రహదారులు అధ్వానం!

ABN , First Publish Date - 2021-10-18T03:04:06+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన రహదారులతో పాటు, అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో లింకురోడ్లు దుస్థితికి చేరాయి

రహదారులు అధ్వానం!
దుస్థితిలో కాకొల్లువారిపల్లి రహదారి

పల్లె ప్రయాణం నరకం 

ప్రజలకు తప్పని ఇక్కట్లు

పట్టించుకొనే నాఽథులు కరువు

వరికుంటపాడు, అక్టోబరు 17: గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన రహదారులతో పాటు, అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో లింకురోడ్లు దుస్థితికి చేరాయి. పలు కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నోచుకోక బురదమయంగా ఉన్నాయి. నెల్లూరు-ప్రకాశం జిల్లాల సరిహద్దులో మారుమూల ప్రాంతమైన వరికుంటపాడు మండలంలోని పలు గ్రామాలతో పాటు కాలనీల్లోనూ సిమెంట్‌ రోడ్లు మచ్చుకైనా కనిపించడం లేదు. గ్రామంలోని అంతర్గత రహదారుల సంగతి అటుంచితే కనీసం ప్రధాన రహదారుల నుంచి గ్రామాలకు చేరుకొనే లింకు రోడ్లు మరింత అధ్వానంగా మారి ఏళ్ల తరబడి వెక్కిరిస్తున్నాయి. మోకాటి లోతు గుంతలు ఉన్న రహదారులపై పగలు కూడా ప్రయాణం చేయాలంటే దుర్భరమే. నరకానికి రాచమార్గంగా ఉన్న రహదారుల గురించి పట్టించుకునే నాథులే కరువయ్యారు. దీంతో ప్రజలు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలోని కొండ్రాజుపల్లి, సాతువారిపల్లి గ్రామాలకు వెళ్లాలంటే ప్రధాన రహదారి నుంచి కిలో మీటర్ల కొద్ది ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అడుగడుగున ఏర్పడిన గుంతల్లో వెళ్లే వాహనాలతో కాలినడకన వెళుతున్న ప్రజలు దుమ్మూ, ధూళితో నిండిపోోతున్నారు. అలాగే నల్లబోతులవారిపల్లి, కాకొల్లువారిపల్లి, హుస్సేన్‌నగర్‌, నార్త్‌కృష్ణంరాజుపల్లి, అశోక్‌నగర్‌ తదితర గ్రామాల ప్రజలకు కూడా ఇలాంటి తిప్పలు తప్పడం లేదు. 

అత్యవసరంలోనూ అంతే : అత్యవసర పరిస్థితుల్లోను 108 వాహనాలు సైతం అటువైపు తొంగిచూడడమే లేదు. దీంతో ప్రధాన రహదారి వరకు ఎలాగోలా నానా తంటాలు పడాల్సిన దుస్థితి నెలకొంది. కనీసం 104 వాహనాలు కూడా అటుగా వెళ్లేందుకు సాహసించడం లేదు. దీంతో ప్రజల బాధలను ఆసరాగా చేసుకున్న ఆటోలు, తదితరల వాహనదారులు అధిక నగదు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ చేసేదేమిలేక తప్పనిసరి పరిస్థితుల్లో అడిగినంత ఇవ్వక తప్పడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

హామీలతోనే సరి : గ్రామాల రహదారులు అటు రాజకీయ నాయకులు, ఇటు అధికారులకు హామీల మంత్రంగా మారుతున్నాయి. ఎన్నికల సమయాల్లో తొలి హామీగా అలాంటి రహదారులే నిలుస్తున్నాయి. హమీలతో గద్దెనెక్కిన పాలకులు సైతం అనతికాలంలోనే వాటిని మర్చిపోతుండడం గమనార్హం. వీరికితోడు తామేమి తక్కువ కాదన్నట్లు అధికారులు సైతం సభలు, సమావేశాల సమయాల్లో అందిన వినతులను పట్టించుకున్న దాఖలాలే కనిపించడం లేదు. దీంతో తమగోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో తమ గోడు పట్టించుకొనే నాథుడే కరువయ్యారంటూ అసహనంతో మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి మారుమూల పల్లెలకు ప్రధాన సమస్యగా నిలిచిన రహదాలను నిర్మించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.



Updated Date - 2021-10-18T03:04:06+05:30 IST