రోడ్లు ధ్వంసం..ఒళ్లు హూనం

ABN , First Publish Date - 2020-10-22T07:40:11+05:30 IST

చినుకుకే ఛిద్రమయ్యే ఘనత మన రహదారులది! గత 20 రోజులుగా రోజూ కురుస్తున్న వర్షాల దెబ్బకు మరింత దారుణంగా

రోడ్లు ధ్వంసం..ఒళ్లు హూనం

రాజధానిలో 523 కి.మీ. మేర పాడైన రోడ్లు

పునరుద్ధరణ చర్యలు చేపట్టని జీహెచ్‌ఎంసీ

రాష్ట్రవ్యాప్తంగా 4వేల కిలోమీటర్ల మేర ధ్వంసం

భారీవర్షాలతో గుంతలమయం.. రూ. కోట్ల నష్టం

దెబ్బతిన్న రోడ్లపై ప్రయాణంతో వెన్నెముక సమస్యలు


హైదరాబాద్‌/ హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): చినుకుకే ఛిద్రమయ్యే ఘనత మన రహదారులది! గత 20 రోజులుగా రోజూ కురుస్తున్న వర్షాల దెబ్బకు మరింత దారుణంగా దెబ్బతిన్నాయి. స్థానిక రహదారులే కాదు.. రాష్ట్ర, జాతీయ రహదారులూ భారీగా ధ్వంసమయ్యాయి.. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా దాదాపు 4 వేల కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. రాష్ట్ర రహదారులకు సంబంధించి రూ.210 కోట్ల మేర రహదారులకు నష్టం వాటిల్లినట్లు రోడ్లు, భవనాల శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ముఖ్యంగా.. రాజధాని నగరంలో అన్ని ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల అయితే.. అడుగు లోతు గుంతలు ఏర్పడ్డాయి.


అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం.. నగరంలో 146 కిలోమీటర్ల మేర బీటీ, 376 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు పాడయ్యాయి. వాటి మరమ్మతు, పునరుద్ధరణకు రూ.522 కోట్లు ఖర్చవుతుందని అంచనా. విపత్తులు సంభవించినప్పుడు ఇవన్నీ సాధారణమేనని అధికార యంత్రాంగం చెబుతోంది. కానీ, విపత్కర పరిస్థితుల్లో పునరుద్ధరణ పనులూ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్న విషయాన్ని ప్రభుత్వం విస్మరించిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


రోడ్లు ఇలాగే ఉంటే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని ఆందోళన వెలిబుచ్చుతున్నారు. రోజుల తరబడి నీరు నిలవడంతో చాలా రోడ్లు కోతకు గురయ్యాయి. కొన్ని చోట్ల దాదాపు పావు కిలోమీటరు విస్తీర్ణంలో అడుగడుగునా గుంతలు పడి, ఇసుక మేట వేయడంతో వాహనాలు తీవ్రంగా కుదుపులకు లోనవుతున్నాయి. ఆ గుంతల్లో ప్రయాణంతో వెన్నెముక దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.



జిల్లాల్లో పరిస్థితి..

జిల్లాల విషయానికి వస్తే.. జుక్కల్‌, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో రహదారులు ఎక్కువగా ధ్వంసమయ్యాయి. జుక్కల్‌ మండలం హంగర్గ గ్రామం వద్ద వరద ఉధృతికి బీటీ రోడ్డు కొట్టుకుపోవడంతో జుక్కల్‌, మహారాష్ట్రకు రాకపోకలు నిలిచి పోయాయి. బిచ్కుంద-రాజుల రెండు గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి వద్ద రోడ్డు తెగిపోయింది. మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లాలో రహదారులకు పెద్దఎత్తున గండ్లుపడ్డాయి. వర్షపు నీరు కారణంగా జనగామ-సూర్యాపేట రహదారిపై నెల్లుట్ల వద్ద జాతీయ రహదారి ఈ నెల 14న కోతకు గురైంది. వరద నీరు ఇంకా తగ్గకపోవడంతో పునరుద్థరణ పనులు నిలిచిపోయాయి. చిల్పూరు మండలం పల్లగుట్ట-కొత్తపల్లి మధ్య రోడ్డు తెగిపోవడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిపోయాయి. 


జనగామ జిల్లా కేంద్రంలో కిలోమీటరు మేర రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. పెంబర్తి నుంచి జనగామ మీదుగా యశ్వంతాపూర్‌ వరకు 10 కిలోమీటర్ల మేర రహదారి పూర్తిగా ధ్వంసమైంది. ఖమ్మం జిల్లాలో వరద ఉధృతికి రోడ్లు కోతకు గురవగా... మరికొన్ని చోట్ల కొట్టుకుపోయాయి. వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు-కోట్‌పల్లి-మోమిన్‌పేట,తాండూరు-మన్నేగూడ, తాండూరు-కొడంగల్‌, వికారాబాద్‌-పరిగి మార్గాల్లో రహదారులు గుంతలమయంగా మారాయి.




తాత్కాలిక మరమ్మతులు..

రాష్ట్రంలో కొన్ని చోట్ల.. దెబ్బతిన్న రహదారుల తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టారు. ఈ మరమ్మతుల కోసం రూ.50 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించినట్లు ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ రవీందర్‌రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 113 ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నట్లు గుర్తించామని ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.

అలాగే.. హైదరాబాద్‌-బెంగుళూరు, హైదరాబాద్‌-విజయవాడ రూట్లలో నాలుగు ప్రాంతాల్లో జాతీయ రహదారులకు రూ.11 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అప్పా చెరువుకు గండిపడటంతో ఎన్‌హెచ్‌-44పై గగన్‌పహాడ్‌ వద్ద 150 మీటర్ల మేర రోడ్డు కొట్టుకుపోయింది. ఎన్‌హెచ్‌-65పై కొత్తగూడ వద్ద బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డు దెబ్బతిన్నది. కాగా, మరమ్మతు పనులను చేపట్టినట్లు ఈఎన్‌సీ గణపతిరెడ్డి చెప్పారు.




వాహనాలు దెబ్బతినే ప్రమాదం

గుంతల రోడ్లపై ప్రయాణంతో వాహనాలూ దెబ్బతింటాయి. తరచూ గేర్లు మార్చాల్సి రావడం వల్ల క్లచ్‌ప్లేట్లు, గేర్లు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఎగుడుదిగుడు ప్రయాణంతో షాక్‌ అబ్జార్బర్లపై ఒత్తిడి పెరిగి పాడైపోవచ్చు. టైర్లు, రీములు, డిస్క్‌ బ్రేక్‌లపైనా ప్రభావం పడుతుంది. కార్లు అయితే చక్రాల మధ్య అలైన్‌మెంట్‌ మారే ప్రమాదముంది. మొత్తంగా.. కార్లకు 13 రకాల మరమ్మతులు అవచ్చే అవకావముందని మెకానిక్‌లు చెబుతున్నారు. ద్విచక్రవాహనాల్లో ఎనిమిది రిపేర్లు రావచ్చు.




గుంతల్లో ప్రయాణంతో.. ఎముకలు, నరాలపై ప్రభావం

గుంతలు పడ్డ రోడ్లపై ప్రయాణంతో డిస్క్‌లపై తీవ్ర ప్రభావం పడుతుంది. మెడ, వెన్నులో డిస్క్‌ల మధ్య గ్యాప్‌ రావడం లేదా ఒకే దగ్గరకు(బంచ్‌) రావడం జరుగుతోంది. దీంతో నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. మెడ వద్ద డిస్క్‌ల్లో సమస్యలుంటే స్పాండిలైటిస్‌, చేతుల్లో తిమ్మిర్లు రావడం జరుగుతుంది. వెన్ను డిస్క్‌ల్లో సమస్య ఉంటే నడుం నొప్పి, నరాలపై ఒత్తిడి వల్ల సయాటిక ప్రాబ్లమ్‌ వస్తుంది. దీంతో నడుం నుంచి అరికాలి వరకు లాగినట్టు అవు తుంది. 


జాగ్రత్తలివి...

 గుంతల రోడ్లపై వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి. 

 దూర ప్రయాణాలు పెట్టుకోకూడదు.

 వరద నీళ్లున్న చోట జాగ్రత్తగా వెళ్లాలి. గుంతలు కనపడక ప్రమాదాలు జరుగవచ్చు. 

 గుంతలు, కంకర తేలిన చోట స్పీడ్‌గా వెళ్లకూడదు. 

 సడెన్‌/డిస్క్‌ బ్రేకులు వేయకూడదు. 

- డాక్టర్‌ చంద్రశేఖర్‌ ఽధన్నాన, ఆర్ధోపెడిక్‌ సర్జన్‌


Updated Date - 2020-10-22T07:40:11+05:30 IST