Abn logo
Sep 3 2021 @ 00:59AM

ఎన్నడూ లేనంతగా అప్రతిష్ఠ మూటగట్టుకున్న విశాఖ జిల్లా దేవదాయ శాఖ!

నర్సీపట్నంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం

దేవాలయాల్లో దొంగలుపడ్డారు!

ఒక్క నర్సీపట్నం పరిధిలోనే రూ.60 లక్షలు దుర్వినియోగం

ఒకే బిల్లుకు తొమ్మిదిసార్లు చెక్‌లు జారీ

ఉన్నతాధికారులకు భారీగా దక్షిణలు

కోర్టుకు వెళ్లిన ప్రతిసారీ రూ.25 వేలు

విజయవాడ వెళ్లడానికి రూ.50 వేలు

ఇళ్లలో ఫర్నీచర్‌కు రూ.లక్షలు

వార్షిక తనిఖీలు నిల్‌

ఇదీ దేవదాయ శాఖ దుస్థితి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): జిల్లాలో దేవదాయ శాఖ గతంలో ఎన్నడూ లేనంతగా అప్రతిష్ఠ మూటగట్టుకుంది. ఆవు చేనులో మేస్తే...దూడ గట్టున మేస్తుందా?...అనే చందంగా అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. హుండీల లెక్కింపు సమయంలో నిబంధనలను కాలరాచి సొమ్మును కొల్లగొడుతున్నారు. బ్యాంకుల్లో వేసిన ఆదాయాన్ని సైతం లేనిపోని ఖర్చుల పేరుతో విత్‌డ్రా చేసి సొంతానికి వాడుకుంటున్నారు. ఒకే బిల్లుకు తొమ్మిదిసార్లు చెక్‌ రాసి సొమ్ము తీసుకున్న వైనం నర్సీపట్నంలో ఇటీవల బహిర్గతమైంది. నర్సీపట్నం సహా పరిసర ప్రాంతాల ఆలయాలకు ఇన్‌చార్జిగా వ్యహరిస్తున్న అధికారి ఒకరు, ఇతర సిబ్బంది, పైఅధికారుల సహకారంతో గత ఏడాది కాలంలో సుమారు రూ.60 లక్షలు వరకు దుర్వినియోగం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. అధికారులు కోర్టుకు హాజరయ్యేందుకు వెళితే రూ.25 వేలు, విజయవాడ అర్జంట్‌ పనిమీద వెళితే రూ.50 వేలు, ఇంట్లో ఫర్నీచర్‌ చేయించుకుంటే రూ.80 వేలు ఇలా...ప్రతి ఇండెంట్‌కు నర్సీపట్నం ఆలయాల అధికారే డబ్బు సమకూరుస్తున్నారు. అధికారులు అనధికారికంగా డబ్బులు అడిగినప్పుడల్లా అక్కడి అధికారులు స్వామి కార్యం, స్వకార్యం రెండూ పూర్తి చేస్తున్నారు. 


లెక్కాపత్రం లేదు

నర్సీపట్నంలో దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయం, వెంకటేశ్వరస్వామి ఆలయం, బలిఘట్టంలో బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం, కల్యాణపులోవలో పోతురాజుబాబు ఆలయం, దారకొండలో దారాలమ్మ ఆలయానికి బాగా ఆదాయం వస్తుంది. వీటన్నింటినీ ఒక్కరే పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఆలయానికి బడ్జెట్‌ ఉంటుంది. క్యాష్‌ బుక్‌ ఉంటుంది. జీతాలు చెల్లించినా, ఏ రకమైన ఖర్చులు చేసినా ప్రతి అంశం ఆ పుస్తకంలో రాయాలి. చెక్‌ల ద్వారా డబ్బులు విత్‌డ్రా చేయాలంటే...ఉన్నతాధికారి అనుమతి తీసుకోవాలి. కానీ నర్సీపట్నం ఆలయాలను పర్యవేక్షిస్తున్న అధికారి ఈ నిబంధనలను పాటించలేదని ఇటీవల డిప్యూటీ కమిషనర్‌ నిర్వహించిన తనిఖీల్లో బయటపడింది. ఆలయాల్లో వివిధ పనులు నిర్వహించే కాంట్రాక్టర్లు, చిన్నచిన్న పనులు చేసే వారి పేర్ల మీద చెక్‌లు రాసి, వాటిని విత్‌డ్రా చేసుకున్నట్టు గుర్తించారు. వాటిని దేనికి వెచ్చించారో బిల్లులు, ఓచర్లు జత చేయాలి. అవి కూడా లేవు. ఇలా సుమారుగా రూ.60 లక్షల వరకు అన్ని ఆలయాల్లో పక్కదోవ పట్టించినట్టు సమాచారం.


ఈ ప్రాంత పరిధిలో బాగా నిధులు ఉన్నాయని, ఆదాయం వస్తున్నదని గుర్తించిన అధికారులు, వారి ప్రతి అవసరానికీ ఇక్కడి వారికి ఇండెంట్లు పెడుతుండడంతో బ్యాంకుల్లో విత్‌డ్రా చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయాల్లో హుండీల సొమ్ము పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలతో సస్పెండైన ఉద్యోగికి పేకాట ఆడే వ్యసనం ఉంది. ఎక్కడ తనిఖీలకు వెళ్లినా...అక్కడ పేకాట శిబిరంలో సిటింగ్‌ వేస్తారు. అక్కడ డబ్బులు పోతే...వెంటనే స్థానిక ఈఓను పిలిచి రూ.10 వేల నుంచి రూ.20 వేలు అర్జంట్‌గా తెమ్మని ఆదేశిస్తారు. ఇలాంటి ఖర్చులు కూడా దేవుడి ఖాతాలోనే వేస్తున్నారు. ఆలయాల తనిఖీకి రెండు, మూడు కార్లలో వెళ్లే అధికారులు కోడిమాంసం, మేక మాంసం కూరలు వండించుకొని ఆరగించడం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. నర్సీపట్నంలో మధ్యాహ్న భోజనం ఆరగించి, లంబసింగిలో రాత్రి బసకు ఏర్పాట్లు చేసుకొని, అక్కడ రాత్రి విందుకు కూడా మరో రెండు రకాల నాన్‌వెజ్‌ రకాలు వండించుకొని తీసుకువెళుతున్నారు. ఈ ఖర్చులు కూడా దేవుడి సొమ్ము నుంచే.. 


వార్షిక తనిఖీలు లేవు

ఇటీవల ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్ల శాఖలో భారీ కుంభకోణాలు వెలుగు చూశాయి. ముఖ్యమంత్రి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తంచేసి, మిగిలిన శాఖల్లో ఏమి జరుగుతున్నదో చెక్‌ చేసుకోవాలని ఆదేశించారు. ఆ మేరకు దేవదాయ శాఖ ఉన్నతాధికారులు అన్ని ఆలయాల్లో రికార్డులు సరిచూసుకోవాలని, ఇన్‌స్పెక్షన్లు చేయాలని ఆదేశించారు. నెల రోజులు అవుతున్నా ఇక్కడ ఆ కార్యక్రమమే చేపట్టలేదు. జిల్లాలో ‘ఎందెందు వెదికినా అందందే...’ అన్నట్టుగా ఇక్కడ ఏ ఆలయం చూసినా అవినీతిమయమే. వారికిచ్చే వ్యక్తిగత టార్గెట్‌ సాధించడానికి ఏదో ఒక తప్పు చేసి దక్షిణలు సమర్పించుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఇన్‌స్పెక్షన్ల పేరుతో ఇంకెంత వసూలు చేస్తారోనని భయంతో వణికిపోతున్నారు.


విజిలెన్స్‌ ఏమి చేస్తున్నదో..?

జిల్లాలోని ఆలయాల్లో విచిత్ర పోకడలు, హుండీల సొమ్ము గల్లంతు, ఆలయాల స్వాధీనం, విచిత్రమైన రీతిలో తిరిగి అప్పగించడం, పరిధులు దాటి ఉద్యోగులు వ్యవహరించడం, సిబ్బందిని సొంత పనులకు ఉపయోగించుకోవడం...ఇలా అనేక అక్రమ వ్యవహారాలు జరుగుతున్నా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టడం లేదు. విజిలెన్స్‌ గానీ ఏసీబీ గానీ దృష్టి పెట్టడం లేదు. అక్రమాలకు పాల్పడే వారికి రాజకీయ అండదండలు ఉండడమే ఇందుకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.