మైకం మిగిల్చిన శోకం

ABN , First Publish Date - 2021-08-03T07:06:20+05:30 IST

గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌ పరిధిలో

మైకం మిగిల్చిన శోకం

మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ 

పల్టీలు కొట్టిన కారు, యువతి దుర్మరణం

ముగ్గురికి తీవ్ర గాయాలు

ఆస్పత్రిలో చికిత్స 


అప్ప‌టి వ‌ర‌కు పబ్బులో పార్టీ చేసుకున్నారు. డిన్నర్‌ చేశారు. అనంతరం కాలేజీ కబుర్లు చెప్పుకుంటూ కారులో తిరుగుతున్నారు. అధికమద్యం మత్తు, నిర్లక్ష్యం.. నలుగురు స్నేహితుల్లో ఒకరిని దూరం చేసింది. రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందింది. మిగతా ముగ్గురూ తీవ్రమైన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 


గచ్చిబౌలి, ఆగస్టు2 (ఆంధ్రజ్యోతి) :  గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం తాగి వాహనం నడపడం, అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల కథనం ప్రకారం.. మదీనగూడ మైహోం జువెల్స్‌లో నివాసం ఉంటున్న అభిషేక్‌, తెల్లాపూర్‌లో ఉంటున్న సత్యప్రకాశ్‌, అశ్రిత, తరుణిలు స్నేహితులు. వీరంతా శంకర్‌పల్లిలోని ఇక్వాయ్‌ వర్సిటీలో కలిసి చదువుకున్నారు. అభిషేక్‌ అదే కాలేజీలో చదువుతుండగా, తరుణి నాచారంలోని ఓ కంపెనీలో పని చేస్తోంది. సత్యప్రకాశ్‌ కూడా ఉద్యోగం చేస్తున్నాడు. ఆశ్రిత బీబీఏ పూర్తిచేసి కెనడాలో ఎంటెక్‌ చదువుతోంది. 


ఫ్రెండ్షిప్‌ డే సందర్భంగా..

ఇటీవలే నగరానికి వచ్చిన ఆమె ఆదివారం ఫ్రెండ్‌ షిప్‌డే కావడంతో అందరూ కలుసుకోవాలనుకున్నారు. మదీనగూడలో ఉంటున్న అభిషేక్‌ తన కారులో తెల్లాపూర్‌ వెళ్లి ఆశ్రత, తరుణి, సాయిప్రకాశ్‌లను పికప్‌ చేసుకున్నాడు. కొండాపూర్‌లోని స్నోట్‌ క్లబ్‌కు వచ్చారు. రాత్రి 10.30 వరకు అక్కడ పార్టీ చేసుకుని భోజనం చేశారు. రాత్రి 11 గంటల సమయంలో కారులో హైటెన్షన్‌ రోడ్డు నుంచి కొండాపూర్‌లోని మైహోం మంగళ ప్రాజెక్టు ముందు నుంచి మదీనగూడకు వస్తున్నారు. అభిషేక్‌ అధిక వేగంతో కారు నడుపుతుండగా, అదుపుతప్పి ఓ గోడను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. కారులోని ఎయిర్‌బ్యాగ్స్‌ ఓపెన్‌ కావడంతో ముందు కూర్చున్న అభిషేక్‌, సాయిప్రకాశ్‌కు గాయాలయ్యాయి. వెనుక సీటులో కూర్చున్న అశ్రిత (23), తరుణి కారు డోర్‌లు తెరుచుకోవడంతో  రోడ్డుపై పడ్డారు. వారికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి  తరలించగా అశ్రిత అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. తరుణి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కారు డ్రైవ్‌ చేస్తున్న అభిషేక్‌ మద్యం మత్తులో ఉండడం, అధిక వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆశ్రిత మృతితో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. 


Updated Date - 2021-08-03T07:06:20+05:30 IST