మన్యంలో రోడ్లకు రూ.701 కోట్లు అవసరం

ABN , First Publish Date - 2021-10-27T06:31:10+05:30 IST

మన్యంలో గిరిజన పల్లెలకు రహదారులు నిర్మించేందుకు రూ.701 కోట్లు అవసరమవుతాయని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ అన్నారు.

మన్యంలో రోడ్లకు రూ.701 కోట్లు అవసరం
కార్యక్రమంలో మాట్లాడుతున్న పీవో గోపాలక్రిష్ణ

ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ 

 పాడేరు, అక్టోబరు 26: మన్యంలో గిరిజన పల్లెలకు రహదారులు నిర్మించేందుకు రూ.701 కోట్లు అవసరమవుతాయని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ అన్నారు. ఉపాధి హామీ పథకంలో 2022-23 ఆర్థిక సంవత్సరం పనుల లేబర్‌ బడ్జెట్‌  ప్రణాళికలపై మంగళవారం స్థానిక కాఫీ హౌస్‌లో నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలో ఉపాధి హామీ పఽథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, పల్లెల అభివృద్ధికి ఉపాధి హామీ పఽథకం ఓ వరమన్నారు. ఉపాధి హామీ పనులు సక్రమంగా అమలు చేస్తే గ్రామాల్లోని అనేక సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. అలాగే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, బల్క్‌మిల్క్‌ యూనిట్‌లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రహారీ గోడలు, రహదారుల నిర్మాణాలు ఉపాధి హామీ పథకంలో మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద చేపడుతున్నామని పీవో గోపాలక్రిష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ సందీప్‌, ఏజెన్సీలో ఉపాధి హామీ ఏపీవోలు, ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌లు, టెక్నికల్‌ అసిస్టెంట్‌లు, తదితరులు పాల్గొన్నారు. 

మౌలిక సౌకర్యాలు లేని పల్లెలు 1,997  

మన్యంలో 244 గ్రామ పంచాయతీల పరిధిలోని 1,997 పల్లెల్లో కనీస సౌకర్యాలు లేవని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ అన్నారు. ఏజెన్సీలోని పల్లెల్లో పరిస్థితులపై నిర్వహించిన విలేజ్‌ ప్రొఫైల్‌పై వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయా గ్రామాల్లో రోడ్లు, విద్యుత్‌, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. దశల వారీగా గిరిజన పల్లెలకు రోడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కనీస సదుపాయాలు లేని 1,997 పల్లెల్లో 195 పల్లెల్లో పర్యటించానని, ఆయా పల్లెల్లో పలు రకాల అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. అసంపూర్తిగా ఉన్న భవనాల వివరాలను అధికారులు సేకరించి, నివేదిక రూపొందించాలన్నారు.

 ఏజెన్సీలోని అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వీఎస్‌.ప్రభాకరరావు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈలు కేవీఎస్‌ఎన్‌.కుమార్‌, ఎస్‌.శ్రీనివాస్‌, పంచాయతీరాజ్‌ శాఖ ఈఈ కె.శ్రీనివాస్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ జవహర్‌, వివిధ శాఖల డీఈఈలు, ఏఈఈలు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-27T06:31:10+05:30 IST