లారీ కింద పడి బేల్దారి మేస్త్రి మృతి

ABN , First Publish Date - 2021-12-03T05:07:39+05:30 IST

జాతీయరహదారిపై మండల పరిధిలోని రాజుపాలెం రెస్ట్‌ ఏరియా వద్ద చిలకలూరిపేట నుంచి ఒంగోలు వైపు వెళ్లే రోడ్డులో వెనక నుంచి లారీ ఢీకొనడంతో ద్విచక్రవాహనంపై ఉన్న బేల్దారి మేస్త్రి పీతా సుబ్బారావు(35) మృతి చెందాడు.

లారీ కింద పడి బేల్దారి మేస్త్రి మృతి
లారీ వెనుక చక్రాల కింద పడి మృతి చెందిన సుబ్బారావు

మార్టూరు, డిసెంబరు 2 : జాతీయరహదారిపై మండల పరిధిలోని రాజుపాలెం రెస్ట్‌ ఏరియా వద్ద చిలకలూరిపేట నుంచి ఒంగోలు వైపు వెళ్లే రోడ్డులో వెనక నుంచి లారీ ఢీకొనడంతో ద్విచక్రవాహనంపై ఉన్న బేల్దారి మేస్త్రి పీతా సుబ్బారావు(35) మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఇదే ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న షేక్‌ బేబీ అనే మహిళ క్షేమంగా బయటపడింది. ఎస్‌ఐ చౌడయ్య కథనం ప్రకారం... కొత్తపట్నం మండలం గుండమాల గ్రామానికి చెందిన సుబ్బారావు బేల్దారి మేస్త్రీగా పనిచేస్తుంటాడు. అతని దగ్గర ఒంగోలుకు చెందిన షేక్‌ బేబీ కూలీగా పనిచేస్తుంటుంది. వారిద్దరూ ద్విచక్రవాహనంపై చిలకలూరిపేట నుంచి ఒంగోలు వైపు వస్తుండగా ప్రమాద బారినపడ్డారు. ఈ ద్విచక్రవాహనం వెనక చిలకలూరిపేట వైపు నుంచి వస్తున్న లారీ రోడ్డు పక్కన ఉన్న రెస్ట్‌ ఏరియా లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ ముందు టైర్లు కింద మోటారుసైకిలు పడిపోగా, సుబ్బారావు వెనుకచక్రాల కింద పడిపోయాడు. అనంతరం కొద్ది నిమిషాలు అనంతరం అతను చనిపోయాడు. ప్రమాద సమయంలో బేబీ వాహనం పైనుంచి పక్కకు పడిపోవడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 108 వాహనం సంఘటనా స్థలానికి వచ్చే సరికి అతను చనిపోయాడు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - 2021-12-03T05:07:39+05:30 IST