‘రోడ్లు, భవనాలూ’ తాకట్టులోకే..

ABN , First Publish Date - 2021-10-13T06:05:16+05:30 IST

జిల్లాలో రహదారులు, భవనాల శాఖ ఆధీనంలో ఉన్న ఆస్తులను ఏపీఆర్‌డీసీ (ఆంధ్రప్రదేశ్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)కి బదలాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

‘రోడ్లు, భవనాలూ’ తాకట్టులోకే..
ఒంగోలులోని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కార్యాలయం

జిల్లాలోని ఆర్‌అండ్‌బీ ఆస్తులు ఏపీఆర్‌డీసీకి మళ్లింపు

అందులో రూ.66.03 కోట్ల  విలువైన 27.84 ఎకరాల భూమి

రూ.22.36 కోట్ల విలువైన  10,248 చదరపు గజాల్లో నిర్మాణాలు కూడా

ఒంగోలు (జడ్పీ), అక్టోబరు 12 : జిల్లాలో రహదారులు, భవనాల శాఖ ఆధీనంలో ఉన్న ఆస్తులను ఏపీఆర్‌డీసీ (ఆంధ్రప్రదేశ్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)కి బదలాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కార్పొరేషన్‌ ద్వారా నిఽధులను సమీకరించుకుని రహదారులను అభివృద్ధి చేసుకునేందుకు వాడుకోవచ్చని గెజిట్‌లో పేర్కొంది. జిల్లావ్యాప్తంగా రూ.88.39 కోట్ల విలువ చేసే ఆస్తులు ఇకపై ఏపీఆర్‌డీసీ పరం కానున్నాయి. జాబితాలో ఇంజనీర్ల కార్యాలయాలు, క్వార్టర్లతోపాటు ఆర్‌అండ్‌బీకి చెందిన పొలాలు కూడా ఉన్నాయి. అవన్నీ తాకట్టు పెట్టే అవకాశం కూడా ఏర్పడింది. 


నిర్మాణాలూ కార్పొరేషన్‌ పరిధిలోకే...

జిల్లావ్యాప్తంగా ఉన్న 27.84 ఎకరాల ఆర్‌అండ్‌బీ భూములతోపాటు, 10,248 చదరపుగజాలలో ఉన్న భవనాలు కార్పొరేషన్‌ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూముల విలువ రూ.66.03 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేయగా, నిర్మాణాల విలువను రూ.22.36 కోట్లుగా లెక్కకట్టింది.


ఆర్‌అండ్‌బీలో పనులు నిల్‌...

ఆర్‌అండ్‌బీ పరిధిలోని రోడ్లు కనీస మరమ్మతులకు కూడా నోచుకోలేదు. రెండేళ్ల వ్యవధిలో ఒక్కటంటే ఒక్క రోడ్డుకు కూడా మరమ్మతులు చేపట్టలేదు. నిధుల లభ్యత ప్రధాన అడ్డంకిగా మారింది. కార్పొరేషన్‌ రూపేణా నిధులు వచ్చే అవకాశం ఉన్నందున మరమ్మతులతోపాటు రహదారుల అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలని జిల్లావాసులు కోరుకుంటున్నారు.





Updated Date - 2021-10-13T06:05:16+05:30 IST