నల్లమల కేంద్రంగా ఆర్కే ఉద్యమ ప్రస్థానం

ABN , First Publish Date - 2021-10-17T04:47:04+05:30 IST

ఉపాధ్యాయుడు నుంచి ఉద్యమనేతగా ఆర్‌కే ప్రస్థానం మొదలైంది.

నల్లమల కేంద్రంగా ఆర్కే ఉద్యమ ప్రస్థానం
నివాళి అర్పిస్తున్న శిరీషా, కళ్యాణరావు తదితరులు


మార్కాపురం, అక్టోబరు 16 : ఉపాధ్యాయుడు నుంచి ఉద్యమనేతగా ఆర్‌కే ప్రస్థానం మొదలైంది.   ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ఖండిస్తూ విప్లవ భావజాలం ఉన్న యువతను ఉద్యమంలోకి తీసుకురావడంలో, వారిని సుశిక్షితులైన సాయుధ యోధులుగా తీర్చిదిద్దడంలో రామకృష్ణ కృషి ఎనలేనిది. ఎటువంటి స్వలాభాన్ని ఆశించకుండా, బెదిరింపులకు లొంగిపోకుండా  నమ్ముకున్న ఉద్యమ సిద్ధాంతాలకు కట్టుబడి చిత్తశుద్ధితో పనిచేసి మరణించిన  మవోయిస్టు ఉద్యమనేత, విప్లవ భావజాలానికి స్ఫూర్తి అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే (రామకృష్ణ) ప్రజల నివాళులందుకున్నారు.  

ఆర్కే గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన గురజాల మండలం తుమురుకోటలో సచ్చిదానంద మూర్తి, రాజేశ్వరి దంపతులకు జన్మించారు. చదువు రీత్యా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఆర్కే తన తండ్రితోపాటు చదువుకునే రోజుల్లోనే విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. తర్వాతి కాలంలో విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితుడై పీపుల్స్‌వార్‌ మావోయిస్ట్‌ పార్టీలో సభ్యుడిగా చేరారు. మావోయిస్టు పార్టీలో చేరే యువతకు శిక్షణ ఇవ్వడం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలు, ఇతర కార్యక్రమాల రూపకల్పన బాధ్యత ఆర్కే తీసుకున్నారు.  గుంటూరు, ప్రకాశం, కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా ఎంచుకున్నారు. మావోయిస్టు పార్టీలో చేరినప్పటి నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తూ మావోయిస్టుల బలం పెంచడంలో ఆర్కే పాత్ర కీలకం. దీంతో ఆయన పార్టీలో కొద్దికాలంలోనే ఎదిగారు. దీంతో పెద్దలు ఆర్కేకు క్రీయాశీలక బాధ్యతలు అప్పగించారు. అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 2004 అక్టోబర్‌ 15న మావోయిస్టులతో హైదరాబాద్‌లో మూడు రోజులపాటు చర్చలు జరిపిన అనంతరం నల్లమలలో పోలీసుల క్యూంబింగ్‌ అధికమైంది. దీంతో పార్టీ అధిష్టానం ఆంధ్ర - ఒడిసా సరిహద్దు బాధ్యతలను ఆర్కేకు అప్పగించింది. నల్లమలలో ఆర్కే నేతృత్వంలో పలు ఘటనలు జరిగాయి.  

ఎర్రగొండపాలెం పోలీస్‌ స్టేషన్‌ను 2001 జూన్‌ 17న మావోయిస్టులు పేల్చివేశారు.

పుల్లలచెరువు ఏఎ్‌సఐ ప్రశాంతరావును 2001 జూలై 3న హత్య చేశారు.

దోర్నాలలో ఎంపీపీ కార్యాలయాన్ని 2002 జూలై 10 పేల్చారు.

పెద్దారవీడులో తహసీల్దార్‌ కార్యాలయాన్ని 2002 సెప్టెంబరులో పేల్చారు.

పెద్దారవీడు ఏఎ్‌సఐ ఆంజనేయులు, కమ్యునికేషన్‌ ఎస్‌ఐ సుబ్బారావు, ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డును 2003 ఏప్రిల్‌ 2న మండలంలోని కాటంరాజుతాండా వద్ద కిడ్నాప్‌ చేశారు.

కేంద్ర కమిటీ సభ్యుని హోదాలో దోర్నాల మండలం చిన్నారుట్ల వద్ద నుంచి ప్రభుత్వంతో చర్చల కోసం ఆర్కే బయటకు వచ్చారు. 

ఎర్రగొండపాలెం మండలం చుక్కలతాండా వద్ద 2006 జూలైలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్కే తప్పించుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో రాష్ట్ర కార్యదర్శి మాధవ్‌తోపాటు మరో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.

పుల్లలచెరువు మండలం నరజాముల తాండా వద్ద 2010 మార్చి 12న జరిగిన  ఎన్‌కౌంటర్‌లో కూడా ఆర్కే తప్పించుకున్నారు. ఈ ఘటనలో రాష్ట్ర కమిటీ సభ్యుడు శాఖమూరి అప్పారావు మృతి చెందాడు. 


ఆలకూరపాడులో ఆర్కేకు ఘన నివాళులు

ఆలకూరపాడు(టంగుటూరు), అక్టోబరు 16 : అనారోగ్యంతో మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామకృష్ణ అలియాస్‌ ఆర్కే చిత్రపటం వద్ద ఆయన భార్య శిరీష, తోడల్లుడు విరసం నేత జి.కళ్యాణరావు నివాళి అర్పించారు. మండలంలోని ఆలకూరపాడులో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఆర్కే ప్రజల గుండెల్లో ఉన్నాడని విరసం నేత, ఆలకూరపాడు వాసి కళ్యాణరావు చెప్పారు. ఉద్యమకారుల మరణంతో ప్రజా ఉద్యమాలు ఆగబోవన్నారు. అమరవీరుల బందు మిత్రుల కమిటీ రాష్ట్ర కార్యదర్శి భవాని, ప్రకాశం, గుంటూరు జిల్లాల కమిటీ సభ్యురాలు శోభలు మాట్లాడుతూ తీవ్ర నిర్భంధంలో సరైన వైద్యం అందకనే ఆర్కే మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవల్లి కృష్ణ, కార్యదర్శి రివేరా, విరసం నేత పినాకపాణి ఆలకూరపాడు చేరుకొని శిరీషను పరామర్శించారు.

Updated Date - 2021-10-17T04:47:04+05:30 IST