Abn logo
Apr 6 2021 @ 09:17AM

ఇంట్లో నిద్రించిన విద్యార్థి.. తెల్లారేసరికి రోడ్డుపై మృతదేహంగా.. అంతా షాక్

హైదరాబాద్/పంజాగుట్ట : అందరితో పాటు ఆ విద్యార్థి ఇంట్లో నిద్రించాడు. సోమవారం వేకువజామున తండ్రి లేచి చూడగా, కొడుకు కనిపించలేదు. ఇంట్లోని హోండా యాక్టివా బైక్‌ కూడా కనిపించలేదు. ఆందోళనతో వెతుకుతుండగా, ఉదయం పంజాగుట్ట పోలీసులు ఫోన్‌ చేసి వాహనంపై వెళ్తుండగా, గుర్తుతెలియని వాహనం ఢీ కొని చనిపోయినట్లు సమాచారం ఇచ్చారు. బోయినపల్లి పోలీసుల కథనం ప్రకారం.. బోయిన్‌పల్లి సిండికేట్‌ బ్యాంక్‌ కాలనీకి చెందిన నామజాన్‌ రంగయ్య కుమారుడు జశ్వంత్‌ (15) స్థానికంగా ప్రైవేట్‌ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఆదివారం అందరితో కలిసి నిద్రపోయాడు. ఉదయం రంగయ్య లేచి చూడగా, కుమారుడు కనిపించలేదు.

హోండా ఆక్టీవా వాహనం, స్కూల్‌ బ్యాగ్‌ కూడా కనిపించలేదు. వెతుకుతుండగానే, ఉదయం 6.30 గంటల ప్రాంతంలో పంజాగుట్ట పోలీసులు రంగయ్యకు ఫోన్‌ చేసి ‘‘మీ కుమారుడు ద్విచక్రవాహనంపై రాజ్‌భవన్‌రహదారిలో సోమాజిగూడ వైపు వెళ్తుండగా, రాజ్‌ భవన్‌ చిల్లా వద్ద గుర్తుతెలియని వాహనం ఢీ కొని మృతి చెందాడు’’ అని సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.  తమ కుమారుడు ద్విచ్రకవాహనం ఎందుకు తీసుకెళ్లాడు. ఎక్కడికి వెళ్లాడో తెలియదని, తమ కుమారుడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రంగయ్య పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.


Advertisement
Advertisement
Advertisement