ఓఆర్‌ఆర్‌పై నుంచి లారీ బోల్తా.. డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2020-05-31T17:40:51+05:30 IST

సిమెంట్‌ లోడ్‌తో వస్తున్న లారీ అదుపుతప్పి ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై నుంచి కిందపడడంతో డ్రైవర్‌ మృతి చెందాడు.

ఓఆర్‌ఆర్‌పై నుంచి లారీ బోల్తా.. డ్రైవర్‌ మృతి

హైదరాబాద్‌: సిమెంట్‌ లోడ్‌తో వస్తున్న లారీ అదుపుతప్పి ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై నుంచి కిందపడడంతో డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ సంఘటన మేడ్చల్‌జిల్లా శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సీఐ సంతోషం తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా, చందంపేట మండలం, కాట్రావత్‌ తండాకు చెందిన భాస్కర్‌(32) వారం క్రితం లారీ డ్రైవర్‌ పనికి కుదిరాడు. శుక్రవారం రాత్రి 9గంటలకు హజూరునగర్‌ మఠంపల్లి నుంచి నాగార్జున కంపెనీకి చెందిన సిమెంట్‌ లోడ్‌తో మేడ్చల్‌ వైపునకు బయల్దేరాడు. శనివారం ఉదయం సుమారు 5.30 గంటలకు లారీని అతివేగంగా నడవడంతో శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌ వద్దకు రాగానే ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఉన్న గ్యాప్‌లో నుంచి బారికేడ్లపైకి దూసుకొచ్చి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో సిమెంట్‌ సంచుల్లో కూరుకుపోయిన భాస్కర్‌ ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. లారీ నుజ్జునుజ్జయింది. సిమెంట్‌ బస్తాలు రాజీవ్‌ రహదారిపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ సమయంలో కింద వాహనాలూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎక్స్‌కవేటర్‌ సహాయంతో దెబ్బతిన్న లారీని పక్కకు తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2020-05-31T17:40:51+05:30 IST