Abn logo
Jul 24 2021 @ 23:47PM

చిన్న నిర్లక్ష్యం.. భారీ మూల్యం

రోడ్డుపైకి చొచ్చుకువస్తున్న ముళ్ల కంప

మైలుజవాన్‌ వ్యవస్థకు మంగళం

రోడ్లు, వంతెనల నిర్వహణపై నిర్లక్ష్యం

గుంతలతో అధ్వానంగా మారిన రహదారులు 

లాభాపేక్షతో తూతూమంత్రంగా కాంట్రాక్టర్ల పనులు


చిన్న నిర్లక్ష్యం.. భారీ మూల్యం.. ప్రస్తుతం జిల్లాలో రోడ్లు, వంతెనల పరిస్థితికి ఇది అన్వయిస్తుంది. రూ.కోట్లు వెచ్చించి రోడ్లు, వంతెనలు నిర్మిస్తూ వాటి నిర్వహణను మాత్రం గాలికి వదిలేస్తున్నారు. చిన్నచిన్న గుంతలు ఏర్పడి వాటి మీదగానే భారీ వాహనాల రాకపోకలతో కొద్దికాలంల ోనే రోడ్లు అధ్వానంగా మారుతున్నాయి. పిచ్చి చెట్లు, మట్టి పేరుకుపోయి వంతెనలు దెబ్బతిం టున్నాయి. ఇలాంటి చిన్న పనులు చేసేందుకు.. వాటి నిర్వహణ చూసేందుకు గతంలో మైలుజవాన్‌ వ్యవస్థ ఉండేది. వారు తమకు కేటాయించిన ప్రాంతంలోని రోడ్లు, వంతెనల బాధ్యత తీసుకుని నిర్వహణతో పాటు చిన్నచిన్న మరమ్మతులు చేస్తుండేవారు. అయితే ప్రస్తుతం ఈ వ్యవస్థకు ప్రభుత్వం మంగళం పాడింది. దీంతో చిన్న పనులను కూడా కాంట్రాక్టర్లే చేయాల్సి రావడం.. దానికి ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించడం.. ఆ నిధులు విడుదలయ్యే సరికి పుణ్యకాలం కాస్తా పూర్తవడం.. ఆ తర్వాత కూడా కాంట్రాక్టర్లు లాభాపేక్షతో తూతూ మంత్రంగా పనులు చేస్తుండటంతో రోడ్లు, వంతెనలు శిథిలమవుతున్నాయి. ఒక్క జాతీయ రహదారులపై మినహా మెయింటెనెన్స్‌ పనులు ఎక్కడా జరగటంలేదు. చిన్న మొక్కేకదా అని అధికారులు చేస్తున్న నిర్లక్ష్యం రూ.వందల కోట్ల రహదారుల పాలిట శాపంగా మారుతున్నాయి.తెనాలి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఒక భవనాన్ని రూ.కోట్లు వెచ్చించి నిర్మించి దాని సంరక్షణ చూడకుండా వదిలేస్తే ఏమవుతుంది? కొత్తదే అయినా తక్కువ సమయంలోనే శిఽథిలమైపోతుంది. ఇప్పుడు జిల్లాలోని రోడ్ల పరిస్థితీ ఇలానే ఉంది. ఓ మోస్తరు వర్షాలకే చెరువుల్లా మారుతున్న రోడ్లు.. పేరుకుపోయిన మట్టి, చెత్తపై మొలకెత్తే పిచ్చి మొక్కలతో వంతెనలు, ఓవర్‌ బ్రిడ్జిలు రోజురోజుకు అధ్వానంగా మారుతున్నాయి. జిల్లాలో 1258 కి.మీటర్ల పొడవున రాష్ట్ర హైవే రోడ్లు ఉండగా, మిగిలిన అంతర్గత, పంచాయతీరాజ్‌ రోడ్లన్నీ కలిపి మరో 13వేల కి.మీటర్లపైనే ఉన్నాయి. ఇప్పుడు వీటి మన్నికే ప్రశ్నార్థకమవుతోంది. అసలే నిధులు లేవు. కొత్తగా రోడ్లు నిర్మిద్దామన్నా, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ణా ఉన్నవాటిని జాగ్రత్త పరుచుకోవటం ఒక్కటే కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టటంలేదు. రెండేళ్లుగా రోడ్ల మరమ్మతులు మరిచారు. దీంతో అడపాదడపా కురుస్తున్న వర్షాలకు రోడ్లు అధ్వానంగా మారాయి. ఇక వంతెనల పరిస్థితి అయితే చెప్పాల్సిన పని లేదు. ప్రమాదకరంగా మారాయి. చిన్నచిన్న మరమ్మతులను ఎప్పటికప్పుడు చేయకపోవడంతో రూ.కోట్లతో నిర్మించిన రోడ్లు పదికాలాలపాటు ఉండకుండానే పాడైపోతుంటే, దశాబ్దాల కాలం ఉండాల్సిన వంతెనలు గడువులోపే పగుళ్లిచ్చి శిఽథిలావస్థకు చేరుతున్నాయి. మైలు జవాన్‌ వ్యవస్థ ఉన్న రోజుల్లో ఇటువంటి చిన్నచిన్న పనులు వారు చక్కబెట్టేవారు. కానీ క్రమంగా వారంతా ఉద్యోగ విరమణ చేశాక తిరిగి నియామకాలు లేకుండా చేశారు. దీంతో గతంలో వీరు చేసిన పనులన్నీ ఇప్పుడు కాంట్రాక్టర్లకే వదిలేస్తున్నారు. దీంతో అనుకున్న లక్ష్యం నెరవేరకపోగా, ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. డబ్బు పోయినా పని జరుగుతుందా అంటే అదీలేదు. గత వర్షాకాలంలో ప్రధాన రహదారుల వెంట మొలిచిన కంపను తొలగించడానికి జిల్లాలో రూ.77 కోట్ల పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. వారు అవి పూర్తిగా ఎండిపోయాక పైపైన చేశామనిపించారు. ప్రస్తుతం వర్షాలతో రోడ్ల అంచుల్లో పిచ్చి మొక్కలు, ముళ్ల కంపతో కమ్ముకుపోయి ఉన్నాయి. వీటిని తొలగించాల్సిన తరుణం ఇదే అయినా పనులు మాత్రం మొదలేపెట్టలేదు. ప్రస్తుతం ఇసుక లారీలు పరిమితికి మించి తిరుగుతుండటంతో రోడ్లు అంచులు గుంతలుపడి వర్షపు నీటితో తటాకాల్లా మారాయి. ఈ నిల్వ నీటి వల్ల రోడ్లు దెబ్బతినిపోతున్నాయి. రోడ్లకు ఇరువైపులా కాల్వలు ఉన్నా, గుంతల్లోని నీటిని కాల్వల్లోకి పోయేలా దారులు చేసేవారు లేరు. వీటిని మొదట్లోనే గుర్తించి తొలగిస్తే వీటివల్ల కలిగే నష్టం ఉండదు. అయితే ఆ పనిని అధికారులు విస్మరిస్తున్నారు. దీంతో భారీ నష్టం ఏర్పడుతోంది.   


కూలడానికి సిద్ధంగా ఉన్నా...

జిల్లాలో 9,600 వరకు ఉన్న చిన్న, పెద్ద తరహా వంతెనలకు ఇప్పుడు గడ్డుకాలం ఏర్పడింది. శిథిలమైన వంతెనలు నిర్మించడానికి నిధులులేక కూలిన వరకు అడ్డుగోడలు కట్టి ఉపయోగిస్తున్నారు. తెనాలి-గుంటూరు రోడ్డులో అంగలకుదురు దగ్గర పంటకాలువపై ఉన్న వంతెన ఒకవైపు కూలడానికి సిద్ధంగా ఉంది. ప్రమాదకరంగా మారితే, దానికి మధ్యలో ఏడేళ్ల క్రితం గోడకట్టి వినియోగిస్తున్నారు. కొల్లూరు నుంచి లంక గ్రామాలకు వెళ్లే రహదారికి కృష్ణాపశ్చిమ బ్యాంక్‌ కెనాల్‌పై బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన వంతెన ఓ పక్క కూలిపోతే, దశాబ్దకాలం క్రితం అంతవరకు గోడకట్టి మిగిలిన దానినే ఉపయోగిస్తున్నారు. కొల్లిపర దగ్గర కెనాల్‌పై వంతెన పరిస్థితీ ఇదేవిధంగా ఉంది. అమృతలూరు మండలంలో 100 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన కూలడానికి సిద్ధంగా ఉంటే, దానినే ఇంకా ఉపయోగిస్తున్నారు. ఇదే తరహాలో రేపల్లె, కర్లపాలెం, బాపట్ల, కాకుమాను వంటి మండలాలు, నరసరావుపేట, గుంటూరు డివిజన్లలో చాలాచోట్ల వంతెనలు దెబ్బతిని ఉన్నాయి. వీటిని సరిచేయటం కానీ, కొత్తవి నిర్మించటం కానీ చేయడంలేదు. 


నందివెలుగు-గుంటూరు రైలు ఓవర్‌ బ్రిడ్జిపై పడిన చెత్త, మట్టి

మొక్కేకదా అని వదిలేస్తే...

శిఽథిలస్థితిలో ఉన్న వంతెనల పరిస్థితి అటుంచితే, ఈ నాలుగైదేళ్లలో నిర్మించిన వంతెనలు, ఓవర్‌ బ్రిడ్జిలు కూడా శిథిలస్థితికి చేరుతున్నాయి. మన్నిక లేకపోవడం, నాశిరకం నిర్మాణాలకంటే కేవలం చిన్నపాటి నిర్లక్ష్యంతో ఆయా వంతెనలు దెబ్బతినిపోతున్నాయి. తెనాలి-గుంటూరు మధ్య ఎనిమిదేళ్ల క్రితం నిర్మించిన కొలకలూరు ఓవర్‌ బ్రిడ్జిపై వాహనాల రద్దీ ఎక్కువే ఉంటుంది. మొక్కలు మొలిచి, క్రమంగా అవి పెద్దవై, మానులుగా మారిపోతున్నాయి. దీంతో వంతెన ఫుట్‌పాత్‌పై పెరుకుపోయిన ఇసుక, మట్టిని ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో నిర్మాణాలు దెబ్బతింటున్నాయి. మొక్కలు, మట్టి తదితరాల తొలగింపులను గతంలో మైలు జవాన్లు చేసేవారు. కానీ ఇప్పుడు వారు లేకపోవటంతో పట్టించుకునేవారులేరు.   పోనీ కాంట్రాక్టర్‌లకు అప్పగిస్తారా అంటే వారికి అవి చాలా చిన్న పనులకింద లెక్క. గ్రామ పంచాయతీ ఆ ఊసే ఎత్తదు. దీంతో వంతెన శ్లాబ్‌ను వీటి వేర్లు బద్ధలుగా పగలగొట్టేస్తున్నాయి. ఫుట్‌పాత్‌ రాళ్లు పగిలి పనికిరాకుండా పోయాయి. ఇప్పటికే నిర్మించిన రోడ్డు ఇరువైపులా గోడలపై మర్రి, ఇతర వృక్ష జాతుల చెట్లు మొలిచాయి. వీటిని గతంలో ప్రజాప్రతినిధులు తొలగించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించినా తూతూమంత్రం పనులు మినహా వాటిని పట్టించుకునే నాథుడేలేడు. వంతెనల ఫుట్‌పాత్‌లపై మట్టి పేరుకుపోయి మొక్కలు మొలుస్తున్నా పట్టించుకోకుండా వదిలేశారు. చూడడానికి ఇవి చిన్నపనులుగానే కనిపించినా, చేసే నష్టం చాలా పెద్దదే. చిన్నపాటి నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకుంటున్న పరిస్థితులపై ఆర్‌అండ్‌బీ అధికారులను వివరణ కోరితే త్వరలో టెండర్లు పిలుస్తామని, వాటిని తొలగించి, దెబ్బతిన్న రోడ్లను సరిచేస్తామని చెప్పారు.