దోచుకుంటున్నారు..

ABN , First Publish Date - 2021-05-10T05:10:07+05:30 IST

దేవునికడపకు చెందిన ఓ యువకుడు ఆరు రోజుల క్రితం కరోనా అనుమానిత లక్షణాలతో రిమ్స్‌లో మృతి చెందాడు.

దోచుకుంటున్నారు..

అంబులెన్స్‌ నిర్వాహకుల ఇష్టారాజ్యం

మృతదేహానికో రేటు

రిమ్స్‌ నుంచి కడప సిటీలోకి మృతదేహం తరలించాలంటే రూ.10 వేలు

దూర ప్రాంతాలకైతే రూ.25 వేల పైమాటే.. 


కడ ప, మే 9 (ఆంధ్రజ్యోతి): దేవునికడపకు చెందిన ఓ యువకుడు ఆరు రోజుల క్రితం కరోనా అనుమానిత లక్షణాలతో రిమ్స్‌లో మృతి చెందాడు. సొంతూరులో దహన సంస్కారాలు నిర్వహించేందుకు మృతదేహాన్ని రిమ్స్‌ నుంచి దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవునికడపకు తరలించేందుకు అంబులెన్స్‌ కోసం ప్రయత్నించగా నిర్వాహకులు చెప్పే రేటును చూసి వారి దిమ్మ తిరిగిపోయింది. రూ.10 వేలు ఇస్తే మృతదేహాన్ని దేవునికడపకు తరలిస్తామంటూ చెప్పారు. చివరికి రూ.9 వేలు ఇచ్చి మృతదేహాన్ని తెచ్చుకున్నారు. 

ఫ పోరుమామిళ్ల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల రిమ్స్‌లో మృతి చెందాడు. సొంతూరులో అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించగా అంబులెన్స్‌ నిర్వాహకులు చెప్పిన బాడుగ రేటు విని కళ్లు బైర్లు కమ్మాయి. రూ.30 వేలు ఇస్తే వస్తామని డిమాండ్‌ చే శారు. చివరికి విధి లేని పరిస్థితుల్లో నిర్వాహకులు చెప్పినంత చెల్లించక తప్పింది కాదు.

ఇవి ఉదాహరణలు మాత్రమే. కొవిడ్‌ బాధితులు పడుతున్న కష్టాలు పగవారికి కూడా రాకూడదని కోరుకునే పరిస్థితి వచ్చింది. ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే అక్కడ ట్రీట్‌మెంటుకు డబ్బులు కట్టలేక ఒకపక్క సతమతమవుతున్నారు. మరో పక్క కొవిడ్‌, లేదా అనుమానిత లక్షణాలతో వచ్చిన వారికి చివరి మజిలీ అయిన దహన సంస్కారాలను కూడా నిర్వహించలేకపోవడం పేదలకు భారంగా మారింది. మరోపక్క వ్యాధి బారినపడి ఆసుపత్రికి వెళ్లాలంటే ప్రైవేటు వాహనాలు డిమాండ్‌ చేస్తే ఆసుపత్రి మెట్లెక్కకముందే బాధితులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో జనం నుంచి ఎక్కువ వినబడుతున్న మాటలు మూడే మూడు. ఒకటి కరోనా పాజిటివ్‌ వైరస్‌, రెండు ప్రైవేటు వైద్యశాల ట్రీట్‌మెంటుకయ్యే ఖర్చు, మూడు అంబులెన్స్‌ల దోపిడీ గురించే. 

జిల్లా వైద్యానికి పెద్దదిక్కుగా కడప రిమ్స్‌ పేరుగాంచింది. ప్రైవేటు ఆసుపత్రులన్నీ కడపలోనే ఎక్కువగా ఉన్నాయి. పోరుమామిళ్ల, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, రాయచోటి ప్రాంతాల నుంచి చికిత్స కోసం కడపకు వస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అంబులెన్స్‌ నిర్వాహ కులు కొన్ని ప్రైవేటు వాహనాలు బాఽధితులను  బాదేస్తున్నాయి. వేలాది రూపాయలు ముట్టజెప్పితే తప్ప రాని పరిస్థితి నెలకొంది. మెరుగైన వైద్యం కోసం కడప నుంచి తిరుపతికి వెళ్లాలంటే రూ.25 వేల నుంచి రూ.30 వేలు అంబులెన్స్‌ నిర్వాహకులు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. హైదరాబాదు అయితే డిమాండ్‌ను బట్టి రూ.40 వేల నుంచి రూ.50 వేలు అడుగుతున్నట్లు సమాచారం. వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఇలాంటి తరుణంలో ప్రాణాలను ఫణంగా పెట్టి డెడ్‌బాడీలు తరలిస్తున్నాం. అంత రిస్కు తీసుకుంటున్నాం కాబట్టే మేం అడిగినంత ఇవ్వాలంటూ నిర్వాహకులు డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఇటీవల కడప కార్పొరేషన్‌ పరిధిలో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అఽధికారులు వాహనాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఉచితంగా తరలిస్తారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజులు నియంత్రణలో పెట్టినట్లు అంబులెన్స్‌లకు కూడా ధరలను ఫిక్స్‌ చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2021-05-10T05:10:07+05:30 IST