పునరావాస కేంద్రంలో రోడ్లు బాగుచేయాలి

ABN , First Publish Date - 2022-07-13T05:25:42+05:30 IST

రాజోలి పునరావాస కేంద్రంలో అస్తవ్యస్తంగా మారిన రహదారులను బాగుచేయాలని కోరుతూ మంగళవారం స్థానికులు రాస్తారోకో చేపట్టారు.

పునరావాస కేంద్రంలో రోడ్లు బాగుచేయాలి
రాస్తారోకో చేస్తున్న గ్రామస్థులు

- రాజోలిలో గ్రామస్థుల రాస్తారోకో 

- ఎంపీడీవో హామీతో ఆందోళన విరమణ

రాజోలి, జులై 12 : రాజోలి పునరావాస కేంద్రంలో అస్తవ్యస్తంగా మారిన రహదారులను బాగుచేయాలని కోరుతూ మంగళవారం స్థానికులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2009లో వచ్చిన వరదల అనంతరం ఏర్పాటు చేసిన పునర వాస కేంద్రంలో రహదారులు వర్షాకాలంలో బురద మయంగా మారుతున్నాయని తెలిపారు. ఇటీవల రోడ్లపై నాణ్యత లేని ఒండ్రు మట్టి వేయించడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 12 సంవత్సరాలుగా తమ సమస్యలను అధికా రులకు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉదయం తొమ్మిది నుంచి దాదాపు రెండు గంటల పాటు రహదారిని దిగ్బంధించారు. వారికి ప్రజాసంఘాల నాయకులు, గ్రామ పెద్దలు మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో గోవింద్‌రావు, తహసీల్దార్‌ గ్రేసీబాయి అక్కడికి చేరుకుని, వారి సమస్యలను తెలుసుకున్నారు. పునరావాస కాలనీల్లో పర్యటించి, సమస్యలను పరిశీలించారు. కొత్త రాజోలిలో ముందుగా డ్రైనేజీ ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. ఆ తర్వాత రహదారులపై నాణ్యమైన మొరం వేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై పీఆర్‌ఏఈ నరేశ్‌తో ఫోన్లో మాట్లాడారు. మూడు రోజుల్లో ఎస్టిమేషన్‌ ఇవ్వాలని సూచించారు. దీంతో వారు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీరామ్‌రెడ్డి, సంజీవరెడ్డి, బషీర్‌మియ్య, చేనేత కార్మికులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-13T05:25:42+05:30 IST