కొవిడ్‌ పేరుతో దోపిడీ!

ABN , First Publish Date - 2021-09-01T04:56:12+05:30 IST

కరోనా వ్యాప్తి వేళ.. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రజల్లో నెలకొన్న కరోనా భయాన్ని ఆస్పత్రుల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. మూడోదశ కరోనా ముప్పు.. చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న ప్రచారం నేపథ్యంలో తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతున్నారు.

కొవిడ్‌ పేరుతో దోపిడీ!


- పది నిమిషాల్లో ఫలితం... ఆ తర్వాతే వైద్యం

- ర్యాపిడ్‌ టెస్టుకి రూ.1400

- ప్రైవేటు ఆస్పత్రుల్లో దందా

- మూడో దశ ముప్పు పేరిట అక్రమాలు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

కరోనా వ్యాప్తి వేళ.. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రజల్లో నెలకొన్న కరోనా భయాన్ని ఆస్పత్రుల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. మూడోదశ కరోనా ముప్పు.. చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న ప్రచారం నేపథ్యంలో తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతున్నారు. పిల్లలకు చిన్నపాటి జ్వరం, జలుబు, దగ్గు.. ఇతరత్రా అనారోగ్య సమస్యలు వచ్చిన వెంటనే ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. చిన్నపిల్లల వైద్యనిపుణులు ఉంటారనే కారణంతో జిల్లా నలుమూలల నుంచి అనేక మంది శ్రీకాకుళంలోని ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా అక్కడి నిర్వాహకులు అందినకాడికి దోచేస్తున్నారు. చిన్నారులకు తప్పనిసరిగా కరోనా పరీక్షలతో పాటు.. మరికొన్ని ఆరోగ్య పరీక్షలు చేయాలని సూచిస్తున్నారు. తమ వద్ద కొవిడ్‌ పరీక్ష చేయించుకుంటే.. పది నిమిషాల్లోనే ఫలితం వస్తుందని చెబుతున్నారు. కరోనా ఫలితాన్ని బట్టి చికిత్స చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ర్యాపిడ్‌ టెస్టుకి రూ.1400 చొప్పున వసూలు చేస్తున్నారు. దీంతో తల్లితండ్రులు గందరగోళానికి గురవుతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో  కరోనా పరీక్షలు చేసినా.. ఫలితాలు వచ్చేసరికి కనీసం ఒక రోజు పడుతుంది. దీంతో చేసేది లేక.. ప్రైవేటు ఆస్పత్రుల్లోనే కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.750కు చేయాల్సిన కొవిడ్‌ ర్యాపిడ్‌ టెస్టు కోసం.. ప్రైవేటు ఆస్పత్రుల్లో రెట్టింపు ధర వసూలు చేస్తున్నారు. పరీక్షించిన అనంతరం పాజిటివా? నెగిటివా? అన్నది మాత్రమే చెబుతున్నారు. కానీ ఎటువంటి రిపోర్టు బాధితులకు ఇవ్వడం లేదు. ఓపీ ధర రూ.400, కరోనా ర్యాపిడ్‌ పరీక్షలకు రూ.1400, ఫలితం నెగిటివ్‌ వచ్చినా మందుల కోసం సుమారు రూ.300 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. కరోనా పాజిటివ్‌ వస్తే అదనంగా సీబీసీ, సీపీఆర్‌ వంటి రక్త పరీక్షలను చేయిస్తున్నారు. వీటికోసం ఆస్పత్రి ల్యాబ్‌లోనే రూ.1100 వంతున వసూలు చేస్తున్నారు. మందుల ఖర్చు అదనం. వాస్తవానికి చిన్నారులకు శస్త్రచికిత్స అత్యవసరమైతేనే.. కొవిడ్‌కు సంబంధించి ముందుగా ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించేందుకు ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇష్టానుసారంగా ర్యాపిడ్‌ పరీక్షలు చేసి.. దోపిడీకి పాల్పడుతున్నారు. దీంతో బాధితులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. 

 దృష్టి సారించని అధికారులు...

ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీ నియంత్రణపై అధికారులు దృష్టి సారించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా కొవిడ్‌ టెస్టు కోసం రెట్టింపు డబ్బులు వసూలు చేస్తున్నా.. ఆస్పత్రులపై చర్యలు చేపట్టడం లేదు. కనీస స్థాయిలో తనిఖీలు చేయకపోవడంతో ఆస్పత్రుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రెండు నెలల కిందట శ్రీకాకుళంలో కొవిడ్‌ వైద్యం చేస్తున్నాయంటూ.. మూడు ఆస్పత్రులకు అపరాధ రుసుం వసూలు చేశారు. తర్వాత పరిస్థితి షరా మామూలే. ఇప్పటికైనా కలెక్టర్‌, జేసీలు స్పందించి ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకంపై దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు. ఈ విషయమై డీఎంహెచ్‌వో చంద్రానాయక్‌ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. దీనిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్‌ పరీక్షలు ఉచితంగానే చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. 




Updated Date - 2021-09-01T04:56:12+05:30 IST