మృత్యుఘోష ఆగేదెన్నడు?

ABN , First Publish Date - 2021-12-19T14:38:48+05:30 IST

అతివేగం, మద్యం మత్తు, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌.. ఈ మూడూ రోడ్డు ప్రమాదాలకు అసలు కారణాలు. వీటితో పాటు రోడ్డుపై నిర్లక్ష్యంగా వాహనాలు నిలపడం కూడా ప్రాణాలు తీస్తోంది. ముఖ్యంగా

మృత్యుఘోష ఆగేదెన్నడు?

రోడ్డు ప్రమాదాలకు కళ్లెం పడేదెలా

ప్రాణాలు పోతున్నా మార్పు రాదా

ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో ప్రమాదాలు 

తొమ్మిది మంది బలి

రక్తమోడుతున్న రహదారులు   

ఆర్టీఏఎమ్‌ సెల్‌ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు


అతివేగం ప్రమాదకరమని చెబుతున్నా.. తాగి వాహనాలు నడపొద్దని హెచ్చరిస్తున్నా.. కొందరి చెవికెక్కడం లేదు. మత్తులో మునిగి వాహనాలతో రోడ్లెక్కి ప్రమాదాలకు గురై తనువు చాలిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు నిత్యం జరుగుతున్నా కనువిప్పు కలగడం లేదు. ప్రాణాలు కోల్పోతున్నా మార్పు రావడం లేదు. తాజాగా గచ్చిబౌలిలో జరిగిన ఘోర ప్రమాదం వెనుక వాస్తవాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. మద్యం మత్తులో 200 కి.మీల వేగంతో వాహనం నడుపుతూ చెట్టును ఢీ కొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. కారు రెండు ముక్కలైందంటే ఎంతటి వేగమో అర్థం చేసుకోవచ్చు. బయలుదేరిన సమయం నుంచి కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది. 

     మరో ప్రమాదంలో నగరం నుంచి దైవ దర్శనానికి నాందేడ్‌ వెళ్లిన రెండు కుటుంబాల్లో ఆరుగురు మృతి చెందారు. కామారెడ్డి జిల్లా జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని క్వాలిస్‌ వాహనం అతివేగంగా ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరుగుతున్న తీరు, కారణాలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం..


‘మూడు’తోంది ఇలా..

హైదరాబాద్‌ సిటీ: అతివేగం, మద్యం మత్తు, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌.. ఈ మూడూ రోడ్డు ప్రమాదాలకు అసలు కారణాలు. వీటితో పాటు రోడ్డుపై నిర్లక్ష్యంగా వాహనాలు నిలపడం కూడా ప్రాణాలు తీస్తోంది. ముఖ్యంగా చలికాలంలో మంచుపడటం, రోడ్లపై లైటింగ్‌ సరిగా లేకపోవడంతో ఆగి ఉన్న వాహనాలను ఢీకొని మృత్యువాత పడుతున్నారు. జాతీయ రహదారులు, ఓఆర్‌ఆర్‌ సహా చాలా రోడ్లు రక్తమోడుతున్నాయి. వందలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వేలాది మంది మత్యువాత పడుతున్నారు. కొన్ని వేలమంది క్షతగాత్రులవుతున్నారు. 


నిర్లక్ష్యం

వాహనం ఏదైనా మరమ్మతులకు గురైనప్పుడు, లేదా ఇతర అవసరాల కోసం రోడ్డుపై వాహనాలు నిలపాల్సి వచ్చినప్పుడు చాలా మంది డ్రైవర్లు తగిన జాగ్రత్తలు పాటించడం లేదు. వెనుకాల వచ్చే వాహనాలు గుర్తించేలా ఎల్లో సిగ్నల్స్‌ వేయడం లేదు. రెడ్‌ రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయడంలేదు. కనీసం ఆగిన వాహనాన్ని గుర్తించేలా చెట్లకొమ్మలు కూడా ఏర్పాటు చేయడం లేదు. దాంతో వెనుకాల వచ్చే వాహనాలు వాటిని ఢీ కొంటున్నాయి. రహదారి భద్రతలో భాగంగా ఉన్నతాఽధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొందరి నిర్లక్ష్యం ప్రమాదాలను కట్టడి చేయలేక పోతున్నారు. 


9 నెలల్లో 650 మంది మృతి

ఒక్క సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆర్టీఏఏమ్‌ (రోడ్డు ట్రాఫిక్‌ యాక్సిడెంట్స్‌ మానిటరింగ్‌) సెల్‌ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది 9 నెలల్లో 3,300కు పైగా ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 650 మంది దుర్మరణం చెందారు. 3,350 మంది గాయాలపాలయ్యారు.


మేడ్చల్‌ టాప్‌

తొమ్మిది నెలల్లో 250 ప్రమాదాలతో మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌ టాప్‌లో ఉన్నట్లు ఆర్టీఏఎమ్‌ అధ్యయనంలో తేలింది. ఈ ప్రమాదాల్లో 55 మంది దుర్మరణం చెందారు. 203 ప్రమాదాలతో మాదాపూర్‌, నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లు రెండో స్థానంలో నిలిచాయి. 99 తీవ్రమైన ప్రమాదాలు జరిగి 46 మంది మృతులతో షాద్‌నగర్‌ టౌన్‌ మేడ్చల్‌ తర్వాత స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో శామీర్‌పేట (44 మంది మృతి), దుండిగల్‌ (42 మంది మృతి) నిలిచాయి.

Updated Date - 2021-12-19T14:38:48+05:30 IST