకున్నాడని, ఆ తర్వాత తమ మధ్య విభేదాలు రావడంతో ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని తాను కోరినా జగన్‌ పట్టించుకోలేదని ఒక దశలో రఘురాజు ఆరోపించారు. ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణామాలు జరిగి అదే రఘురాజుకు నర్సాపురం టికెట్‌ను 2019లో అదే జగన్‌ రెడ్డి కేటాయించారు. ఎంపీగా ఎన్నికైన ఏడాదికే జగన్‌తో విభేదాలు రావడంతో రఘురాజు విమర్శలు మొదలెట్టారు. ఒక ఎంపీగా ఉన్న తనకు జగన్‌ రెడ్డి కనీస గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదన్నది ఆయన వాదన. ఈ విభేదాలు చినికిచినికి గాలివానగా మారి జగన్‌పై ప్రతిరోజూ విమర్శలకు రఘు పూనుకున్నారు. తాను టికెట్‌ ఇస్తే గెలిచిన వ్యక్తి తనను విమర్శించడం ఏమిటన్న అహంతో గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్న జగన్‌ రెడ్డి ఇప్పుడు జాతీయ స్థాయిలో అభాసుపాలు అవుతున్నారు.


రఘురాజు శక్తి సామర్థ్యాలను ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి మాత్రమే కాదు సీఐడీ అధికారులు కూడా తక్కువగా అంచనా వేశారు. ఫలితంగానే ఏబీఎన్‌, టీవీ5 చానళ్లపై కూడా రాజద్రోహం కేసు పెట్టారు. రాజద్రోహానికి పాల్పడే వ్యక్తికి జగన్‌ రెడ్డి పార్టీ టికెట్‌ ఎలా ఇచ్చారు? ఎందుకిచ్చారు? రఘురాజు ఆరోపించినట్టుగా గతంలో ఆయన దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించని విషయం వాస్తవమా కాదా? ఈ ప్రశ్నలకు జగన్‌ రెడ్డి జవాబు చెప్పవలసి ఉంటుంది. చేతిలో అధికారం ఉంది కదా అని విర్రవీగితే ఏం జరుగుతుందో సుప్రీంకోర్టు తీర్పులే చెబుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇరుక్కున్న సునీల్‌ కుమార్‌ అండ్‌ కోను జగన్‌ రెడ్డి కాపాడతారా? బెయిలు రద్దయితే మళ్లీ జైలుకు వెళ్లే జగన్‌ రెడ్డి కళ్లలో ఆనందం చూడ్డానికి అడ్డమైన పనులు చేసే అధికారులకు ఈ కేసు ఒక గుణపాఠం కాదా? సుప్రీంకోర్టు తాజా తీర్పు తర్వాత నీలిమూక నోళ్లు కూడా మూతపడ్డాయి. అణచివేత హద్దులు మీరినప్పుడు ప్రతిఘటన తప్పదు. ఆంధ్రప్రదేశ్‌ అనేది ఒక స్వతంత్ర రాజ్యమని, తాను ఒక రాజునని భావిస్తున్న జగన్‌ రెడ్డికి ‘నీది ఒక రాష్ట్రం. నువ్వు ముఖ్యమంత్రి అయినా వ్యవస్థలో భాగం మాత్రమే’ అని న్యాయవ్యవస్థ పదే పదే గుర్తుచేస్తూ ఉండటం ఆయనకు చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. అయినా ‘నా ఓటర్లు వేరు– నా అధికారాన్ని ఎవరూ అడ్డుకోలేరు’ అన్నట్టుగా సాగుతూ వచ్చిన జగన్‌ రెడ్డికి ఇపుడు బెయిల్‌ రద్దు గండం పొంచి ఉంది. అసత్యాలను సత్యాలుగా నమ్మిస్తూ ఇంతకాలం ఎదురులేనట్టుగా సాగిన జగన్‌కు చెక్స్‌ అండ్‌ బేలన్స్‌ కోసం ఇతర వ్యవస్థలు కూడా ఉన్నాయని గుర్తుకువస్తున్నది ఇప్పుడు. ఎంతటి బలమైన నాయకుడికైనా పరిస్థితులు ఎప్పుడూ అనుకూలంగా ఉండవు. ప్రస్తుతానికి జగన్‌కు సహకరిస్తున్న ఢిల్లీ పెద్దలు అదను కోసం ఎదురుచూస్తున్నారు.


రెండేళ్ల అధికారం తర్వాత జగన్‌ రెడ్డికి ఇంటా బయటా శత్రువులు పెరిగిపోతున్నారు. ఇవాళ రఘురాజు వంతు. రేపు మరొకరి వంతు రావొచ్చు. ఇలాంటి సందర్భాలలోనే ప్రతిఘటన ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది. చట్టాలు, నిబంధనలతో నిమిత్తం లేకుండా పైనుంచి వచ్చే ఆదేశాలను శిరసావహిస్తూ కేసులు పెడుతున్న పోలీసు అధికారులపై ఎదురు కేసులు పెట్టడానికి ఏబీఎన్‌ మాత్రమే కాదు, ఇంకెందరో సమాయత్తమవుతున్నారు. సొంత పార్టీ నాయకులలో పలువురు ఇప్పటికే జగన్‌ రెడ్డి పోకడలను అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఎప్పుడైనా వికటించవచ్చు. గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా ఎదురుతిరుగుతుంది. రఘురాజును ఇప్పుడు హింసించామని ఆనందపడుతూ ఉండొచ్చు. రేపు మరొకరిని టార్గెట్‌ చేయవచ్చు. అయితే ఇవాళ కాకపోయినా రేపైనా అందరి లెక్కలూ సెటిలవుతాయి. జగన్‌ అండ్‌ కో ఇందుకు సిద్ధంగా ఉంటుందా! -  ఆర్కే.


జగన్‌కు అవినీతి కేసులో శిక్ష పడితే తమిళనాడు తరహా ప్రయోగాన్ని అమలు చేయాలన్న ఆలోచనతో కమలనాథులు ఉన్నారని చెబుతున్నారు. జగన్‌తో ఆయన సోదరి షర్మిల తీవ్రంగా విభేదించి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఢిల్లీ పెద్దలు ఆమెను చేరదీసే అవకాశం లేకపోలేదు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వస్తే భార్య భారతిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడతానని జగన్‌ రెడ్డి తన సన్నిహితులకు చెబుతున్నారు. అయితే కమలనాథుల ఆలోచన మరో రకంగా ఉందంటున్నారు. అన్నాడీఎంకేను శశికళ చేతుల్లోంచి తప్పించినట్టుగానే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని కూడా జగన్‌ రెడ్డి కోరుకుంటున్నట్టుగా కాకుండా షర్మిలకు అప్పగించడానికి వ్యూహరచన చేస్తున్నారని ఢిల్లీ వర్గాల భోగట్టా. ధిక్కారమును సైతునా అని భావించే జగన్‌ రెడ్డి నిజంగా అటువంటి పరిస్థితి ఏర్పడితే పార్టీని ఎలా కాపాడుకుంటారో వేచిచూడాలి. నియంతృత్వ పోకడలతో దారితప్పిన నాయకులను కట్టడి చేయడానికి సొంత ఇంట్లోనే కుంపట్లు వెలియడం అసాధారణం ఏమీ కాదు.

Updated Date - 2021-06-06T14:16:56+05:30 IST