Abn logo
Dec 1 2020 @ 01:49AM

రబీకి ఆ నాలుగే..!

సాగుకు ఆ రకాల వరి విత్తనాలే వేయాలి  

డ్యామ్‌ నిర్మాణం వల్ల  120 రోజుల పంటకే నిర్ణయం

10వ తేదీలోపు విత్తనాలు వెదజల్లాలి 

డ్రమ్‌ సీడర్ల సమస్యతో  చేతితో వెదజల్లాలి

ఇంకా పూర్తికాని ఖరీఫ్‌ మాసూళ్లు

మరోపక్క తుఫాను దెబ్బ 

 రైతు ఎలా ముందుకెళతాడో మరి

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ముందస్తు రబీ కోసం నాలుగు రకాల వరి విత్తనాలను వ్యవసాయశాఖ సిఫారసు చేసింది. కాఫర్‌ డ్యామ్‌ పనులు చేపడుతుండడం వల్ల మార్చి 31వ తేదీకే కాలువలను మూసివేయ డానికి నీటిపారుదల శాఖ అడ్వయిరీ బోర్డ్‌ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో రబీని కేవలం 120 రోజులకు కుదించాలనే నిర్ణయానికి జిల్లా యంత్రాంగం వచ్చింది. సాధారణంగా రబీకి 120 రోజుల నుంచి 135 రోజుల్లో పండే రకం విత్తనాలు మన రైతులు వాడతారు. జిల్లాలో గోదావరి కాల్వల కింద 1,50,585 హెక్టార్లలో రబీ సాగు చేస్తారు. గతేడాది కూడా  అంతే. కానీ అప్పట్లో 12 రకాలకు పైగా వరి విత్తనాలను రైతు సాగుచేశారు. ఈసారి కేవలం 120 రోజుల్లోనే పంట సాగు చేయవలసి ఉన్నందున అధికారులు కేవలం నాలుగు రకాలను సిఫారసు చేశారు. ఆ వెరైటీలు.. శ్రీధృతి (ఎంటీయు -1121), తెలంగాణకు చెందిన సోనా (ఆర్‌ ఎన్‌ఆర్‌- 15048), అభివృద్ధిపరిచిన సాంబ (ఆర్‌పీబైయో-226), నెల్లూరు సోనాలు (ఎన్‌ఎల్‌ఆర్‌ 34449) రకాల వరి విత్తనాలను ఈ రబీకి సాగు చేయాలని సూచించారు. రబీ సాగుకు ఈ విత్తనాలను డిసెంబరు 10వ తేదీ నాటికే పొలాల్లో జల్లేయాలి. సెంట్రల్‌ డెల్టా (కోనసీమ)లో  5వ తేదీ నుంచి 10వ తేదీలోపు పూర్తికావాలి. తూర్పు డెల్టాల్లో డిసెంబరు 1 నుంచే మొదలెట్టి 10వ తేదీకి పూర్తి చేయాలి. మార్చి 31న కాలువలకు నీరు ఆపేస్తారు.  అప్పటి నుంచి ఈ పొలాలకు నీటి తడి ఉండదు. ఇవన్నీ 120 రోజుల్లో పంట చేతికొస్తాయి. 

డ్రమ్‌ సీడర్లు పనిచేయవు

రబీ సాగు రైతుకు సమస్య అయ్యేలా కనిపిస్తోంది. ఉంది. డైరెక్ట్‌ సోయింగ్‌ (నేరుగా విత్తనాలు వెదజల్లడాన్నే అధికారులు సిఫారసు చేశారు. సాధారణంగా డ్రమ్‌ సీడర్లను ఉపయోగించి నేరుగా పొలాల్లో విత్తనాలు జల్లుతుంటారు. కానీ డెల్టాలోని దమ్ము చేలలో డ్రమ్‌సీడర్లు దిగిపోతున్నాయి. మన రైతులకు ఇది అనుభవంలోకి వచ్చింది. దీంతో అధికారులు కూడా డ్రమ్‌సీడర్లను వినియోగించమని చెప్పడంలేదు. నేరుగా చేతితోనే విత్తనాలు జల్లమని చెబుతున్నారు. దీనికి రైతుకు నైపుణ్యత ఉండాలి.  చేతిలో చల్లేటప్పుడు పొలంలోనే అనిచోట్ల సమానంగా విత్తనాలు పడేలా చూడాలి. ఒకచోట గుంపుగా పడితే ఇబ్బంది ఉంటుంది. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రమ్‌ సీడరైతే ఒకే గ్యాప్‌లో వరసగా విత్తనాలు గుచ్చుకుంటూ పోతుంది. ఇక్కడ అది పనిచేయదు.

కోతలు పూర్తి కాలేదు

ప్రస్తుత సీజన్‌లో కాఫర్‌ డ్యామ్‌ వల్లే కాకపోయినా ఏటా మందస్తు రబీ అవసరమ నేది చాలాకాలం నుంచి వినబడుతోంది. రబీ త్వరగా మొదలైతే కాల్వల క్లోజర్‌ సమయంలో కాల్వల పనిచేసుకోవచ్చు. అంతేకాక ఖరీఫ్‌ కూడా త్వరగా మొదలవుతుంది. తుఫాన్లు  వచ్చే సమయానికే పంట మాసూళ్లు పూర్తి చేసుకోవచ్చనేది ఒక అంచనా. కానీ ఈసారి కాఫర్‌ డ్యామ్‌ వల్ల ఈ సీజన్‌లో ముందస్తు రబీకి సిఫారసు చేశారు. ఇది మంచిదే కానీ ఖరీఫ్‌ మాసూళ్లు ఇంకా పూర్తి కాలేదు. తూర్పు డెల్టాలో 90 శాతం కోతలు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ కోనసీమలో ఇంకా 55 శాతం వరకూ మాత్రమే పూర్తయ్యాయి. పైగా ఇటీవల తుఫాను వల్ల భారీగా పంట  దెబ్బతింది. పొలాల్లో పనల మీద ఎక్కువ పంట ఉంది. అవన్నీ తడిచి ముద్దయిపోయాయి. ఇవన్నీ మాసూలు చేసుకోవాలంటే కచ్చితంగా సమయం పడుతుంది. ప్రభుత్వం కూడా తడిచిన ధాన్యాన్నీ కొనాలి. అప్పుడు కొంతవరకు రబీకి సానుకూలం కావొచ్చు.

Advertisement
Advertisement
Advertisement