పైపై ప్యాచ్‌లే..!

ABN , First Publish Date - 2021-06-24T06:24:53+05:30 IST

పైపై ప్యాచ్‌లే..!

పైపై ప్యాచ్‌లే..!
నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న ఓ రోడ్డు (ఫైల్‌)

జిల్లాలో ఆర్‌అండ్‌బీ పనులకు కిలోమీటర్‌ వ్యయం సగానికి తగ్గింపు

రూ.40వేలు కేటాయించాల్సిన చోట రూ.20వేలతో సరి 

విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో ఎక్కడచూసినా గతుకులు, గుంతల రోడ్లే.  కొత్త రోడ్లు వేయటం సంగతి దే వుడెరుగు? ఉన్న రోడ్లకు ప్యాచ్‌వర్క్‌లకూ దిక్కు లేకుండాపోతోంది. జిల్లాలో ఆర్‌అండ్‌బీ రోడ్ల ప్యాచ్‌వర్క్‌ల పనులకు ఈ ఏడాది ప్రభుత్వం భారీగా కోత పెట్టింది. ఏటా ప్యాచ్‌వర్క్‌లు జరగటం సహజం. రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించకపోయినా కనీసం ప్యాచ్‌వర్క్‌లకైనా నిధులు కేటాయిస్తుంటారు. రెండేళ్లుగా ప్రభుత్వం కొత్త రోడ్లకు నిధులు ఇవ్వకపోయినా, కనీసం ప్యాచ్‌వర్క్‌లకైనా డబ్బు ఇచ్చేది. ఈ ఏడాది మాత్రం ఆర్థిక ఇబ్బందుల కారణంగా సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో  కూడా భారీ కోత విధిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఆర్‌అండ్‌బీ ప్యాచ్‌వర్క్‌లకు కూడా కోత పెట్టింది. జిల్లాలో ప్యాచ్‌వర్క్‌లు తలపెట్టే పనులకు పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వకుండా తొక్కి పట్టింది. సగటున ప్రతి కిలోమీటర్‌కు రూ.40వేల చొప్పున నిధులు కేటాయించాల్సి ఉండగా, ఈసారి రూ.20వేలను మాత్రమే కేటాయించింది. 

ఆలోచనలో అధికారులు

జిల్లాలో విజయవాడ, మైలవరం, నూజివీడు ఆర్‌అండ్‌బీ సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 4,400 కిలోమీటర్ల మేర ప్యాచ్‌వర్క్‌లకు ఆర్‌అండ్‌బీ జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ లెక్కన జిల్లాలోని ప్యాచ్‌వర్క్‌లకు రూ.17.60 కోట్లను కేటాయించాల్సి ఉండగా, కేవలం రూ.8.8 కోట్లే కేటాయించింది. ప్రభుత్వం ఇంత తక్కువగా నిధులు కేటాయించడంతో ఏం చేయాలో ఆర్‌అండ్‌బీ అధికారులకు పాలు పోవట్లేదు. ప్యాచ్‌వర్క్‌లకు ప్రభుత్వం సగం మాత్రమే నిధులు కేటాయించటంతో కాంట్రాక్టర్లు ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం, భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్న కారణంతో ఇప్పుడు పనులు చేపట్టినా తర్వాత బిల్లుల కోసం ఎదురుచూడాల్సి రావటం ఇబ్బందికరంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆసక్తి చూపించటం లేదని తెలుస్తోంది. 

కోర్టు భవనాలకు రూ.4 కోట్ల బకాయిలు

విజయవాడలో కోర్టుల హై రైజ్‌ నిర్మాణానికి సంబంధించి ఇంకా రూ.4 కోట్ల మేర కాంట్రాక్టర్‌కు బకాయిలు ఉన్నాయి. ఇవి ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. దీంతో కాంట్రాక్టు సంస్థ వేగంగా పనులు చేపట్టలేకపోతోంది. ప్రస్తుతం చివరి అంతస్థు శ్లాబ్‌ పనులు జరుగుతున్నాయి. బకాయిలను  విడుదల చేస్తే ఈ పనులను మరింతగా ముందుగా తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి.


Updated Date - 2021-06-24T06:24:53+05:30 IST