రైల్వేకు.. మొండిచెయి

ABN , First Publish Date - 2021-02-04T05:49:52+05:30 IST

కేంద్ర బడ్జెట్‌లో గుంటూరు రైల్వే డివిజన్‌కు సంబంధించిన ప్రాజెక్టులకు మొండిచెయి చూపించారు.

రైల్వేకు.. మొండిచెయి
గుంటూరు రైల్వే స్టేషన్‌

గుంటూరు డివిజన్‌ ప్రాజెక్టులకు గ్రహణం

మూడింటికి రూ.వెయ్యి చొప్పున కేటాయింపు

నిర్మాణ దశలో ఉన్న వాటికి అరకొర కేటాయింపులు

గుంటూరు - గుంతకల్లు డబ్లింగ్‌కు రూ.364 కోట్లు

నడికుడి-శ్రీకాళహస్తి మార్గానికి రాష్ట్ర ప్రభుత్వంపైనే భారం


గుంటూరు, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌లో గుంటూరు రైల్వే డివిజన్‌కు సంబంధించిన ప్రాజెక్టులకు మొండిచెయి చూపించారు. కొత్తగా ఒక్క ప్రాజెక్టు/సర్వేని కూడా మంజూరు చేయలేదు. నిర్మాణ దశలో ఉన్న వాటికి కూడా అరకొరగా కేటాయింపులు జరిపారు. బడ్జెట్‌లో రైల్వే కేటాయింపులకు సంబంధించిన పింక్‌బుక్‌ని బుధవారం రైల్వేబోర్డు విడుదల చేసింది. అందులో గుంటూరు డివిజన్‌కు జరిపిన కేటాయింపులు చూస్తే ఎవరికైనా అసంతృప్తి కలగకుండా ఉండదు. మంచి ఆదాయం ఉన్న గుంటూరు - పగిడిపల్లి వయా నడికుడి మార్గంలో డబ్లింగ్‌ ప్రాజెక్టుకి రూ. 2,480 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. అయితే ఈ ప్రాజెక్టుకి బడ్జెట్‌లో జరిపిన కేటాయింపు చూస్తే ఇప్పట్లో ఇది నిర్మాణం ప్రారంభం అయ్యేలా లేదు. కేవలం రూ.వెయ్యి కేటాయించారు.  అమరావతి రాజధాని నూతన రైలుమార్గం, నల్లపాడు - పగిడిపల్లి డబ్లింగ్‌, మాచర్ల - నల్గొండ మార్గానికి కేవలం రూ.వెయ్యి చొప్పున కేటాయించడాన్ని పరిగణనలోకి తీసుకొంటే అవి అటకెక్కించినట్లేనని స్పష్టమౌతోన్నది. బడ్జెట్‌లో ఒక్క గుంటూరు - గుంతకల్లు డబ్లింగ్‌ ప్రాజెక్టుని మాత్రమే ఈ ఏడాది ముందకు తీసుకెళ్లేలా నిధుల కేటాయింపు జరిపారు. ప్రధానమంత్రి ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఉన్న నడికుడి - శ్రీకాళహస్తి నూతన రైలు మార్గానికి డిపాజిట్‌ కింద రూ.1,144.35 కోట్లు చూపించారు. అయితే ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉండటంతో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొంటే ఈ ప్రాజెక్టు కూడా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోన్నది.   అమరావతి రాజధానికి ఎర్రుబాలెం నుంచి నంబూరు వరకు నూతన రైలుమార్గం ప్రాజెక్టుని గత ప్రభుత్వ హయాంలోనే మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి రూ.2,679 కోట్ల నిధుల అవసరం ఉండగా కేవలం రూ.వెయ్యి కేటాయించారు. దీనిని కూడా అటకెక్కించినట్లుగానే కనిపిస్తోన్నది. యూపీయే హయాంలో మంజూరైన మాచర్ల - నల్గొండ రైలు మార్గానికి కూడా కేవలం రూ.వెయ్యి బడ్జెట్‌ కేటాయించడం కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌పై ఎంత సవతి ప్రేమ ఉందో కళ్లకు కడుతోన్నది. గుంటూరు - గుంతకల్లు డబ్లింగ్‌ ప్రాజెక్టుకు మాత్రమే చెప్పుకోదగినట్లుగా రూ. 364 కోట్లు కేటాయించారు. కాగా ఆర్‌వోబీలు, ఆర్‌యూబీల విషయంలోనూ ఆశించినంతగా కేటాయింపులు చేయలేదు. బడ్జెట్‌లో జరిపిన కేటాయింపులు చూసి రైల్వే యూజర్స్‌ నివ్వెరపోతున్నారు. 

Updated Date - 2021-02-04T05:49:52+05:30 IST