ఇదేం దారి?

ABN , First Publish Date - 2021-10-24T05:46:33+05:30 IST

ఇదేం దారి?

ఇదేం దారి?

గోతులమయంగా ఇన్నర్‌ రింగ్‌రోడ్డు

చనమోలు ఫ్లై ఓవర్‌ నుంచి రామవరప్పాడు ఫ్లై ఓవర్‌ వరకూ..

అడుగడుగునా గోతులు, అడ్డదిడ్డంగా రోడ్డు

పట్టించుకునేవారు లేక నిత్యం ప్రమాదాలు

ఇటు నూజివీడు- విజయవాడ ప్రధాన రహదారి, అటు హైదరాబాద్‌ నుంచి రామవరప్పాడు మీదుగా (నగరంలోకి ప్రవేశించకుండా) విశాఖపట్నం జాతీయ రహదారిని కలిపే దగ్గరి దారి. నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ ఇన్నర్‌ రింగ్‌రోడ్డును పట్టించుకునే వారు కరువయ్యారు. హైదరాబాద్‌, విశాఖపట్నం జాతీయ రహదారులను కలిపే ఈ రోడ్డు నగరంలోని పాలఫ్యాక్టరీ వద్ద చనమోలు వెంకట్రావు వంతెన నుంచి జక్కంపూడి మీదుగా పైపులరోడ్డు, పాయకాపురం, అజిత్‌సింగ్‌నగర్‌, కండ్రిక, రామవరప్పాడు ఫ్లై ఓవర్‌ వరకూ నరకాన్ని తలపిస్తోంది. అడుగు తీసి అడుగు వేస్తే గోతులు, పైకి తేలిన కంకరతో వాహనచోదకులకు చుక్కలు చూపిస్తోంది. భారీ లారీలు, కార్లు, ఆటోలు ఎక్కువగా తిరిగే ఈ రహదారి నిత్యం ప్రమాదాలకు దారవుతోంది. ఈ ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో కొద్దిదూరం వరకూ పైపులరోడ్డు కలిసి ఉంటుంది. ఈ రెండూ కలిసి ఉన్న జంక్షన్‌ వద్ద నాలుగు వైపులా కల్వర్టులు ఏర్పాటు చేశారు. ఈ కల్వర్టులు ఏర్పాటుచేసిన దగ్గర రోడ్డు కుంగిపోయి వాహనదారులకు ఇబ్బందిగా మారుతోంది. అడుగు లోతులో గోతులు ఏర్పడినా కనీసం ప్యాచ్‌వర్క్‌కు దిక్కు లేకుండాపోయింది. ఇన్నర్‌తో అనుసంధానం కావటం వల్ల ఈ రోడ్డు బాధ్యత ఏఎంఆర్‌డీఏది. కానీ, కనీస మరమ్మతులు కూడా చేయట్లేదు. ఈ రోడ్డుపై ఆర్‌అండ్‌బీ దృష్టి సారించాలని, లేదంటే కార్పొరేషన్‌ అయినా పట్టించుకోవాలని వాహనచోదకులు కోరుతున్నారు.  - ఆంధ్రజ్యోతి, విజయవాడ











Updated Date - 2021-10-24T05:46:33+05:30 IST