రోడ్డెక్కిన కొవిడ్‌ బాధితులు

ABN , First Publish Date - 2020-08-10T09:43:59+05:30 IST

కొవిడ్‌ సెంటర్‌లో అసౌకర్యాలతో ఇబ్బంది పడుతున్నామని, సమయానికి భోజనం పెట్టడం లేదని బాధితులు ఆందోళనకు దిగారు.

రోడ్డెక్కిన కొవిడ్‌ బాధితులు

రోడ్డెక్కిన కొవిడ్‌ బాధితులు


 ఆదోని, ఆగస్టు 9: కొవిడ్‌ సెంటర్‌లో అసౌకర్యాలతో ఇబ్బంది పడుతున్నామని, సమయానికి భోజనం పెట్టడం లేదని బాధితులు ఆందోళనకు దిగారు. ఆదోని పట్టణంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని శిరుగుప్ప టర్నింగ్‌లో ఉన్న టిడ్కో కొవిడ్‌ సెంటర్‌లో 390 మంది కొవిడ్‌ బాధితులు ఉన్నారు. సమాయానికి భోజనం పెట్టడం లేదని, అది కూడా నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. ఆదోని-కర్ణాటక ప్రధాన రహదారిలో ధర్నాకు దిగారు.


విద్యుద్దీపాలు, ఫ్యాన్లు వంటి కనీస సౌకర్యాలు లేకపోతే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న నోడల్‌ అధికారి పవన్‌, డాక్టర్‌ సృజన్‌, వన్‌టౌన్‌ ఎస్‌ఐ రమేష్‌ బాబు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. బాధితులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ వారు వినుకోలేదు. తమ పట్ల అంత చులకనభావం ఏమిటని నిలదీశారు. సమయానికి భోజనం పెట్టడం లేదని, రుచీపచి లేని ఆహారం పెడుతున్నారని, ఇలా అయితే తమ ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందని నిలదీశారు. ఉదయం 10 గంటలు దాటినా అల్పాహారం ఇవ్వడం లేదని, మధ్యాహ్నం 3 దాటినా భోజనం పెట్టడం లేదని వాపోయారు. కమీషన్లకు కక్కుర్తి పడి తమ ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. హోం క్వారంటైన్‌కు వెళతామని, అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


చీకటి గదుల్లో ఉంటున్నామని, వారం గడిచినా శుభ్రం చేయలేదని వాపోయారు. రెండు గంటల పాటు ఆందోళన కొనసాగింది. వాహనాల రాకపోకలు స్థంభించాయి. వారికి సమాధానం చెప్పలేక అధికారులు తలలు పట్టుకున్నారు. నాణ్యమైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో చివరకు ఆందోళన విరమించారు. ఈ విషయంపై నోడల్‌ అధికారి పవన్‌ను ఫోన్‌లో సంప్రదించగా సీరియస్‌ అయ్యారు. ‘ఆంధ్రజ్యోతి పేపరా..? వచ్చి ఐడెంటిటీ కార్డు చూపించి అడుగు. నేను ఇక్కడే పడుంటా..’ అని ఫోన్‌ కట్‌ చేశారు.

Updated Date - 2020-08-10T09:43:59+05:30 IST