రోడ్ల టెండర్లు రద్దు

ABN , First Publish Date - 2020-09-20T08:50:54+05:30 IST

న్యూ డెవల్‌పమెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) ఆర్థిక సహకారంతో చేపట్టే రహదారి పనుల టెండర్లను రద్దు చేస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ప్రకటించారు. 13 జిల్లాల్లోని 26 ప్యాకేజీలకు 25 బిడ్లు దాఖలయ్యాయని...

రోడ్ల టెండర్లు రద్దు

‘ఆంధ్రజ్యోతి’ కథనాలతో సంచలనం

సమర్థించుకోలేక సర్కారు సతమతం..

చివరికి టెండర్ల రద్దుకు నిర్ణయం

ముందుకే వెళదామన్నా... సీఎం వద్దన్నారు

కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేనిది నిజమే

వారితో మేమే మాట్లాడి కాన్ఫిడెన్స్‌ తెస్తాం

లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకుంటాం

ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు


అంతా పారదర్శకమే అన్నారు. ‘కానే కాదు’... అని వరుస కథనాలు రాసిన ‘ఆంధ్రజ్యోతి’పై కస్సుమన్నారు. నోటీసులు ఇస్తాం, కేసులు పెడతాం... అని హెచ్చరించారు. చివరికి... వందల కోట్ల విలువైన రోడ్ల టెండర్లను  దక్కించుకునేందుకు పన్నిన పథకాన్ని కాంట్రాక్టు సంస్థల పేర్లతో సహా ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక బయటపెట్టింది. దీంతో...  ష్‌ గప్‌చుప్‌!  ఎన్‌డీబీ రోడ్ల టెండర్లను రద్దు చేయక తప్పలేదు.


(అమరావతి - ఆంధ్ర జ్యోతి)

న్యూ డెవల్‌పమెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) ఆర్థిక సహకారంతో చేపట్టే రహదారి పనుల టెండర్లను రద్దు చేస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ప్రకటించారు.   13 జిల్లాల్లోని 26 ప్యాకేజీలకు 25 బిడ్లు దాఖలయ్యాయని... ఇది సహేతుకమే అయినప్పటికీ,  కాంట్రాక్టర్ల నుంచి ఆశించిన స్పందన రాలేదని ఆయన తెలిపారు. పెద్ద కాంట్రాక్టర్లు బిడ్లు వేయలేదని అన్నారు.  ఎన్‌డీబీ రోడ్ల పనులను కొందరు ప్రముఖులు మాత్రమే దక్కించుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ‘ఆంధ్రజ్యోతి’ అనేక కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. శుక్రవారం మీడియాతో మాట్లాడిన కృష్ణబాబు... ఈ కథనాలను ఖండించారు. లీగల్‌ నోటీసులు ఇస్తామన్నారు. అయితే... ఒక్కో ప్యాకేజీకి పథకం ప్రకారం రెండేసి బిడ్లు మాత్రమే దాఖలైన వైనంపై ఆ కాంట్రాక్టు సంస్థల పేర్లతో సహా ‘ఆంధ్రజ్యోతి’ శనివారం మరో సవివరమైన కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే కృష్ణబాబు మరోమారు మీడియా ముందుకు వచ్చారు. ‘నోటీసులు జారీ చేస్తాం’ అన్న నోటితోనే... ‘టెండర్లు రద్దు చేస్తున్నాం’ అని ప్రకటించారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగిందని కృష్ణబాబు చెప్పారు. ‘‘అయినా కొన్ని సందేహాలు, ఒక సెక్షన్‌  మీడియాలో వస్తున్న వార్తలు, కాంట్రాక్టర్ల నుంచి తగిన స్పందన రాకపోవడంతో టెండర్లను రద్దుచేసి తిరిగి నిర్వహించాలని సీఎం చెప్పారు.


ముందుకే వెళ్దామని, రివర్స్‌ బిడ్డింగ్‌ నిర్వహిద్దామని చెప్పినప్పటికీ...  ప్రభుత్వం పారదర్శకంగా ఉందని చెప్పడానికి రద్దుచేయాలని సీఎం ఆదేశించారు. ఎన్‌డీబీ ఆంక్షల మేరకు సెప్టెంబరు నాటికి టెండర్లు ముగియాలి. మరికొంత గడువు తీసుకొని టెండర్లు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మరో 45 రోజుల్లో టెండర్ల ప్రక్రియను పూర్తిచేస్తాం’’ అని కృష్ణబాబు తెలిపారు. అయితే, టెండర్‌ నిబంధనల విషయంలో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లు నేరుగా డాక్యుమెంట్లు  ఇవ్వాలనే విషయంలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ నిబంధన మార్చాలని  ఎన్‌డీబీకి లేఖరాస్తామని తెలిపారు. ‘‘ఈసారి టెండర్లలో కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున పాల్గొనేలా... వారిలో కాన్ఫిడెన్స్‌ తీసుకొస్తాం. కాంట్రాక్టర్లను సంప్రదిస్తాం. వారికున్న ఇబ్బందులు, సమస్యలు ఏమిటో తెలుసుకుంటాం. ఒక్కో ప్యాకేజీకి రెండు కంపెనీలే ఎందుకు బిడ్‌లు వేశాయి? పెద్ద కాంట్రాక్టు సంస్థలు ఎందుకు పాల్గొనలేదో, లోపం ఎక్కడుందో పరిశీలిస్తాం’’ అని కృష్ణబాబు వివరించారు. 


పొంతనలేని మాటలు... దాగుడు మూతలు

అడ్డగోలుగా సాగిన రోడ్డు టెండర్ల ప్రక్రియను సమర్థించుకోవడానికి కృష్ణబాబు ఆదినుంచీ రకరకాలుగా ప్రయత్నించారు. ఈ క్రమంలో అనేక పొంతనలేని, పసలేని వాదనలూ చేశారు. ‘‘ఇది అంతర్జాతీయ అంశం. టెండర్లలో భారత్‌తోపాటు మొత్తం బ్రిక్స్‌ దేశాల కాంట్రాక్టర్లు పాల్గొంటారు. బ్రిక్స్‌ దేశాలు టెండర్లలో పాల్గొంటే డాలర్‌, యూరో టర్మ్స్‌లో ఏపీకి బాగుంటుంది’’ అని చెప్పిన కృష్ణబాబు 24 గంటల్లోనే మాట మార్చారు. ‘‘బ్రిక్స్‌ దేశాల కాంట్రాక్టర్లు 100-200 కోట్ల రూపాయల వర్క్‌ల  టెండర్లలో ఎందుకు పాల్గొంటారు? ఇది అసాధ్యం! ఇంతకు ముందే ఇక్కడ వర్క్‌లు చేస్తున్న వారు పాల్గొనే అవ కాశం ఉంది తప్ప, కొత్తగా ఆయా దేశాల నుంచి ఇక్కడకు వచ్చి తక్కువ విలువైన వర్క్‌లు చేస్తారని మేం అనుకోలేదు’’ అని చెప్పారు.


‘హార్డ్‌’గా దాచిపెట్టారు

ప్రపంచబ్యాంకు టెండర్‌ డాక్యుమెంట్‌లోని నిబంధనల ప్రకారం ప్రైస్‌బిడ్లు తెరవక ముందే కాంట్రాక్టర్లు హార్డ్‌కాపీలను (పత్రాల కాగితాలను) ఆర్‌అండ్‌బీ ఆఫీసుల్లో అందజేయాలన్న నిబంధన ఉందని కృష్ణబాబు మొదటి నుంచీ చెబుతున్నారు. ఎన్‌డీబీ పనుల విషయంలో... పోటీలో ఉన్న కాంట్రాక్టర్లను ముందుగా గుర్తించి, వారిని నయానో భయానో తప్పించేందుకే  హార్డ్‌కాపీల నిబంధన పెట్టినట్లు ఆరోపణలున్నాయి.  అయితే, ఈఏపీ ప్రాజెక్టుల్లోనూ ‘ఎల్‌ 1’ ఖరారయ్యాకే హార్డ్‌కాపీలు ఇచ్చేలా బిడ్‌ సెక్యూరిటీ నిబంధనలను మారుస్తూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయాన్ని ఆయన బయటికి చెప్పనేలేదు. దీని గురించి ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా... ‘కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన మాట నిజమే’  అని అంగీకరించారు.  


ప్రతి అక్షరం వాస్తవం

శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రాగానే ఉన్నతస్థాయిలో చర్యలు మొదలయ్యాయి. పత్రికలో ప్రచురించిన  కంపెనీల జాబితాను తమ వద్ద ఉన్న రికార్డులతో సరిపోల్చుకున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ రాసింది నూటికి నూరుశాతం నిజమే అని నిర్ధారించుకున్నారు. ఒక్కో జిల్లాకు సెలక్టివ్‌గా రెండే కంపెనీలు బిడ్‌లు  దాఖలు చేసినప్పటికీ... ‘కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌’ అని చెప్పుకోవడం సరికాదనే అభిప్రాయానికి వచ్చారు. ‘‘దాఖలైన బిడ్‌లను పరిశీలిస్తే ఈ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగలేదన్న చర్చ జరుగుతుంది. దీనివల్ల ప్రతిష్ఠ దెబ్బతింటుంది. టెండర్లు రద్దు చేయడమే మంచిది’’  అనే నిర్ణయానికి వచ్చారు. ఇదే నిర్ణయాన్ని ప్రెస్‌మీట్‌ పెట్టి వెల్లడించాలని కృష్ణబాబును సర్కారు ఆదేశించింది.


వరుస కథనాలతో వణుకు

ఎన్‌డీబీ రోడ్డు పనుల టెండర్ల విషయంలో డీపీఆర్‌ల తయారీకి కన్సల్టెంట్ల ఎంపిక నుంచి టెండర్ల నిర్వహణ వరకు అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ పనులను జిల్లాల వారీగా విభజించి టెండర్లు పిలిచారు. ఏ జిల్లా టెండరు ఎవరికి దక్కాలో ముందుగానే నిర్ణయించి అందుకు అనుగుణంగా బిడ్‌లు వేసేలే వ్యూహం రచించారు. చిన్న, మధ్యస్థాయి కాంట్రాక్టర్లు వర్క్‌ల్లో పాల్గొనకుండా కొత్త కండీషన్లు పెట్టారు. దీనిపై... ‘పెద్దలకు మాత్రమే’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ఈనెల 7న ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిపై ఎన్‌డీబీ పనులు పర్యవేక్షించే సీఈ కస్సుమన్నారు. ఊహాజనిత అంశాలతో వార్త రాశారంటూ వివరణ పంపించారు. సీఈ లేవనెత్తిన అంశాల్లోని డొల్లతనాన్ని వివరిస్తూ... ‘ఇది పెద్దలకోసం కాదంటారా?’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ఈనెల 13న మరో వార్తను ప్రచురించింది. ఈసారి నేరుగా ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు రంగంలోకి దిగారు. తప్పుడు వార్తలు రాస్తే లీగల్‌ నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. తర్వాత రాయలసీమ జిల్లాల్లో నిర్వహించిన టెండర్లలో ఓ మంత్రి కుటుంబానికి చెందిన కంపెనీ, ఓ ప్రభుత్వ పెద్ద బంధువు, వైసీపీ ఎమ్మెల్యే కంపెనీలు బిడ్‌లు దాఖలు చేశాయి. దీనిపై ‘ఈ టెండర్లన్నీ ఆ ముగ్గురికేనా’ శీర్షికతో ఈనెల 14న ‘ఆంధ్రజ్యోతి’ మరో వార్తను ప్రచురించింది.


మంత్రి కుటుంబ కంపెనీ ఏ వర్క్‌కు బిడ్‌లు వేసిందో సవివరంగా తెలిపింది. అదే రోజు కోస్తా జిల్లాల్లో వర్క్‌లకు టెండర్లు నిర్వహించగా... రాయలసీమ సీనే రిపీట్‌ అయింది. అక్కడ కూడా ఎంపిక చేసిన కంపెనీలే బిడ్‌లు వేశాయంటూ ‘కోస్తాలోనూ సీమ సీనే’ శీర్షికన ఈనెల 15న వార్తను ప్రచురించింది. శుక్రవారం కృష్ణబాబు మరోమారు మీడియా ముందుకు వచ్చారు. ఈసారి ‘ఆంధ్రజ్యోతి’ పేరు చెప్పి మరీ నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. కానీ... టెక్నికల్‌ బిడ్ల ఖరారు తర్వాత, ప్రతి ప్యాకేజీకి రెండేసి కంపెనీలు మాత్రమే బరిలో ఉన్న విషయాన్ని వివరిస్తూ ‘రోడ్డుకు టెండర్‌’ శీర్షికన శనివారం ‘ఆంధ్రజ్యోతి’ మరో కథనాన్ని ప్రచురించింది. దీంతో... 24 గంటల్లోనే సీన్‌ మారిపోయింది. నోటీసులు ఇస్తామన్న వారే... టెండర్లు రద్దు చేస్తున్నామని ప్రకటించాల్సి వచ్చింది. ‘పారదర్శకం, నిష్పాక్షికత’ అంటూనే టెండర్లకు తగినంత పోటీ రాలేదని, పెద్ద కాంట్రాక్టర్లు రాలేదని అంగీకరించక తప్పలేదు.


Updated Date - 2020-09-20T08:50:54+05:30 IST